వైసీపీలో పర..పర.. పర…పప్పర….!

వైసీపీ అధినేత దృష్టంతా రాజధానిపైనే పడినట్లుంది. కృష్ణా జిల్లాలో సమూల ప్రక్షాళనకు జగన్ నడుంబిగించినట్లు కన్పిస్తుంది. ఎవరు ఏమనుకున్నా…సరే…గెలుపు గుర్రాలకే టిక్కెట్లు అన్న సంకేతాలను రాష్ట్ర వ్యాప్తంగా జగన్ పంపించగలిగారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయకుంటే…టిక్కెట్ లేదు గిక్కెట్టు లేదని చెప్పకనే చెబుతున్నారు. తాను దాదాపు పది నెలల పైగా పాదయాత్రలో ఉండి పార్టీ కోసం శ్రమిస్తుంటే నియోజకవర్గంలో పర్యటించలేని, ప్రజల వద్దకు వెళ్లలేని నేతలు తనకు వద్దే వద్దంటూ చెబుతున్నారు జగన్. కృష్ణా జిల్లాతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలకు హెచ్చరికలు పంపారు జగన్మోహన్ రెడ్డి. ఎవరు పార్టీని వీడినా…అలిగినా… పరవాలేదు….ప్రజానాడి మేరకే తాను నడుచుకుంటానని తెగేసి చెబుతున్నారు.

కమిట్ మెంట్ లేని వారిని…….

గత నాలుగేళ్లుగా జగన్ ప్రజల్లోనే ఉంటున్నారు. ఏదో ఒక కార్యక్రమంతో ఆయన పార్టీ గ్రాఫ్ తగ్గకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. యువభేరి, దీక్షలంటూ దాదాపు మూడున్నరేళ్ల పాటు అన్ని జిల్లాలను పర్యటించారు జగన్. తర్వాత గత ఏడాది నవంబరు 6వ తేదీన సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. రేపో మాపో 12 జిల్లా అయిన విజయనగరానికి చేరుకోనున్నారు. ఎన్ని హెచ్చరికలు చేసినా… పార్టీ సమావేశాల్లో గుచ్చి గుచ్చి చెప్పినా నేతలు పెడచెవిన పెట్టారు. పార్టీ ప్రకటించిన నవరత్నాలను సయితం ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారు. ఎప్పటికప్పుడు నివేదికలు, సర్వేలు తెప్పించుకుంటున్న జగన్ పార్టీపట్ల చిత్తశుద్ధిలేని వారిని తప్పించడానికే రెడీ అయిపోయినట్లు కన్పిస్తోంది.

కులాల ప్రస్తావన లేదు……

వంగవీటి రాధా విషయంలోనూ అదే జరిగిందన్నది వాస్తవమంటున్నారు. రాధాకు తూర్పు నియోజకవర్గం ఇస్తామన్నా అంగీకరిచడం లేదని, కాపులకు అన్యాయం చేశారనడం అవాస్తవమన్నది వైసీపీ సీనియర్ నేతల అభిప్రాయం. కేవలం సెంట్రల్ నియోజకవర్గమే కాకుండా కృష్ణా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే రిపోర్ట్ ల అధారంగానే జగన్ అభ్యర్థుల ఎంపికకు శ్రీకారంచుట్టారు. ప్రజాభిమానం, వేవ్ ఉన్న నేతలకే ఈసారి టిక్కెట్లు ఇవ్వాలన్నది జగన్ నిర్ణయం. అందులో భాగంగానే మల్లాది విష్ణుకు సెంట్రల్ అప్పగించి, రాధాను తూర్పు నియోజకవర్గానికి పంపించాలన్నది జగన్ ఆలోచన అని వైసీపీ సీనియర్ నేత ఒకరు ‘‘తెలుగు పోస్ట్’’కు చెప్పారు. ఇందులో కులాల ప్రస్తావన ఉండదని ఆయన అన్నారు.

అన్ని నియోజకవర్గాల్లో……

కేవలం సెంట్రలే కాదు.. మీరు గమనిస్తే మైలవరం నియోజకవర్గంలో అప్పటి వరకూ ఇన్ ఛార్జిగా ఉన్న జోగి రమేష్ ను తప్పించి అక్కడ వసంత కృష్ణ ప్రసాద్ కు జగన్ బాధ్యతలన అప్పగించారు. అలాగే పెడనలో జోగి రమేష్ కు సానుకూల వాతావరణం ఉండటంతో అక్కడ ఆయనకు ఇన్ ఛార్జి బాధ్యతలను అప్పగించారు. పెడనలో మొన్నటి వరకూ ఇన్ ఛార్జిగా ఉన్న ఉప్పాల రామ్ ప్రసాద్ నెగ్గుకురాలేరని భావించే ఆయనను తప్పించారంటున్నారు. అలాగే అవనిగడ్డలో కూడా జగన్ మార్పులు చేశారు. అవనిగడ్డలో మండలి బుద్ధ ప్రసాద్ ను ఎదుర్కొనడం అంత ఈజీ కాదు. అక్కడ సింహాద్రిరమేష్ ఇన్ ఛార్జిగా ఉన్నారు. ఆయన పనితీరు బాగా లేకపోవడంతో ఆయనను తప్పించి అవనిగడ్డలో బాలశౌరిని నియమించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. బాలశౌరి ప్రస్తుతం మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇలా బెజవాడ నుంచే పార్టీ ప్రక్షాళనకు జగన్ సిద్దమయ్యారంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*