వారికే సీట్లు.. వైసీపీలో చిత్రం!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి సీఎం సీటును అందుకోవాల‌ని చూస్తున్న విప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు కొన్ని జిల్లాల్లో ప‌రిస్థితులు మింగుడు ప‌డడం లేదు. అభ్య‌ర్థుల ఎంపిక, ఆర్థిక స‌మ‌స్య‌లు, గెలుపు గుర్రాలు క‌నిపించ‌క జ‌గ‌న్ తీవ్ర‌స్థాయిలో స‌త‌మ‌తం అవుతున్నార‌నేది వైసీపీ నేత‌లు ప‌దే ప‌దే అంటున్న మాట‌. ముఖ్యంగా రాజ‌ధాని జిల్లా అయిన కృష్ణాలో ఈ ప‌రిస్థితి మ‌రింత తీవ్రంగా ఉంది. ఇక్క‌డ గ‌త ఎన్నిక‌ల్లో ఆశించిన స్థానాల క‌న్నా కూడా చాలా త‌క్కువ సీట్ల‌లోనే వైసీపీ విజ‌యం సాధించింది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అయినా.. ఇక్క‌డి 16 నియోజ‌క వ‌ర్గాల్లో క‌నీసం 10 స్థానాల్లో అయినా గెలుపు గుర్రం ఎక్కాల‌ని జ‌గ‌న్ ప‌క్కా ప్లాన్ సిద్ధం చేసుకున్నారు. అయితే, దీనికి త‌గిన విధంగా ఆయ‌న‌కు అభ్య‌ర్థులు క‌నిపించ‌డం లేదు.

గెలుపు గుర్రాల కోసం…..

ముఖ్యంగా అధికార‌ టీడీపీకి మంచి ప‌ట్టుకున్న నందిగామ‌, జ‌గ్గ‌య్య‌పేట‌, మచిలీప‌ట్నం, విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలుపు గుర్రం ఎక్కుతార‌ని గ్యారెంటీగా హామీ ఇచ్చే నేత‌లు ఆయ‌న‌కు క‌నిపించ‌డం లేదు. అయితే, ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేస్తామంటూ.. లెక్క‌కు మిక్కిలిగా అభ్య‌ర్థులు రంగంలోకి వ‌స్తున్నా.. ఇప్ప‌టికే జ‌రిగిన స్క్రూటినీలో వీరిలో గెలిచే అభ్య‌ర్థులు అంతంత మాత్రంగానే ఉన్నార‌ని, వారి ఆర్థిక ప‌రిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంద‌ని నివేదిక‌లు జ‌గ‌న్‌కు అందాయి. అదేస‌మ‌యంలో వీరికి ప్ర‌జ‌ల్లో ప‌లుకుబ‌డి, ఫాలోయింగ్ కూడా ఏమంత బాగాలేద‌ని, టికెట్ ఇవ్వ‌డం వ‌ల్ల ఏరికోరి టీడీపీకి సద‌రు స్థానాల్లో విజయాన్ని వెండిప‌ళ్లెంలో పెట్టి అందించిన‌ట్టే అవుతుంద‌ని జ‌గ‌న్‌కు చెప్పారు.

పాతవారికిస్తే…

దీంతో ఆయన ఇక‌, చేసేదిలేక‌.. 2014లో ఆయా నియోజ‌క‌వ‌ర్గాలో ఓట‌మి పాలైన వైసీపీ అభ్య‌ర్థుల‌నే రంగంలోకి దింపాల‌ని తాజాగా నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది. అయితే, విజ‌య‌వాడ సెంట్ర‌ల్‌లో మాత్రం వంగ‌వీటి రాధాకు ఛాన్స్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించార‌ట‌. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌ముఖ న్యాయ‌వాది గౌతంరెడ్డి పోటీ చేసి.. టీడీపీ అభ్య‌ర్థి బొండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావుపై చిత్తుగా ఓడిపోయారు. ఇక‌, మిగిలిన నందిగామ‌, జ‌గ్గ‌య్య‌పేట‌, మచిలీప‌ట్నం టికెట్‌ల‌ను పాత‌వారికే కేటాయించాల‌ని ప్రాథ‌మికంగా నిర్ణ‌యించిన‌ట్టు తెలుస్తోంది.

ఆయన అసెంబ్లీకి వెళ్లాలని…..

అయితే, గ‌త ఎన్నిక‌ల్లో మ‌చిలీప‌ట్నం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి కొలుసు పార్థ‌సార‌ధి ఈ ద‌ఫా .. పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తాన‌ని, ఇస్తే.. ఆ టికెట్ ఇవ్వాల‌ని లేకుంటే అస‌లు పోటీనే వ‌ద్ద‌ని ఆయ‌న భీష్మించిన‌ట్టు వ‌స్తున్న క‌థ‌నాలు పార్టీలో మ‌రింత వేడి పుట్టిస్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లోనే మ‌చిలీప‌ట్నం ఎంపీ అభ్య‌ర్థి లేక‌.. చివ‌రి నిముషంలో కొలుసును ఖ‌రారు చేసిన జ‌గ‌న్‌.. ఇప్ప‌టికీ అక్క‌డ పార్టీ పుంజుకోక‌పోవ‌డం, ప్ర‌స్తుత టీడీపీ ఎంపీ కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌కు సాటి రాగ‌ల నేత లేక‌పోవ‌డంతో ఎవ‌రికి ఈ టికెట్ ఇవ్వాలో తెలియ‌క ఇబ్బంది ప‌డుతున్నార‌ని తెలుస్తోంది.

కీలకమైన నేతలను…..

పోనీ.. ఇక్కడ ప్రధాన సామాజిక వ‌ర్గానికి చెందిన వారికి అవ‌కాశం ఇద్దామ‌న్నా.. వారంతా కూడా విజ‌య‌వాడ ఎంపీ సీటుపై చూపిస్తున్న ప్రేమ మ‌చిలీప‌ట్నంపై చూపించ‌డం లేద‌ని వైసీపీ సీనియ‌ర్లే అంటున్నారు. పామ‌ర్ర‌ులోనూ ఆ పార్టీకి బ‌ల‌మైన అభ్య‌ర్థి లేరు. అవ‌నిగ‌డ్డ‌లోనూ పాత అభ్య‌ర్థే పోటీ చేయ‌వ‌చ్చంటున్నారు. ఇక‌, ఎటొచ్చీ.. కీల‌క‌మైన నేత‌ను రంగంలోకి దింపితే త‌ప్ప ఫ‌లితం ఉండ‌ద‌ని జ‌గ‌న్ భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ఏదేమైనా.. కృష్ణా జిల్లాలో కొత్త‌వారు చేర‌క‌పోవడంతో వైసీపీకి పాత కాపులే దిక్క‌యిన‌ట్టుగా ప‌రిస్థితి మారిపోయింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*