ఈ ముగ్గురూ ఉన్నారే….!

వైసీపీ పార్లమెంటు సభ్యులు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలును కోరుతూ తమ పదవులకు రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ తరుపున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 9 మంది వైసీపీ నుంచి పార్లమెంటు సభ్యులు ఎన్నికయ్యారు. కడప, రాజంపేట, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, కర్నూలు, నంద్యాల, అరకు, ఖమ్మం పార్లమెంటు స్థానాల్లో వైసీపీ జెండా ఎగిరింది. అయితే ఈ తొమ్మిది మందిలో నలుగురు ఇతర పార్టీల్లోకి చేరిపోయారు. ఖమ్మం పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లో చేరిపోయారు. తెలంగాణ పార్టీని జగన్ ఎటూ పట్టించుకోకపోవడంతో పొంగులేటి పార్టీ మారడాన్ని వారు సీరియస్ గా తీసుకోలేదు.

వైసీపీ నుంచి టీడీపీలోకి…..

ఇక ఆంద్రప్రదేశ్ విషయానికొస్తే నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి దాదాపు నాలుగేళ్ల క్రితమే వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో అధికారికంగా చేరిపోయారు. అరకు ఎంపీ కొత్త పల్లి గీత మాత్రం ఏ పార్టీలో చేరలేదు. తొలుత తెలుగుదేశం పార్టీ మద్దతుదారుగా కన్పించినప్పటికీ తర్వాత ఆ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. తర్వాత బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతు పలుకుతూ వస్తున్నారు. ప్రస్తుతం కొత్త పల్లి గీత ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియని పరిస్థితి. ఇక కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. రేణుక అధికారికంగా పార్టీ కండువా కప్పుకోకున్నప్పటికీ, తన మద్దతుదారులందరినీ చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేర్చారు.

పార్లమెంటు సమావేశాల్లో…..

ఇక పార్లమెంటు సమావేశాల్లో బుట్టారేణుక వివిధ అంశాలపై ప్రసంగిస్తుండటం వైసీపీని ఇరకాటంలో పెడుతోంది. ఆమె ఇప్పటికీ వైసీపీ ఎంపీగానే కొనసాగుతున్నారు. పార్లమెంటులో ఆమెను వైసీపీ సభ్యురాలిగానే గుర్తిస్తారు. దీంతో పార్టీ ఫిరాయించిన నలుగురు ఎంపీలపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అనేకసార్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ కు వైసీపీ నేతలు విజ్ఞప్తి చేశారు. అనర్హత వేటు వేయాలని అందుకు సంబంధించిన ఆధారాలను కూడా స్పీకర్ కు సమర్పించారు. కాని ఇప్పటి వరకూ చర్యలు తీసుకోకపోవడంతో మరోసారి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రత్యేకంగా స్పీకర్ సుమిత్రామహాజన్ ను కలిశారు.

స్పీకర్ వద్దకు మరోసారి…..

పార్టీ మారి కూడా పార్లమెంటులో ప్రసంగాలు చేస్తుంటే తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి వెళతాయని విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు. పార్టీ మారిన నలుగురు ఎంపీలపై అనర్హత వేటు వేయకుంటే ప్రజాస్వామ్యం మనుగడకే ప్రమాదమని స్పీకర్ వద్ద విజయసాయి ఆవేదన వ్యక్తంచేశారు. రాజ్యాంగ మూల సూత్రాలకు ముప్పు ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆ నలుగురిపై చర్యలు తీసుకోకుంటే భవిష్యత్తులో మరికొందరు కూడా పార్టీలు ఫిరాయిస్తారని, అందుకు అవకాశం ఇవ్వవద్దని సూచించారు. రాజ్యసభలో శరద్ యాదవ్, అన్వర్ ఆలీలపై ఛైర్మన్ వెంకయ్య నాయుడు వేటు విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. విజయసాయి విజ్ఞప్తికి సుమిత్రా మహాజన్ సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*