ఎమ్మెల్యే….అవ్వాలంటే…ఇలా కూడా..?

ఇప్పుడు కొద్దిపాటి బలం ఉన్న నేత కూడా అసెంబ్లీలోకి కాలుమోపాలన్న లక్ష్యంతోనే ప్రజల చెంతకు చేరుతుంటారు. పాలిటిక్స్ లో కష్టపడటం ఎంత ముఖ్యమో…అదృష్టం కూడా అంతే ముఖ్యం. కాలం కలసి వస్తే ఊహించని విధంగా ఎమ్మెల్యే అవ్వొచ్చు. లక్కుంటే మంత్రిగా కూడా అయ్యే అవకాశముంది. ఏమో ఎప్పుడు ఏం జరుగుతుందో రాజకీయాల్లో ఎవరూ చెప్పలేని పరిస్థితి. అయితే తమ పొలిటికల్ లైఫ్ బాగుపడేందుకు ఎన్ని పార్టీలు మారడానికైనా నేతలు వెనకాడని రోజులివి. అలాంటిదే ఇప్పుడు నెల్లూరు జిల్లాలో జరుగుతోంది. తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం ఉన్న ఆయన ఏ పార్టీలో చేరైనా అమరావతి అసెంబ్లీలోకి కాలుమోపాలన్న టార్గెట్ పెట్టుకున్నారట.

వైసీపీ నుంచి టీడీపీలోకి…..

వివరాల్లోకి వెళితే తొలుత వైఎస్సార్ కాంగ్రెస్ లో ఉన్న నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్. ఈయన తొలుత కార్పొరేటర్. వైసీపీ తరుపున కార్పొరేటర్ గా గెలిచారు. అదృష్టం బాగుండి మేయర్ అయ్యారు. తర్వాత నెల్లూరు అభివృద్ధి అంటూ కేకలు పెట్టి పసుపు కండువా కప్పేసుకున్నారు. ప్రస్తుతం ఆయన నెల్లూరు నగర నియోజకవర్గంలో నిలబడాలని కోరికతో ఉన్నారు. మంత్రి నారాయణ వెంటే తిరుగుతూ నెల్లూరు నగర టిక్కెట్ కోసం తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. నెల్లూరు టౌన్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉండటంతో అధిష్టానం వద్ద ఆయన ఈ కార్డు ఉపయోగిస్తున్నారు. నారాయణ ఎటూ ఉండనే ఉన్నారు.

నారాయణ అడ్డుగా ఉండటంతో…..

అయితే మంత్రి నారాయణ కూడా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. నెల్లూరు సొంత ప్రాంతం కావడంతో ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రావాలని నారాయణ భావిస్తున్నారు. అందుకే ఆయన మేయర్ అజీజ్ సహకారంతో నెల్లూరు నగరంలో అభివృద్ధి పనులు వేగవంతం చేశారు. నెల్లూరులోనే ఎక్కువగా ఉండి నియోజకవర్గంలో పట్టు సంపాదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నారాయణ టిక్కెట్ కావాలని కోరితే అధినేత కాదనేది ఉండదన్నది అందరికీ తెలిసిన విషయమే. నారాయణకు టిక్కెట్ వస్తే తన పరిస్థితి ఏంటని అజీజ్ ఇప్పటినుంచే మరొక ప్రయత్నంలో పడ్డారు.

పవన్ కరుణిస్తారా?

ఆయనకు జనసేన కన్పించింది. తన కోరిక నెరవేర్చుకునేందుకు జనసేనలో చేరడం ఒక్కటే మార్గమని అజీజ్ డిసైడయ్యారని తెలుస్తోంది. తొలుత తెలుగుదేశం పార్టీని టిక్కెట్ అడిగి వాళ్లు ఏమీ చెప్పకుంటే జనసేనలో చేరాలని భావిస్తున్నారు అజీజ్. త్వరలోనే జనసేనాని పవన్ కల్యాణ్ ను కలవాలని నిర్ణయించుకున్నారట. నెల్లూరులో పవన్ కల్యాణ్ కు అభిమానులు సంఖ్య ఎక్కువగా ఉంటుంది. 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీధర కృష్ణారెడ్డి గెలుపొందారు. ఇటు పవన్ అభిమానులు, ముస్లిం ఓటర్లు తనకు అండగా నిలిస్తే ఎమ్మెల్యే అయిపోవడం ఖాయమన్నది అజీజ్ లెక్కట. దీంతో ఎలాగైనా ఎమ్మెల్యే అయిపోవాలన్న అజీజ్ కోరికను జనసేన తీరుస్తుందో? లేదో? చూడాలి మరి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*