వైసీపీ లేకున్నా మోత మోగిస్తారా?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం దాదాపు ఖరారయింది. ప్రతి ఆరునెలలకు ఒకసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. మళ్లీ జరపాల్సి రావడంతో వచ్చే నెల ఆరోతేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు సూత్రప్రాయంగా తెలియజేశారు. వచ్చే నెల 6వ తేదీ నుంచి పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రధాన అంశాలపై…..

ఈ సమావేశాల్లో ముఖ్యంగా కాపు రిజర్వేషన్లపై కేంద్రం వైఖరి, నిరుద్యోగ భృతి, పోలవరం తదితర అంశాలను ప్రధానంగా చర్చించనున్నారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అసెంబ్లీ వేదికగా మరోసారి కేంద్రంపైనా, ప్రధాని నరేంద్ర మోదీపైనా ప్రభుత్వం ధ్వజమెత్తనుంది. నాలుగున్నరేళ్లు గడుస్తున్నా విభజన హామీలు అమలు చేయకపోవడంపై నిరసనను తెలియజేయనుంది. ముఖ్యంగా ప్రత్యేకహోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని మరోసారి ఎండగట్టనుంది.

కాపు రిజర్వేషన్లపై……

ఇక కాపు రిజర్వేషన్లను అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా కేంద్రం నుంచి ఉలుకుపలుకు లేదు. దీనిపై వత్తిడి తెచ్చినా కేంద్రం నుంచి సహకారం లభించడం లేదన్న విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా తెలియజేయనున్నారు. 9వ షెడ్యూల్ లో చేర్చే అంశాన్ని కూడా కేంద్రం పరిశీలిచడం లేదన్న సంగతిని చెప్పనున్నారు. దీంతో పాటు నిరుద్యోగ భృతిపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో ప్రకటన చేయనున్నారు. దీనివల్ల ఎంతమందికి లబ్ది చేకూరుతుంది? ఎంత భారం ప్రభుత్వం పై పడనుందన్న విషయాన్ని సవివరంగా తెలియజెప్పనున్నారు.

బీజేపీదే ప్రతిపక్ష పాత్ర……

పదిరోజుల పాటు జరిగే శాసనసభ సమావేశాలకు ఈసారి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉండే అవకాశమే ఎక్కువగా కన్పిస్తోంది. పార్టీ మారిన సభ్యులపై అనర్హత వేటు వేసేంత వరకూ సభకు హాజరుకాబోమని వైసీపీ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసారి సభలో భారతీయ జనతా పార్టీ సభ్యులే ప్రతిపక్ష పాత్ర పోషించనున్నారు. ముఖ్యంగా పట్టిసీమ, ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవకతవకలపై బీజేపీ సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. అటు శాసనసభలోనూ, మండలిలోనూ తామే ప్రతిపక్షంగా వ్యవహరించి, రాష్ట్రానికి కేంద్రం చేసిన సాయం, దానిని ఎలా రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసిందీ కమలం పార్టీ సభ్యులు వివరించనున్నారు. మొత్తం మీద ఈసారి అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా జరగనున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*