ఆ ఐదు సీట్లు వైసీపీ ఖాతాలోకేనా?

ప్ర‌కాశం జిల్లాలో వైసీపీ స‌మీక‌ర‌ణ‌ాలు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీ విజ‌యం సాధించే దిశ‌గా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా క‌నిగిరి, గిద్ద‌లూరు, మార్కాపురం, ద‌ర్శి, కందుకూరు నియోజ‌క‌వ‌ర్గాల‌పై వైసీపీ ప్ర‌భావం తీవ్రంగా ఉండే అవ‌కాశం క‌నిపిస్తోంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఇక్క‌డ బ‌ల‌మైన నేత‌గా ఉన్న మానుగుంట మ‌హీధ‌ర్ రెడ్డి త్వ‌ర‌లోనే వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఈ ప‌రిణామం వైసీపీలో వేగం పెంచుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త ఎన్నిక‌ల్లో ఈ జిల్లాలో వైసీపీ హ‌వా బాగానే క‌నిపించింది. అయితే, అనూహ్యంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు విసిరిన ఆక‌ర్ష్ మంత్రంతో చాలా మంది కీల‌క నేత‌లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీకి గ‌ట్టి బుద్ధి చెప్పాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నారు.

తండ్రి వారసత్వాన్ని…..

ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు అందివ‌చ్చిన అవ‌కాశంగా దాదాపు ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌భావం చూపించ‌గ‌ల మానుగుంట వైసీపీలో చేరుతుండ‌డాన్ని ఆ పార్టీ నేత‌లు స్వాగ‌తిస్తున్నారు. ప్ర‌కాశం జిల్లా కందుకూరు మండలం మాచవరం గ్రామానికి చెందిన మహీధరరెడ్డిది రాజకీయ కుటుంబం. ఆయన తండ్రి ఆదినారాయణరెడ్డి కందుకూరు నుంచి శాసనసభ్యుడిగా సుదీర్ఘకాలం ఉన్నారు. 1972 ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థి పోటీచేసిన ఆదినారాయణరెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి చెంచు రామానాయుడుపై గెలుపొందాడు. 1978లో జనతాపార్టీ అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్‌ అభ్యర్థి కొండయ్య చౌదరిపై ఓటమి చెందారు. ఆ తరువాత 1983లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసి టీడీపీ అభ్యర్థి గుత్తా వెంకట సుబ్బయ్యపై గెలుపొందారు. 1985లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి మరోమారు గుత్తా పై గెలిచారు.

దివిని రెండుసార్లు ఓడించి…..

ఆ తరువాత 1989 మహీధరరెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. కందుకూరు నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి మాలకొండయ్యపై విజయం సాధించారు. 1994లో స్వతంత్య్ర అభ్యర్థిగా 1999లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి టీడీపీ అభ్యర్థి దివి శివరాం చేతిలో ఓటమి చెందారు. ఆ తరువాత 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి టీడీపీ అభ్యర్థి దివి శివరాంను రెండు మార్లు వరుసగా ఓడించి సత్తా చాటారు మానుగుంట. వైఎస్‌ మృతి అనంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి క్యాబినెట్‌లో మున్సిపల్‌ శాఖామంత్రిగా పనిచేశారు.

కందుకూరులో కార్యాలయం ప్రారంభం….

రాష్ట్ర విభజన అనంతరం 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. ఇప్పటి వరకూ కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. చాలా కాలంగా మహీధర్‌రెడ్డి వైఎస్సార్‌సీపీలో చేరుతారన్న ప్రచారం సాగుతోంది. ఆయనతోపాటు ఆయన అనుచరవర్గం త్వ‌ర‌లోనే పెద్ద ఎత్తున పార్టీలో చేరనుంది. పశ్చిమ ప్రకాశంలోని కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, దర్శి తదితర నియోజకవర్గాల్లో మహీధరరెడ్డి ప్రభావం ఉంది. ఇది వైఎస్సార్‌ సీపీకి కలిసి వచ్చే అంశం. ఇక్క‌డ టీడీపీ నేత‌ల‌కు చెక్ పెట్టేందుకు మానుగుంటను వైసీపీ వినియోగించుకోనుంద‌ని తెలుస్తోంది. ఇక మ‌హీధ‌ర్‌రెడ్డి వైసీపీలో చేర‌డంతో ఇప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా ఉన్న తూమాటి మాధ‌వ‌రావును బుజ్జ‌గించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఇక ఇప్ప‌టికే కందుకూరులో త‌న కార్యాయ‌లం ప్రారంభించిన మ‌హీధ‌ర్‌రెడ్డి రంగంలోకి దిగ‌డంతో కందుకూరులో ర‌స‌వ‌త్త‌ర‌పోరుకు తెర‌లేచింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*