వైసీపీ నేత ఫ్యూచ‌ర్ తిర‌గ‌బ‌డుతోందా..!

పాల‌ప‌ర్తి డేవిడ్ రాజు. ప్రకాశం జిల్లాలో టీడీపీ సీనియ‌ర్ నేత‌. అయితే, ఆయ‌న‌కు రాజ‌కీయంగా ప‌రిస్థితులు అనుకూలించ‌డం లేద‌నే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. యువ నేత‌గా, ఎస్సీ వ‌ర్గానికి చెందిన నాయ‌కుడిగా కూడా ఆయ‌న గుర్తింపు పొందారు. అయితే, అనూహ్యంగా ఆయ‌న తీరు వివాదాస్పదంగా మారుతోంద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రతి విష‌యంలోనూ ఆయ‌న తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీకి చెడ్డపేరు తెస్తున్నాయ‌ని, స్థానికంగా టీడీపీ నేత‌ల‌కు ఆయన పెద్దగా వాల్యూ ఇవ్వడం లేద‌ని అంటున్నారు. మ‌రి ఇంత వ్యతిరేక‌త ఎలా వ‌చ్చింది ? ఎందుకు ఆయ‌న‌పై నాయ‌కులు మండి ప‌డుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌రిస్థితి ఏంటి ? ఆయ‌న‌పై ప్రజ‌ల అభిప్రాయం ఎలా ఉంది ? వ‌ంటి కీల‌క విష‌యాలు చ‌ర్చకు వ‌స్తున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. 2009 ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్యర్థిగా ప్ర‌కాశం జిల్లా ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం య‌ర్రగొండ‌పాలెం నుంచి డేవిడ్ రాజు పోటీ చేశారు.

గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి…….

అయితే, ఆ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బ‌రిలోకి దిగిన ఆదిమూల‌పు సురేష్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు.వాస్తవానికి గ‌ట్టి పోటీ ఇచ్చే స్థాయిలో ఉన్నప్పటికీ.. డేవిడ్ రాజు వ్యవ‌హార శైలే అప్పటి ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు వ్యతిరేకంగా మారింద‌నే విశ్లేష‌ణ‌లు ఊపందుకున్నాయి. ఇక‌, దీంతో ఎన్నికల త‌ర్వాత ఆయ‌న వైసీపీలో చేరిపోయారు. 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ టికెట్‌పై ఆయ‌న ఇదే య‌ర్రగొండ‌పాలెం నుంచి బ‌రిలోకి దిగారు. ఈ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ హ‌వా భారీ ఎత్తున సాగ‌డంతో ఆయ‌న గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కే అయింది. 85 వేల పైచిలుకు ఓట్లు సాధించారు. అదే ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్యర్ధిగా బుడాల అజితా రావు పోటీ చేసినా.. పెద్దగా పోటీ ఇవ్వలేక‌పోయారు. దీంతో డేవిడ్ రాజు దాదాపు 20 వేల ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు. అయితే, వైసీపీ అధికారంలోకి రాక‌పోవ‌డంతో ఆయ‌న మ‌ళ్లీ త‌న సొంత గూటికి చేరుకున్నారు. మ‌రో ఏడెనిమిది మాసాల్లోనే ఎన్నిక‌లు ఉండ‌డంతో చంద్రబాబు ఈ నియోజ‌క‌వ‌ర్గంపై ఇటీవ‌ల స‌ర్వేచేయించారు.

టీడీపీలో చేరినా……..

దీనికితోడు జిల్లా పార్టీ అధ్య క్షుడు దామ‌చ‌ర్ల జ‌నార్దన్ కూడా ఇక్కడి విష‌యాల‌పై అధ్యయనం చేశారు. డేవిడ్ రాజుపై సొంత పార్టీలోనే వ్యతిరేక‌త కొట్టొచ్చిన‌ట్టు క‌నిపించింది. దీంతో డేవిడ్‌రాజును పక్కన పెట్టడం ఖాయంగా తెలుస్తోంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీలో నిలిచి, ఎమ్మెల్యేగా గెలిచిన డేవిడ్‌ రాజుకు రాబోయే ఎన్నికల్లో జనం ఓట్లేయరని టీడీపీ అధిష్టానం నిర్ణయానికొచ్చింది. ఇక నియోజకవర్గానికి చెందిన టీడీపీ కీలక నేతలు ఈ దఫా డేవిడ్‌ రాజుకు టికెట్‌ ఇస్తే తాము పనిచేయమని అధిష్టానానికి తేల్చి చెప్పినట్లు సమాచారం.

నియోజకవర్గాన్ని మార్చాలంటూ……

దీంతో చంద్రబాబు డేవిడ్‌రాజును పక్కన పెట్టనున్నట్లు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. దీన్ని పసిగట్టిన డేవిడ్‌రాజు తనకు సంతనూతలపాడు టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. అయితే, దీనిని కూడా ఇచ్చే ప‌రిస్థితిలో లేర‌ని, నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్ విభ‌జ‌న జ‌రిగితే.. అప్పుడు ఏదైనా ఛాన్స్ ఉంటుందేమో అంటున్నారు. ఏదేమైనా .. పార్టీని దిగువ స్థాయిలో అభివృద్ధి చేయ‌క‌పోవ‌డం, ప్రజ‌ల క‌ష్టాలు తెలుసుకోవ‌డంలో ఆయ‌న వెనుక‌బ‌డ‌డం వంటి కీల‌క అంశాలు డేవిడ్ రాజుకు ముప్పుగా మారాయ‌ని అంటున్నారు. మ‌రి ఆయ‌న ఫ్యూచ‌ర్ గంద‌ర‌గోళ‌మేన‌ని చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*