అక్క‌డ టీడీపీ, వైసీపీ ఢీ అంటే ఢీ..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు సొంత జిల్లాలో రాజ‌కీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. అధికార‌, ప్ర‌తిప‌క్షాలు రెండూ ఢీ అంటే ఢీ అని ఎన్నిక‌ల‌కు సిద్ధ‌ప‌డుతున్నాయి. చంద్ర‌బాబును వ‌చ్చే ఎన్నిక‌ల్లో చిత్తుగా ఓడించాల‌ని కంక‌ణం క‌ట్టుకున్న వైసీపీ దానికి అనుగుణంగా ఆయ‌న‌ను సొంత జిల్లా చిత్తూరులోనే శంక‌ర‌గిరి మాన్యాల దారి ప‌ట్టించాల‌ని నిర్ణ‌యించు కుంది. అయితే, త‌న సొంత జిల్లాలో గ‌తానికంటే ఎక్కువ‌గా త‌న హ‌వా చాటాల‌ని, వైసీపీకి నిలువ నీడ కూడా లేకుండా చేయాల‌ని చంద్ర‌బాబు వ్యూహాలు అమ‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న తన రాజ‌కీయ చాణ‌క్యానికి మ‌రింత ప‌దును పెంచుతున్నారు.

రాజంపేట లోక్ సభ నియోజకవర్గంలో….

ఇప్ప‌టికే మాజీ సీఎం న‌ల్లారి కిర‌ణ్ వ‌ర్గాన్ని త‌న‌వైపు తిప్పుకొనేందుకు వేసిన పాచిక పారింది. న‌ల్లారి సోద‌రుడు కిశోర్‌కుమార్ రెడ్డి టీడీపీలో చేర‌డం, నామినేటెడ్ పదవి చేప‌ట్ట‌డం జ‌రిగింది. దీంతో జిల్లాలో ఉన్న రాజంపేట లోక్‌స‌భ నియొజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీకి బ‌లం చేకూరింది. అదేవిధంగా పల‌మ‌నేరు నుంచి గెలుపొందిన వైసీపీ ఎమ్మెల్యే అమ‌ర్‌నాథ్ రెడ్డిని టీడీపీ అధినేత పార్టీలోకి ఆహ్వానించి మంత్రిని చేశారు. ఇలా చంద్ర‌బాబు అవ‌కాశం ఉన్న ప్ర‌తిచోటా.. వైసీపీని దెబ్బ‌కొట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇలా వైసీపీ స‌హా కాంగ్రెస్ నుంచి కొందరు నేతల చేరికలతో కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ పట్టుపెరడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది.

బలాబలాలు సమానమయి….

జిల్లాలోని రెండో లోక్‌సభ స్థానాలు ఎస్సీలకు రిజర్వు అయిఉన్నాయి. గత ఎన్నికల్లో చిత్తూరులో టీడీపీ, తిరుపతిలో వైసీపీ గెలుపొందాయి. 14 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీకి ఎనిమిది, టీడీపీకి ఆరు వచ్చాయి. తర్వాత పలమనేరు వైసీపీ ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి టీడీపీలో చేరిపోవడంతో బలాబలాలు సమానమయ్యాయి. చిత్తూరు (ఎస్సీ) స్థానంలో టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ అనారోగ్యంతో కొంత ఇబ్బంది పడుతున్నారు. ఆయన పోటీ చేయాలని ఆసక్తి చూపితే టికెట్‌ ఆయనకే కేటాయించే అవ‌కాశం ఉంది. అయితే, గ‌తంలో ఆయ‌న చంద్ర‌బాబుపై శివ‌ప్ర‌సాద్ చేసిన విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో చివ‌రి నిముషంలో ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

కుప్పం మెజారిటీయే….

అయితే, ఇక్క‌డి నుంచి టీడీపీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగేందుకు, గెలిచేందుకు స‌త్తా ఉన్న ఎస్సీ కేండిటేడ్ ఇప్ప‌టికిప్పుడు ల‌భించ‌డం చాలా క‌ష్ట‌మ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇక‌, వైసీపీ తరపున పోయినసారి మహిళా నేత జి.సామాన్య కిరణ్‌ పోటీ చేశారు. ప్ర‌స్తుతం ఆమె ప్ర‌కాశం జిల్లా సంత‌నూత‌ల‌పాడు వైసీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా నియ‌మితులు అయ్యారు. ఈసారి ఆమె స్థానంలో వేపంజేరి మాజీ ఎమ్మెల్యే ఆర్‌.గాంధీకి అవకాశం దక్కవచ్చని చెబుతున్నారు. చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పం ఈ లోక్‌స‌భ సీటు ప‌రిధిలో ఉండ‌డంతో అక్క‌డ వ‌చ్చే మెజార్టీ ఇక్క‌డ టీడీపీ ఎంపీని సులువుగానే గెలుస్తూ వ‌స్తోంది.

పరసారత్నం పేరు కూడా…..

తిరుపతి లోక్‌సభ స్థానంలో వైసీపీ ఎంపీ వరప్రసాద్‌ మళ్లీ పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో టీడీపీతో పొత్తులో భాగంగా ఇక్కడ బీజేపీ తరపున కారుమంచి జయరాం పోటీచేశారు. ఆయన ఇటీవల టీడీపీలో చేరిపోయారు. ఈ స్థానానికి ఆయనతోపాటు నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి పరసా రత్నం పేరు కూడా టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే, వ‌ర‌ప్ర‌సాద్‌కు ఉన్న సానుభూతి వైసీపీని ఇక్క‌డ మ‌రోసారి గ‌ట్టెక్కిస్తుంద‌ని అంటున్నారు. మొత్త‌ంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ వ‌ర్సెస్ వైసీపీల మ‌ధ్య హోరా హోరీ పోరు తప్ప‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*