వైసీపీ వీడినందుకు ఇప్పుడు ఆమె ‘‘వంత’’య్యింది….!

రంప‌చోడ‌వ‌రం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి టీడీపీ లెక్క‌కు మిక్కిలిగా నాయ‌కులు పోటీ ప‌డుతున్నారు. ఏకంగా న‌లుగురు కీల‌క అభ్య‌ర్థులు ఈ టికెట్ కోసం పోటీ ప‌డుతున్నారు. దీంతో టికెట్ కోసం ఇక్క‌డ కుస్తీ ప‌ట్టే ప‌రిస్థితి రానుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వచ్చే ఎన్నికల్లో రంపచోడవరం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి ఎవరు? చర్చనీయాంశంగా మారిన ఈ ప్రశ్నకు తెలుగుదేశం అధిష్ఠానమే పరోక్షంగా తెరలేపింది. రాష్ట్రవ్యాప్తంగా 40 నియోజక వర్గాల్లో అభ్యర్థులను ముందుగానే ప్రకటించాల్సిన ఆవశ్యకతను గుర్తించిన పార్టీ అధిష్ఠానం ఈ దిశగా చర్యలు చేపడు తున్న నేపథ్యంలో రంపచోడవరం నియోజకవర్గం కూడా అందులో ఉంటుందా అన్నది క్యాడర్‌లోనే కాకుండా అన్ని వర్గాల్లో కూడా చర్చనీయాంశగా మారింది.

తనకు టిక్కెట్ వస్తుందన్న……

ఇక్కడి అభ్యర్థిత్వం కోసం వైసీపీ నుంచి వచ్చిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ప్రయత్నాలతోపాటు ధీమాగా ఉన్నారు. టికెట్‌ ఖరారు హామీతోనే వైసీపీ నుంచి ఆమె ఇక్కడకు వచ్చారని, ఆ మాట మేరకే చంద్రబాబు తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తారని ఆమె భావిస్తున్నారు. సీనియర్‌ నేతగా మూడుసార్లు వరుస విజయాలతో హ్యాట్రిక్‌ సాధించిన మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వరరావు కూడా ధీమాగానే ఉన్నారు. 11 మండలాల నియోజకవర్గానికి తనకు ఉన్న రాజకీయ అనుభవం, గోదావరి తీర ప్రాంతాల్లో ఉన్న బంధుత్వాలు, పార్టీ క్యాడర్‌తో ఉన్న అనుబంధాలు తనకు అవకాశాన్ని తెచ్చిపెడతాయని ఆయన భావిస్తున్నారు.

ముఖ్య నేతల ఆశీస్సులతో……

ఇక‌, రంపచోడవరం మరో మాజీ ఎమ్మెల్యే చిన్నం బాబూ రమేష్‌ కూడా అంతే ధీమాతో ఉన్నారు. జిల్లాలో ఉన్న ఒక ముఖ్యనేత ఆశీస్సులు, పార్టీలో ఉన్న పట్టు తనకు అవకాశాన్ని తెచ్చిపెడతాయని భావిస్తున్నారు. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. కొత్తవారి నుంచి చూస్తే ఒక మాజీ మంత్రి కుమార్తె, ప్రభుత్వంలో పట్టు ఉన్న ఒక ఐఏఎస్‌ అధికారి సోదరి అయిన గొర్లె సునీత కూడా కొత్త తరాన్ని ప్రోత్సహించే చంద్రబాబు తనకే అవకాశం కల్పిస్తారని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వైద్యుడు డాక్టర్‌ కోసూరి అప్పారావు కూడా పార్టీలో పావులు కదుపుతూ ధీమాతో ఉన్నారు. నియోజకవర్గంలో తనకు ఉన్న పరిచయాలు, పార్టీలోని కొందరు నాయకులతో ఉన్న సాన్నిహిత్యాలతో తన పేరు ఖరారు కాగలదని భావిస్తున్నారు.

అనేకమంది పోటీలో…….

వై.రామవరం మండలానికి చెందిన గొర్లె శ్రీకాంత్‌, గంగవరం నుంచి తీగల ప్రభ, రాజవొమ్మంగి నుంచి కోసూరి బుజ్జి చిన్నాలమ్మ తదితరులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. దీంతో రంప‌చోడ‌వ‌రం రిజ‌ర్వ్ నియోజ‌క‌వ‌ర్గంనుంచి అధికార పార్టీ త‌ర‌ఫున పోటీ పోటా పోటీగా ఉంది. మ‌రి టికెట్ విష‌యంలో చంద్ర‌బాబు ఎవ‌రికి వ‌ర‌మాల వేస్తారో చూడాలి.