వైసీపీలో ఆయనే ఎందుకిలా?

రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ఎంపీ ప‌ద‌వుల‌ను తృణ‌ప్రాయంగా వ‌దిలేసి కేంద్రంపై పోరాడామ‌ని, త‌మ చేతిలో ఉన్న అస్త్రాన్ని సంధించేశామ‌ని వైసీపీ ఎంపీలు ప్ర‌చారం చేసుకుంటున్నారు. అయితే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జ‌లు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఆలోచిస్తున్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై స‌భ‌ల్లో ఉండి పోరాడి.. సాధించుకోవాల‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అస‌లే ఎన్నిక‌ల స‌మయం ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో నిధులు సంపాదించు కునేందుకు ప్ర‌యత్నిస్తున్నారు ఒక వైసీపీ మాజీ ఎంపీ. ఢిల్లీలో చ‌క్కెర్లు కొడుతూ.. కేంద్ర పెద్ద‌ల‌తో మంత‌నాలు జరుపుతున్నారు. రాజీనామా చేసినా త‌న నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధికి కట్టుబ‌డి ఉన్నాన‌ని చెబుతూ.. ప్ర‌జ‌ల్లో మైలేజ్ కొట్టేస్తున్నారు. మిగిలిన ఎంపీలంద‌రూ అసంతృప్తితో అజ్ఞాత‌వాసులుగా మారిపోయిన త‌రుణంలో.. ఆయన మాత్రం దేశ రాజధానిలో కేంద్ర మంత్రుల కార్యాల‌యాల్లో క‌నిపిస్తూ అంద‌రికీ షాకిచ్చారు.

నియోజకవర్గాలకే…..

రాజీనామాలు చేసిన త‌ర్వాత వైఎస్సార్ సీపీ ఎంపీలు నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. పార్ల‌మెంటులో హాట్‌హాట్‌గా స‌మావేశాలు జ‌రుగుతుంటే.. అందులోనూ టీడీపీ ఎంపీలు రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం పోరాడుతున్నారు. కేంద్ర మంత్రుల‌పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. నాలుగేళ్లుగా సైలెంట్‌గా ఉన్నా.. ఇప్పుడు పోరాడుతున్నార‌నే భావ‌న ప్ర‌జ‌ల్లోకి వెళుతోంది. ఇదే స‌మ‌యంలో వైసీపీఎంపీలు నాలుగున్న‌రేళ్లుగా పోరాడి.. చివ‌ర‌కు రాజీనామా చేసినా వీరిపై నెగెటివ్ కామెంట్లు వినిపిస్తున్నాయి. రాజీనామాలు చేసి పార్లమెంట్ బయట నిలబడి ధర్నాలు చేస్తే ఏమొస్తుందన్న విమర్శలు వచ్చాయి. మైలేజ్ వ‌స్తుంద‌ని భావిస్తే.. తీరా ఇప్పుడు ప్ర‌జ‌ల్లో మ‌రో విధంగా స్పంద‌న రావ‌డంతో.. ఐదుగురు మాజీ ఎంపీల్లో అంత‌ర్మ‌థ‌నం మొద‌లైంది. ఎంపీలు ఢిల్లీ నుంచి వెళ్లిపోయారు.

నిధుల కోసమే…..

ఎంపీ పదవులకు రాజీనామాలు తమ ఇమేజ్‌ను కాపాడుకునే ప్రయత్నాలు మాత్రం చేస్తున్నారు. పదవులకు రాజీనామాలు చేసినా తమ బాధ్యతలు మాత్రం నిర్వహిస్తున్నామని చెప్పుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు మాజీ ఎంపీ వరప్రసాద్. అందుకే ఢిల్లీలో వాలిపోయారు. ఎవర్ని కలుస్తున్నారో ఎందుకు కలుస్తున్నారో కానీ తాను సిన్సియర్‌గా ఎంపీ బాధ్యతలు నిర్వహిస్తున్నాని చెప్పుకునేందుకు మీడియా ముందుకు వచ్చారు. తాను మంత్రులందరినీ కలు స్తున్నానని.. తన నియోజకవర్గానికి సంబంధించిన పనుల కోసం అధికారులను కలుస్తున్నామని చెప్పుకున్నారు. ఓఎన్జీసీ అధికారులను కలిసి వాటర్ ప్లాంట్లు, ఆరోగ్యమంత్రిని కలిసి రుయా, స్విమ్స్‌లకు చెరో రూ. 50 కోట్లు ఇవ్వాలని కోరామంటున్నారు. ఎంపీని కాకపోయినా నిధుల కోసం అందరి చుట్టూ తిరుగుతున్నానని అది సిన్సియారిటీ అన్నారు.

అందుకే ఆయన అలా……

మామూలుగా వైసీపీ తాజా మాజీ ఎంపీలు.. కలసి కట్టుగా కార్యక్రమాలు ఫిక్స్ చేసుకుంటారు. కానీ ఈసారి మాత్రం మిగతా నలుగురు ఎంపీలు రాలేదు. వరప్రసాద్ ఒక్కడే ఢిల్లీకి వచ్చారు. తమతో ఒత్తిడి చేసి మరీ రాజీనామాలు చేయించారన్న అసంతృప్తి ఎంపీల్లో ఉందన్న ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గాల్లో కూడా వైసీపీ ఎంపీలపై ఒత్తిడి పెరుగుతోంది. సమస్యలు పరిష్కరించకుండా.. పదవులు వదిలేయడం ఏమిటన్న ప్రశ్న వారికి ప్రధానంగా ఎదురవుతోంది. అందుకే పదవులు వదలిసేసినా ఎంపీ స్థాయిలో పని చేస్తున్నామని చెప్పుకునేందుకు వరప్రసాద్ తన నియోజకవర్గానికి చెందిన సమస్యల పరిష్కారం కోసం.. ఢిల్లీ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి తమ రాజీనామాలు తప్పేనని.. వరప్రసాద్ పరోక్షంగా తన చేతల ద్వారా నిరూపిస్తున్నారా ? అన్న సందేహాలు కూడా క‌లుగుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*