వైసీపీలో ఒకే ఒక్కడు….! టీడీపీలో మాత్రం….?

వ‌చ్చే సాధార‌ణ ఎన్నిక‌ల్లో సీట్ల కోసం నాయ‌కుల మ‌ధ్య వార్‌తో రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. కొన్ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో అధికార పార్టీలో సీట్ల కోసం ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఆరేడుగురు నాయ‌కులు కూడా పోటీ ప‌డుతున్నారు. విశాఖ జిల్లా మాడుగుల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం టికెట్ టీడీపీలో హాట్ కేక్‌గా మారుతోంది. ఒక్కరిద్ద‌రు కాదు.. ఏకంగా ఏడుగురు నాయ‌కులు టికెట్ కోసం ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అధిష్టానాన్ని మచ్చిన చేసుకునే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ పార్టీ గెలిచే అవ‌కాశాలు మెరుగ్గా ఉండ‌డంతో ఈ పోటీ ఏర్ప‌డిన‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. టికెట్ రేసులో ఉన్న ఈ ఏడుగురు నేత‌లు కూడా ఒకే సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారు కావ‌డం గ‌మ‌నార్హం. ఇందులో ఎవ‌రిని టికెట్ వ‌రిస్తుంద‌న్న‌ది పార్టీ వ‌ర్గాల్లో ఉత్కంఠ‌ను రేపుతోంది.

గత ఎన్నికల్లో ఓటమి పాలై…..

మాడుగుల‌లో గ‌త ద‌శాబ్దాలుగా ఎన్నిక‌లు ప‌రిశీలిస్తే 1983 నుంచి ఓట‌మి లేకుండా ఉన్న రెడ్డి స‌త్య‌నారాయ‌ణ‌ను 2004లో క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ ఓడించారు. 2009 లో కరణం ధర్మశ్రీ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2009లో ఇక్క‌డ టీడీపీ నుంచి గెలిచిన గ‌విరెడ్డి రామానాయుడు 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి పోటిచేసిన బూడి ముత్యాల‌నాయుడు చేతిలో ఓడిపోయారు. ప్ర‌స్తుతం మాడుగుల నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జిగా గ‌విరెడ్డి రామానాయుడు కొన‌సాగుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన ఆయ‌న‌ ఈసారి కూడా టికెట్ సంపాదించి.. ఎలాగైనా గెల‌వాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ముందుకువెళ్తున్నారు. పార్టీ కార్య‌క్ర‌మాల‌ను చురుగ్గా చేప‌డుతున్నారు. ఇక ఇదే స‌మ‌యంలో ఎన్ఆర్ఐ పైలా ప్ర‌సాద‌రావు కూడా టికెట్ రేసులో ఉన్నారు.

వీరంతా దానిపైనే….

పైలా 2009లో ప్రజారాజ్యం పార్టీ టిక్కెట్‌పై పోటీ చేసి ఓటమిపాల‌య్యారు. ఇక ఆ తర్వాత టీడీపీలో చేరి 2014లో టికెట్ ఆశించినా పార్టీ అధిష్ఠానం గవిరెడ్డికే టిక్కెట్‌ ఇచ్చింది. అయితే..ఈసారి ముందుగానే టిక్కెట్‌ సాధించాలన్న పట్టుదలతో నియోజకవర్గంలో కార్యక్ర మాలు నిర్వహిస్తున్నారు. ఈసారి మాత్రం ఎలాగైనా టికెట్ సాధించాల‌ని గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న జ‌న్మ‌భూమి రాష్ట్ర క‌మిటీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక‌ చీడికాడ మండలం తురువోలుకి చెందిన డాక్టర్‌ ముర్రు జయచంద్రనాయుడు కూడా టికెట్ పొందే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. విజయనగరంలో ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తున్న ముర్రు పార్టీ కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా ఉంటున్నారు. నియోజకవర్గంలో పార్టీ పరంగా ప‌లు సేవా కార్యక్రమాలు చేప‌డుతూ ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌వుతున్నారు.

రేసులో రెడ్డి సత్యనారాయణ…..

ఇదే స‌మ‌యంలో మాజీమంత్రి, గతంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రెడ్డి సత్యనారాయణ కూడా టికెట్ రేసులో ఉన్న‌ట్లు తెలుస్తోంది. గోవాడ షుగర్‌ ఫ్యాక్టరీ మాజీ చైర్మన్‌ గూనూరు మల్లు నాయుడు కూడా పోటీలో ఉన్నట్టు సమాచారం. ఈయ‌న‌ గత ఎన్నికల్లోనే టిక్కెట్‌ కోసం ప్రయత్నాలు చేశారు. దేవరాపల్లి జడ్పీటీసీ గాలి వరలక్ష్మి, చీడికాడ జడ్పీటీసీ పోలుపర్తి సత్యవతి భర్త పీవీజీ కుమార్‌ కూడా టిక్కెట్‌ రేసులో ఉన్నారు. వీరంద‌రూ కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా టికెట్ సాధించాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.. అయితే ఇందులో ఇద్ద‌రు ముగ్గురికి పార్టీ అధిష్టానం వ‌ద్ద గుర్తింపు ఉండ‌డం వారికి క‌లిసొచ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి.

ఏకంగా ఏడుగురు…..

టీడీపీ నుంచి ఏకంగా ఏడుగురు వ‌ర‌కు టిక్కెట్ రేసులో ఉంటే విప‌క్ష వైసీపీలో మాత్రం ఆస‌క్తిక‌ర ప‌రిస్థితి నెల‌కొంది. మాడుగుల‌ నియోజకవర్గంలో సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడికే మ‌ళ్లీ టికెట్ ఖాయంగా క‌నిపిస్తోంది. ఇత‌రుల పేర్లు విన‌బ‌డ‌డం లేదు. ఇక్క‌డ కొస‌మెరుపు ఏమిటంటే.. మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత గవిరెడ్డి రామానాయుడు సోదరుడు గవిరెడ్డి సన్యాసినాయుడు వైసీపీ టిక్కెట్‌ ఆశిస్తున్నట్టు తాజా స‌మాచారం. ఏదేమైనా.. టికెట్ రేసులో ఉన్న టీడీపీ నేత‌ల‌ను పార్టీ అధిష్టానం ఎలా స‌ర్దుబాటు చేస్తుంద‌న్న దానిపైనే ఆ పార్టీ విజ‌యావ‌కాశాలు ఆధారప‌డి ఉంటాయ‌ని ప‌లువురు నాయ‌కులు అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*