విక్టరీ ఇక్కడ దోబూచులాట….!!

ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రకాశంలో అత్యంత వెనుక బడిన నియోజకవర్గం దర్శి. ఒకప్పుడు ఫ్యాక్షన్‌ ప్రభావిత గ్రామాలు ఎక్కువగా ఉన్న దర్శిలో నేడు అభివృద్ధి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. గత ఐదారు ఏళ్లుగా నియోజకవర్గంలో అభివృద్ధి ఊపందుకుంది. ఏపీ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న శిద్ధా రాఘవరావు ప్రాతినిధ్యం వహిస్తున్న దర్శి నియోజకవర్గంలో టీడీపీ జోరు ఎలా ఉంది ? ఇక్కడ నుంచి వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసేందుకు సరైన అభ్యర్థిని పెట్టలేని పరిస్థితి వైసీపీకి ఎందుకు వచ్చింది ? దర్శిలో జనసేన ప్రభావం ఎంత ? దర్శిలో శిద్ధా మార్క్‌ అభివృద్ధి ఉందా ? ప్రస్తుతం దర్శిలో రాజకీయాల్లో ఏం జరుగుతుందన్నది తెలుగుపోస్ట్‌ ప్రత్యేక సమీక్షలో చూద్దాం.

ఐదు సార్లు గెలిచి…

1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత దర్శిలో టీడీపీ ఐదు సార్లు విజయం సాధించింది. 1994లో టీడీపీ నుంచి నారపుశెట్టి శ్రీరాములు, 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎన్‌. పాపారావు గెలిచారు. 1999లో దర్శిలో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన సానికొమ్ము పిచ్చిరెడ్డి విజయం సాధించగా… 2004లో కాంగ్రెస్‌ టిక్కెట్‌ దక్కక ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన బూచేపల్లి సుబ్బారెడ్డి విజయం సాధించారు. 2009లో సుబ్బారెడ్డి తనయుడు బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి కాంగ్రెస్‌ నుంచి గెలిచారు. దాదాపు దశాబ్దన్నరకు పైగా దర్శిలో టీడీపీ జెండా ఎగరలేదు. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు సూచనల మేరకు దర్శిలో పార్టీ పగ్గాలను భుజాన వేసుకున్న శిద్ధా రాఘవరావు గత ఎన్నికల్లో హోరా హోరీ పోరులో శివప్రసాద్‌ రెడ్డిపై 1300 ఓట్ల స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు.

ఈ విషయంలో మాత్రం….

ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రకాశంలో ఉండి వెనకబడిన నియోజకవర్గంగా ఉన్న దర్శిలో మంత్రిగా ఉన్న శిద్ధా నాలుగున్నర ఏళ్లలో తనదైన మార్క్‌ చూపించారు. దర్శి నియోజకవర్గానికి ప్రకాశం జిల్లాతో పాటు పొరుగు జిల్లాలతో ఉన్న ప్రధాన రహదారుల కనెక్టివిటీ సౌకర్యంతో పాటు నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో సీసీ రహదారులను సైతం నిర్మించారు. అయితే దొన‌కొండ పారిశ్రామిక కారిడార్‌ అతీ గతీ లేకుండా ఉంది. ఈ విషయంలో మాత్రం శిద్ధాకు కాస్త ఇబ్బందే. ఇక్కడ దొన‌కొండ పారిశ్రామిక కారిడర్‌ ఏర్పాటు అయితే ప్రకాశం జిల్లా వాసులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది యువతకు ఉపాధి లభించినట్టు అవుతుంది. శిద్ధా జిల్లాకు కొన్ని కీలక ప్రాజెక్టులు మంజూరు చేయించడంలో కూడా తనదైన ముద్ర వేశారు. అవినీతికి వివాదాలకు దూరంగా రాజకీయం చేస్తారన్న పేరు సంపాదించుకున్నారు.

సామాజకి సమీకరణాలే…..

అయితే శిద్ధా ఎన్ని అభివృద్ధి పనులు చేసినా దర్శిలో వైసీపీ సామాజిక సమీకరణలు, క్షేత్రస్థాయిలో బలంగా ఉండడంతో శిద్ధా వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసినా గెలుపు కోసం హోరా హోరీగా శ్రమించాల్సిందే. అలాగే వచ్చే ఎన్నికల్లో శిద్ధా ఇక్కడ నుంచి పోటీ చేస్తారా ? లేదా నరసారావుపేట నుంచి లోక్‌సభకు బరిలో ఉంటారా దర్శి టీడీపీ అభ్యర్థి ఎవరన్నది అప్పటి సమీకరణలు, చంద్రబాబు తీసుకునే డెసిషన్‌ మీద ఆధారపడి ఉంటుంది. విపక్ష వైసీపీ విషయానికి వస్తే ఆ పార్టీకి క్షేత్ర స్థాయిలో బలం బాగానే ఉన్నా సరైన అభ్యర్థి లేక పెద్ద గందరగోళంలో కొట్టుమిట్టాడుతుంది. నియోజకవర్గంలో దశాబ్దంన్నరగా మంచి పట్టున్న బూచేపల్లి ఫ్యామిలీ గత ఎన్నికల్లో ఓడిపోయి భారీగా చేతిచ‌మురు వదిలించుకోవడంతో వచ్చే ఎన్నికల్లో వాళ్లు పోటీకి దూరంగా ఉన్నారు. ఈ క్రమంలోనే జగన్‌ రియల్ ఎస్టేట్‌ వ్యాపారి అయిన బాదం మాధవరెడ్డికి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా పగ్గాలు అప్పగించారు.

కీలక నేతలు సహకరించక…..

అయితే బాదం మాధవరెడ్డికి బూచేపల్లి నుంచి స‌రైన స‌హ‌కారం లేక‌పోవ‌డంతో పాటు నియోజకవర్గ వైసీపీలో చాలా మంది కీలక నాయకులు సహకరించే పరిస్థితి లేకపోవడంతో ఆయన చేతులు ఎత్తేశారు. చివరకు జగన్‌ దర్శిపై ప్రత్యేక దృష్టి సారించాలని తన మామ జిల్లా పార్టీ అధ్యక్షుడు అయిన బాలినేని శ్రీనివాసరెడ్డికి సైతం చెప్పిరు. బాలినేని కూడా దర్శిలో జోక్యం చేసుకున్నా పరిస్థితి సెట్‌రైట్‌ అవ్వలేదు. బాదం మాధవరెడ్డి పార్టీ కార్యకలాపాలను ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో చిరెత్తుకొచ్చిన జగన్‌ అక్కడ కొత్త అభ్యర్థిని చూడాలని బాలినేనికి చెప్పారు. ఈ క్రమంలోనే గతంలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడిపోయిన పేస్‌ ఇంజనీరింగ్‌ కళాశాల అధినేత మద్దిశెట్టి వేణుగోపాల్‌ పేరు తెర మీదకు వచ్చింది.

జనసేన ప్రభావం….?

త్వరలోనే ఇక్కడ మద్దిశెట్టి పేరు ఖ‌రారు అవుతుందని అనుకుంటున్న టైమ్‌లో ఇప్పుడు ఆయన సైతం ఇక్కడ పోటీకి వెనుకంజ వేస్తున్నట్టు తెలుస్తోంది. అటు శిద్ధా దూకుడు మీద ఉండడంతో పాటు ఆర్థికంగా బలంగా ఉండడంతో వైసీపీ నుంచి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి. అదే టైమ్‌లో బూచేపల్లి సహకారం లేనిదే ఇక్కడ వైసీపీ అభ్యర్థులు ఎంత వరకు గెలుస్తారు అన్నది కూడా సందేహమే. ఇక కొత్తగా పోటీ చేస్తున్న జనసేన దర్శిలో పోటీ ఇవ్వక పోయినా సామాజిక సమీకరణల నేపధ్యంలో ఓ మోస్తరుగా ఓట్లలో చీలిక తేవచ్చు. దర్శిలో టీడీపీ సంస్థాగతంగానూ, నాయకత్వంతోనూ బలంగా ఉంటే.. సంస్థాగతంగా బలంగా ఉన్న వైసీపీ సరైన అభ్యర్థి లేక కొట్టుమిట్టాడుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*