వైసీపీ నేతకు గాలం…ఆయన వస్తే గ్యారంటీ గెలుపట….!!!

ysrcongressparty-telugudesam party

తెలుగుదేశం పార్టీ వైసీపీ కీలక నేతకు గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన వస్తే గట్టిపోటీ ఇవ్వొచ్చన్నది ఆ పార్టీ నేతల అభిప్రాయంగా ఉంది. ఇప్పటికే ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు ఆ వైసీపీ నేతకు పసుపు కండువా కప్పేయడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం ఈసారి తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉప ఎన్నికలతో సహా వరుసగా మూడుసార్లు గెలిచిన ఆయన హవాకు బ్రేకులు వేయాలని తెలుగుదేశం పార్టీ అనేక వ్యూహాలు రచిస్తోంది.

బలంగా ఉన్న పిన్నెల్లి…..

గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గానికి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహరిస్తున్నారు. హార్డ్ కోర్ వైసీపీ నేత అయిన పిన్నెల్లిని ఈ ఎన్నికల్లో ఓడించేందుకు పెద్ద ప్రణాళికనే సిద్ధం చేస్తోంది తెలుగుదేశం పార్టీ. మాచర్ల నియోజకవర్గంలో ఇప్పటి వరకూ ఉన్న ఫలితాలను విశ్లేషించుకుంటే మూడు సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు, రెండు సార్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, నాలుగుసార్లు తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. 1999వరకూ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ హవా ఉండేది. 1983, 1989, 1994, 1999లలో ఇక్కడ టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు. అయితే 2004 నుంచి ఇక్కడ సీన్ మారిపోయింది.2004లో కాంగ్రెస్ తరుపున పి.లక్ష్మారెడ్డి గెలుపొందారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో 2012 లో జరిగిన ఉప ఎన్నికల్లో పిన్నెల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి విజయం సాధించారు. తిరిగి వైసీపీ తరుపున 2014లోనూ ఆయననే విజయం వరించడం విశేషం.

పిన్నెల్లిని దెబ్బకొట్టేందుకు….

మాచర్ల నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేటికీ బలంగా ఉంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కూడా వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉంది. అయితే ఈ నియోజకవర్గంలో బలమైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లేకపోవడం ఆ పార్టీని వెంటాడుతున్న సమస్య. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కొమ్మారెడ్డి చలమారెడ్డి టీడీపీ నియోజకవర్గ ఇన్ ఛార్జిగా పనిచేస్తున్నారు. అయితే పిన్నెల్లిని ఎదుర్కొనడం ఈయన వల్ల కాదని భావించిన తెలుగుదేశంపార్టీ బీసీ నేతను రంగంలోకి దించాలని చూస్తోంది. గురజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తిని పార్టీలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు.

రాయపాటి కూడా….

గురజాల వైసీపీ ఇన్ ఛార్జిగా జగన్ జంగాకృష్ణమూర్తిని తప్పించడంతో ఆయనను తీసుకొచ్చి మాచర్లలో పోటీ చేయించాలన్నది టీడీపీ వ్యూహంగా ఉంది. జంగా కృష్ణమూర్తి నేటికీ వైసీపీలోనే కొనసాగుతున్నారు. ఆయన వస్తే మాచర్ల సీటు కొట్టేయవచ్చన్నది టీడీపీ ఆలోచనగా ఉంది. మరోవైపు రాయపాటి సాంబశివరావు తన కుమారుడు రంగారావును మాచర్ల నుంచి పోటీ చేయించాలని అధిష్టానం వద్ద ప్రయత్నాలు చేస్తున్నారు. తన కుమారుడయితే గెలుపు గ్యారంటీఅని రాయపాటి చెబుతున్నారు. కానీ పార్టీ అధిష్టానం మాత్రం జంగా వైపే ఆసక్తి చూపుతుందని తెలిసింది. మరి జంగా టీడీపీలోకి వెళతారా? లేక వైసీపీలోనే కొనసాగుతారా? అన్నది చూడాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*