మంత్రిని చేస్తామన్నా జగనే కావాలంటున్నాడే…!

ఎంతమంది పిలుస్తున్నా ఆయన జగన్ వెంటే నడవాలని నిర్ణయించుకున్నారట. ఆయన కోసం అన్ని పార్టీలూ వల వేస్తున్నాయి. హామీలు ఇస్తున్నాయి. అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని కూడా ఊరిస్తున్నాయి. అయినా సరే. ఆయన మాత్రం జగన్ వెంట వెళ్లేందుకే నిర్ణయించుకున్నారు. ఆయనే రాపాక వరప్రసాద్. ఆయన మాజీ ఎమ్మెల్యే. తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో ఆయనకు పట్టుంది. గత ఎన్నికల్లో పోటీ చేద్దామని చివరి నిమిషంలో నామినేషన్ ను ఉపసంహరించుకుని టీడీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావుకు మద్దతు ప్రకటించారు. దీంతో సూర్యారావు గెలుపు సులువయింది.

టీడీపీ వేసిన గాలానికి…..

తూర్పు గోదావరి జిల్లాలో రాజోలు ఎస్సీ నియోజకవర్గం. ప్రస్తుతం ఇక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు ఉన్నారు. అయితే టీడీపీ అధిష్టానం సూర్యారావును అమలాపురం పార్లమెంటు సభ్యుడిగా పంపాలని నిర్ణయించుకుని, రాపాకను తమ పార్టీలోకి ఆహ్వానించింది. అయితే రాపాక ఆ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు. రాపాక వరప్రసాద్ ను ఇక్కడి నుంచి పోటీ చేయిస్తే గెలుపు గ్యారంటీ అని భావించిన టీడీపీ పెద్ద ప్రయత్నాలే చేసింది. అయితే టీడీపీ నేతలకు తాను పార్టీలోకి రాలేనని సున్నితంగా రాపాక చెప్పారట. గత ఎన్నికల్లో గొల్లపల్లి సూర్యారావు గెలుపుకు రాపాక కృషిచేశారు.

వైఎస్ కు వీర విధేయుడు…..

వైఎస్ హయాంలో రాజోలు నుంచి గెలుపొందిన రాపాక వరప్రసాద్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వీర విధేయుడు. అలాగే ఆ తర్వాత ముఖ్యమంత్రి గా వచ్చిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కూడా సన్నిహితుడే. ఇటీవలే కిరణ్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. కిరణ్ పార్టీలో చేరిన మరుసటి రోజే రాపాక కు కాంగ్రెస్ పార్టీ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తిరిగి కాంగ్రెస్ లోకి రావాలని కోరింది. అయితే రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీలో చేరేది లేదని రాపాక కుండబద్దలు కొట్టేసినట్లు తెలుస్తోంది. మరోవైపు జనసేన నేతలు కూడా రాపాకపై వత్తిడి తెస్తున్నారు.

వైసీపీలోకి వెళ్తామని……

కాని రాపాక మాత్రం వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే కృష్ణంరాజు వైసీపీ నేతలతో సంప్రదింపులు చేస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ తూర్పుగోదావరి జిల్లాలోనే పర్యటిస్తున్నారు. ఆయన వద్దకు త్వరలోనే రాపాక వెళ్లే అవకాశముందని తెలుస్తోంది. ఇలా దాదాపు రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలూ ఒక్క నేతను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలుచేయడం నిజంగా విశేషమనే చెప్పుకోవాలి. ఆయన మాత్రం తన సన్నిహితుల వద్ద త్వరోలనే వైసీపీలో చేరతానని చెబుతున్నట్లు తెలుస్తోంది.