మ‌ళ్లీ వైసీపీ జెండానే.. రీజ‌న్ టీడీపీనే..!

ysrcongress-party-again-winnig-chances-in-sullurupet-constiuency

నెల్లూరు జిల్లా సూళ్లూరిపేట‌లో మ‌ళ్లీ వైసీపీ జెండానే ఎగురుతుందా? ఇక్కడి రాజ‌కీయాలు ఆ పార్టీకే అనుకూలంగా ఉన్నాయా? అంటే ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. 2009లో ఇక్కడ‌ టీడీపీ విజ‌యం సాధించింది. అయితే, 2014లో మాత్రం వైసీపీ నాయ‌కుడు క‌లివేటి సంజీవ‌య్య విజ‌యం సాధించాడు. మ‌రి ఈ ఐదేళ్లలో టీడీపీనే అధికారంలో ఉంది కాబ‌ట్టి ఇక్కడ‌ పార్టీ పుంజుకుని ఉండాలి లేదా వైసీపీ అయినా వీక్ అయి ఉండాలి. కానీ, రెండు జ‌ర‌గ‌లేదు. టీడీపీ వీక్ అవ‌గా వైసీపీ మాత్రం పుంజుకునే ప్రయ‌త్నంలో దూసుకుపోతోంది. స్థానిక టీడీపీని బ‌లోపేతం చేసిన వేనా టి మునిరెడ్డి వార‌సుడిగా రంగంలోకి దిగిన రామచంద్రారెడ్డికి ఆయన కుమారుడు సుమంత్‌రెడ్డికీ పొసగడం లేదట.

తండ్రి ఒక పార్టీలో…కొడుకు….

కొన్నాళ్ల కింద‌ట ఇక్కడ‌ జగన్ నిర్వహించిన‌ పాదయాత్ర సందర్భంగా సుమంత్ ఆయన్ని కలిశారు. ఇటీవలే వైసీపీలో చేరిపోయారు కూడా. తండ్రి టీడీపీలో కీరోల్ పోషిస్తుంటే.. కొడుకేమో వైసీపీలో కీలకంగా ఎదుగుతున్నారు. మంత్రి నారాయణతో పాటు ముఖ్య నేతల్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో టీడీపీ వ్యతిరేక పోస్టులతో సుమంత్ దడ..దడ లాడిస్తున్నారు. కుమారుడి తీరు రామచంద్రారెడ్డికి తలనొప్పిగా మారింది. కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి హవా కొనసాగింది. తరవాత ఆయన టీడీపీలో చేరారు. కాని ఆయన కేసులతో ఇబ్బందులు పడుతున్నారు.

ఆయన కూడా సైలెంట్ అయి…..

ప్రముఖ పారిశ్రామికవేత్త గంగాప్రసాద్ కూడా ఈ ప్రాంతంలో తన హవా చాటుకునేవారు. ప్రస్తుతం ఆయన కూడా సైలెంట్ అయిపోయారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణతో వియ్యమందుకున్నది మొదలు గంగా ప్రసాద్‌ వెంకటగిరిపై ఫోకస్ పెట్టారట. దీంతో సూళ్లూరుపేట ఆయన వర్గీయులు ఎటు మొగ్గుచూపుతారో చూడాలి. ఇక‌, పరసా రత్నం.. అయిదుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేశారు. మూడుసార్లు గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. గత ఎన్నికల్లో సూళ్లూరుపేటలో ఓటమిపాలైన రత్నం ప్రస్తుతం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ బాధ్యతల్లో ఉన్నారు. గతంలో ఆయనకు వేనాటి వారు చెప్పిందే వేదం. ఈ క్రమంగా తనకంటూ ఒక వర్గాన్ని తయారుచేసుకున్నారు.

క్యాడర్ ను తన వైపునకు తిప్పుకుంటూ….

ఎప్పటినుంచో టీడీపీ జెండా మోస్తున్నవారిని పట్టించుకోవడం లేదట. దీంతో వారంతా పరసాపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. టీడీపీలో ఎవరికివారే సైలెంట్‌గా ఉండటం, ముఖ్యనేతల మధ్య అనైక్యత వంటివి సూళ్లూరుపేట వైసీపీ ఎమ్మెల్యే కలివేటి సంజీవయ్యకి కలిసొస్తోంది. గ్రూపు తగాదాల నేపథ్యంలో టీడీపీ క్యాడర్‌ని తనవైపు తిప్పుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే వచ్చే ఎన్నికల్లో కూడా గెలుపుని సొంతం చేసుకునేందుకు వ్యహాలు రచిస్తున్నారు. సూళ్లూరుపేటలో గతంలో కంటే ఇటీవలికాలంలో అభివృద్ధి పనులు వేగంగా జరిగాయి. అయితే చేసిన పనులని ప్రచారం చేసుకునే పరిస్థితి కూడా టీడీపీలో లేదు. ఇలా అధికార పార్టీ చేజేతులా వైసీపీని ఇక్క‌డ గెలుపు గుర్రం ఎక్కిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*