వైసీపీలో లీకు వీరుల దెబ్బకు…!

టీడీపీకి కంచుకోట‌లాంటి గుంటూరు జిల్లాలో పట్టు కోసం వైసీపీ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. అధినేత జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌.. జిల్లాలో స‌క్సెస్ అయింద‌ని ఆ పార్టీ నేత‌లు భావిస్తున్న త‌రుణంలో పార్టీలో జ‌రుగుతున్న ప‌రిణామాలు ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌యక‌ర్త‌ల‌కే టికెట్ ఇస్తామ‌ని స్పష్ట‌మైన ప్ర‌క‌ట‌న రాక‌పోవ‌డంతో కొత్త స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. ఇన్‌ఛార్జులుగా ఉన్న‌వారిని తీసేయ‌డం.. వారి స్థానంలో కొత్త వారిని నియ‌మిస్తార‌నే ప్ర‌చారం జోరందుకోవ‌డంతో పార్టీలో గంద‌ర‌గ‌ళం నెల‌కొంది. గ‌త ఎన్నిక‌ల్లోనూ ఇదే విధ‌మైన ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో పార్టీ కొన్నిచోట్ల‌ దెబ్బ‌తిని మొదటికే మోసం వ‌చ్చింది. మ‌ళ్లీ ఇదే త‌ర‌హా ప్రచారం జ‌రుగుతుండ‌టంతో మ‌రోసారి దుమారం రేగుతోంది.

సొంత పార్టీ నేతలే…..

గుంటూరు జిల్లా వైసీపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతున్నాయి. గత ఎన్నికల్లో ఆఖ‌రి నిమిషంలో చేసిన పొరపాట్లు మళ్లీ పునరావృతమ‌వుతున్నాయని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ప్రస్తుతం ఇన్‌ఛార్జిలుగా ఉన్నవారిని తప్పిస్తూ.. వారి స్థానంలో వేరే వారికి అవకాశం ఇస్తున్నట్లు సొంత‌ పార్టీ నుంచే లీకులు వస్తుండ‌టం ఇప్పుడు సంచ‌ల‌నం రేపుతోంది. ముఖ్యంగా వినుకొండ, పెదకూరపాడు నియోజకవర్గాల్లో ఈ వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. గత ఎన్నికల సందర్భంలో కూడా వినుకొండ, పెదకూరపాడు విషయాల్లో ఏర్పడిన గందరగోళం చివరకు పార్టీ అభ్యర్థుల ఓటమికి దారితీసింది. ఇప్పుడూ అదే రీతిలో పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నార‌నే గుస‌గుస‌లు పార్టీలో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వినుకొండ,పెదకూరపాడులకు ఇన్‌ఛార్జులుగా ఉన్నబల్లా బ్రహ్మనాయుడు, కావటి మనోహర్‌నాయుడును తప్పిస్తున్నారని ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

వినుకొండ నియోజకవర్గంలో…..

వినుకొండ నియోజకవర్గం వైసీపీ ఇన్‌ఛార్జిగా ఉన్న బల్లా బ్రహ్మనాయుడును తప్పించి.. ఆయన స్థానంలో గుంటూరుకు చెందిన ఒక ప్రముఖ డాక్టర్‌కు సీటు ఇస్తామని పార్టీ సీనియర్‌ నేత, జిల్లా ఇన్‌చార్జిగా వ్య‌వ‌హ‌రిస్తున్న కీల‌క నేత‌ ఒకరు చెబుతున్నారట. దీంతో నియోజకవర్గంలో ఒక్కసారిగా కలకలం రేగింది. కొన్నేళ్లుగా వినుకొండలో వైసీపీని గెలిపించాలని పట్టుదలతో పనిచేస్తోన్న బ్రహ్మనాయుడు తాజా పరిణామాలతో కలత చెందుతున్నారట‌. గత ఎన్నికల సమయంలో సొంత నియోజకవర్గమైన వినుకొండ సీటు ఇవ్వకుండా తనను పెదకూరపాడు పంపించి ఓడించారని ఆయన మదనపడ్డారు. ఎన్నికల తరువాత..మళ్లీ వినుకొండ ఇన్‌ఛార్జిగా ప్రకటించి చేసిన తప్పుదిద్దుకున్నారని భావిస్తే ఇప్పుడు మళ్లీ వేరే వారికి అవకాశం ఇస్తున్నారని తేలడంతో నీరుగారిపోతున్నారట‌.

పెదకూర పాడు నుంచి….

తిరుమల డైరీ వ్యవస్థాపకుడిగా వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్న ఆయన రాజకీయాల్లో రాణించేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. వినుకొండ నుంచి పోటీ చేసి సత్తా చాటాల‌ని భావిస్తున్న ఆయనకు పార్టీ నాయకులే కళ్లేలు వేస్తున్నారట. ఇక పెదకూరపాడు గ‌తంలో కాంగ్రెస్‌కు కంచుకోట. ఇక్క‌డి నుంచి వైసీపీ త‌ర‌ఫున‌ కొత్త వ్యక్తిని రంగంలోకి దిగబోతున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బల్లా బ్రహ్మనాయుడు ఈసారి త‌ప్పుకున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఇన్‌చార్జిగా ఉన్న కావటి మనోహర్‌నాయుడు పోటీ చేస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఆయనకు టిక్కెట్‌ రాదని, ఆర్థికంగా ఆయన స్థితిమంతుడు కాకపోవడంతో నంబూరి శంకరరావు అనే పారిశ్రామికవేత్తకు ఇక్కడ టిక్కెట్‌ ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

బలమైన ప్రత్యర్థులున్నచోట…..

ఇక ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు బ‌లంగా ఉన్నారు. వినుకొండ‌లో జిల్లా టీడీపీ అధ్య‌క్షులు, జివి.ఆంజ‌నేయులు రెండుసార్లు గెలిచి మూడోసారి బ‌రిలో ఉండ‌బోతున్నారు. ఇక పెద‌కూర‌పాడులో కొమ్మాల‌పాటి శ్రీథ‌ర్ కూడా ఇప్ప‌టికే రెండుసార్లు విజ‌యం సాధించారు. మ‌రో విశేషం ఏంటంటే వీరిద్ద‌రు వియ్యంకులు. ఇలా వియ్యంకులుగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల మీద పోటీకి వైసీపీ అభ్య‌ర్థుల ఎంపిక పెద్ద గంద‌ర‌గోళంగా మారి సిట్టింగ్‌ల‌కు మంచి అనుకూలంగా మారుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*