లక్కులేనోడు….ఈ వైసీపీ లీడర్….!

రాజ‌కీయాల్లో ల‌క్కు లేనిదే నెట్టుకు రావ‌డం క‌ష్టం అంటారు అనుభ‌వ‌జ్ఞులు. ల‌క్ లేనివారు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసి మాత్రం ఏం లాభం.. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంటున్నారు వైసీపీ నాయ‌కుడు, నెల్లురు జెడ్పీ చైర్మ‌న్ బొమ్మిరెడ్డి రాఘ‌వేంద్ర రెడ్డి! ఆయ‌న రాజ‌కీయాల్లో ఎంతో ఎత్తుకు ఎద‌గాల‌ని ఆశ‌లు పెట్టుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే కావాల‌ని క‌ల‌లు క‌న్నారు. అయితే, నెర‌వేర్చుకునే క్ర‌మంలో ఆయ‌న‌కు ల‌క్ చిక్క‌క గంద‌ర‌గోళంలో ప‌డ్డారు. విష‌యంలోకి వెళ్తే.. పార్టీలకు అతీతంగా నెల్లూరు జిల్లా రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం సానుభూతి పొందుతున్న వ్యక్తి జడ్పీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర‌రెడ్డి. ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరడంతో ఒక్క రోజులోనే రాజకీయ భవిష్యత్తుపై ఈయన పెట్టుకున్న ఆశలు ఆవిరైపోయాయి.

తనకే టిక్కెట్ వస్తుందని……

నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ ఇన్‌చార్జిగా రాఘవేంద్రరెడ్డి నాలుగన్నర ఏళ్లపాటు ఉన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేను, నాయకులను ఇరుకున పెట్టడం కోసం దొరికిన అన్ని అవకాశాలను వినియోగించుకున్నారు. వెంకటగిరి టికెట్‌ తనకే వస్తుందన్న ఆశతో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆశీస్సులు కూడా ఉండటంతో ధీమాతో గడిపారు. కానీ.. ఒక్క రోజులో ఆయన కట్టుకున్న రాజకీయ మేడలు పేక మేడల్లా కూలిపోయాయి. వెంకటగిరిని ఆనం రామనారాయణరెడ్డికి అప్పగిస్తూ వైసీపీ అధినేత జగన్‌ తీసుకున్న నిర్ణయం బొమ్మిరెడ్డి రాజకీయ భవిష్యత్తునే ప్రశ్నార్థకంలోకి నెట్టింది. ఆనం వైసీపీలో చేరుతున్నారనే విషయం అందరికి తెలిసిందే.

బొమ్మిరెడ్డి అంచనా…….

అయితే ఆయనకు ఏ స్థానం ఇస్తారనేది అందరి లో చర్చనీయాంశంగా మారింది. వెంకటగిరి కేటాయించే అవకాశం లేదని బొమ్మిరెడ్డి వర్గీయులు గట్టిగా విశ్వసించారు. జగన్‌కు అత్యంత సన్నిహితులుగా ఉన్న మేకపాటి కుటుంబ సభ్యుల అభిష్టానికి వ్యతిరేకంగా ఆనంకు నియోజకవర్గం కేటాయించరని, ఆ కోణంలో వెంకటగిరి టికెట్‌ తన పరిధి దాటి వెళ్లదని బొమ్మిరెడ్డి అంచనా వేసుకున్నారు. అయితే ఆనం పార్టీలో చేరిన రోజే ఆ సస్పెన్స్‌కు తెరపడింది. వెంకటగిరి విషయంలో ఆనంతో కో-ఆర్డినేట్‌ చేసుకోమని జిల్లా ఇన్‌చార్జి సజ్జల రామ‌కృష్ణారెడ్డికి జ‌గన్‌ ఆదేశాలు జారీ చేయడంతో వెంకట గిరి టిక్కెట్టు ఆనం పరమయిందనే విషయం బొమ్మిరెడ్డికి అర్ధ‌మైంది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచిత‌న‌కు టికెట్ ల‌భిస్తుంద‌నే ఆశ‌లు దాదాపు గ‌ల్లంత‌య్యాయి.

ఆ అవకాశం కూడా……..

ఇక‌, ఆనం పార్టీ మారే ఉద్దేశంలో ఉన్నారన్న స్పష్టమైన సంకేతాలు అందిన వెంటనే తెలుగుదేశం అప్రమత్తమైంది. బొమ్మిరెడ్డికి గేలం వేసింది. టీడీపీలోకి వస్తే తక్షణం ఆత్మకూరు ఇన్‌చార్జిగా ప్రకటి స్తామని, రాబోయే ఎన్నికల్లో టిక్కెట్టు ఇస్తామని హామీ ఇచ్చింది. ఆత్మకూరు బొమ్మిరెడ్డికి సొంత నియోజకవర్గం కావడం, ఆయన తండ్రి డాక్టర్‌ బి.సుందర రామిరెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం, ఈ కుటుంబానికి ఆత్మకూరు ప్రజలతో మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో బొమ్మిరెడ్డి కోసం టీడీపీ నాయకులు ప్రయత్నిం చారు. అయితే జగన్‌ మీద ఉన్న నమ్మకంతో అధికార పార్టీ ఇచ్చిన ఈ అవకాశాన్ని బొమ్మిరెడ్డి వదులుకున్నట్లు చెబుతున్నారు. ఆ నమ్మకం ఒమ్మయిన క్రమంలో మరో అవకాశం కోసం చూద్దామన్నా వీలులేని పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ ఆత్మకూరు నుంచి బొల్లినేని కృష్ణయ్యను రంగంలోకి దించుతోంది. మొత్తానికి ఈ వైసీపీ నేత‌కు అన్ని విధాలా దారులు మూసుకుపోవ‌డం గ‌మ‌నార్హం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*