ఈ వైసీపీ నేతలు తిరుగుడే…తిరుగుడు….!

వైసీపీ ఎంపీలు మరోసారి హస్తిన బాట పట్టనున్నారు. తమ రాజీనామాల ఆమోదం కోసం వత్తిడి పెంచాలని నిర్ణయించుకున్నారు. వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసి నెలన్నర గడుస్తున్నా వాటికి ఆమోదం లభించలేదు. స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇప్పటికి మూడుసార్లు ఎంపీలతో భేటీ అయ్యారు. వారితో చర్చించారు. పునరాలోచించుకోవాలని చెప్పినా తాము ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసమే రాజీనామాలుచేశామని, వాటిని ఆమోదించాల్సిందిగా స్పీకర్ ను గట్టిగా కోరి వచ్చారు. అయితే స్పీకర్ విదేశీ పర్యటనకు వెళ్లడంతో వారి రాజీనామాల విషయం ఇంకా తేలలేదు.

టీడీపీ విమర్శలు తట్టుకోలేక…..

మరోవైపు తెలుగుదేశం పార్టీ వైసీపీ ఎంపీల రాజీనామాలను నాటకంగా ప్రచారం చేస్తోంది. బీజేపీ, వైసీపీలు కుమ్మక్కై రాజీనామాలు డ్రామాలు ఆడుతున్నాయని, వాటిని ఆమోదించరని, ఒకవేళ ఆమోదించినా ఎన్నికలు రాకుండా జాగ్రత్త పడతారని చెబుతూ వస్తున్నారు. ఇది వైసీపికి కొంత ఇబ్బందికర పరిణామమే. రాజీనామాలు చేసి కూడా ప్రజల్లో పలుచన అయిపోతున్నామన్న భావన వైసీపీ నేతల్లో కలుగుతుంది. ఇంకా ఆలస్యం చేస్తే రాజీనామాలకు విలువ ఉండదని గ్రహించిన వైసీపీ ఎంపీలు మరోసారి హస్తినకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

మరోసారి హస్తినకు…..

స్పీకర్ సుమిత్రా మహాజన్ విదేశీ పర్యటన నుంచి వచ్చిన వెంటనే ఢిల్లీ వెళ్లేందుకు వైసీపీ ఎంపీలు ప్లాన్ చేసుకుంటున్నారు. అవసరమైతే మరోసారి స్పీకర్ ను కలిసి తమ రాజీనామాలను వెంటనే ఆమోదించుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే తాము నైతికంగా ఎంపీ పదవులకు రాజీనామాలు చేసినట్లేనని, సాంకేతికంగానే అవి ఆమోదం పొందాల్సి ఉంటుందని చెబుతున్నారు. తాము చిత్తశుద్ధితో రాజీనామాలు చేసినా….టీడీపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం నాటకాలుగా అభివర్ణిస్తుందని చెబుతున్నారు. దమ్ముంటే టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేయాలని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సవాల్ విసిరారు.

ఆ ముగ్గురిపై అనర్హత వేటు….

తమ రాజీనామాలను ఆమోదించుకోవడమే కాకుండా వైసీపీ నుంచి గెలిచి పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎంపీలపై కూడా అనర్హత వేటు వేయాలని స్పీకర్ పై వత్తిడి తేవాలని నిర్ణయించారు. ఇప్పటికే అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత, నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డికి సంబంధించిన ఆధారాలను స్పీకర్ కు అందజేశారు. తాజాగా కర్నూలు ఎంపీ బుట్టా రేణుకకు సంబంధించిన ఆధారాలను కూడా ఇవ్వనున్నారు. బుట్టారేణుక పార్టీ మారకపోయినా టీడీపీ సమావేశాల్లో పాల్గొన్న వీడియోలను స్పీకర్ కు అందజేయనున్నారు. మొత్తం మీద వైసీపీ ఎంపీలు తమ రాజీనామాల ఆమోదం కోసం మరోసారి హస్తిన బాట పట్టనున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*