వైసీపీ బలంగా ఉన్న చోట బాబు….?

ఎన్నిక‌ల వేళ‌.. ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ స‌ర్వేల బాట ప‌ట్టారు. ఎన్నిక‌ల ముంగిట‌.. నాయ‌కుల వ్య‌వ‌హార శైలి, నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ ప‌రిస్థితి.. త‌న‌పై ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారు? ఎమ్మెల్యేల ప‌నితీరు.. ఎలా ఉంది? మ‌ంత్రుల ప‌నితీరు ఎలా ఉంది? వ‌ంటి కీల‌క అంశాల‌పై ఆఖ‌రిగా ఆయ‌న స‌ర్వే చేయించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎట్టి ప‌రిస్థితిలోనూ విజ‌యం సాధించి.. పార్టీని మ‌ళ్లీ అధికారంలోకి తీసుకురావ‌డమే చంద్ర‌బాబు ముందున్న ప్ర‌ధాన ల‌క్ష్యం! మ‌రి దీనిని సాధించేందుకు ఆయ‌న ఏం చేయాలి? అస‌లే త్రిముఖ పోటీ ఉంటుంద‌ని భావిస్తున్న వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాంటి వ్యూహాల‌ను అమ‌లు చేస్తే.. పార్టీ బ‌తికి బ‌ట్ట‌క‌ట్టి అధికారం చేప‌డుతుంది?

వైసీపీకి బలంగా ఉన్న నియోజకవర్గాల్లో…….

ఇలాంటి వాటి నుంచే చంద్ర‌బాబు మ‌దిలో మ‌ళ్లీ స‌ర్వే ఆలోచ‌న‌లు వ‌చ్చాయి. ముఖ్యంగా టీడీపీకి వైసీపీతోనే గ‌ట్టి పోటీ ఉంటుంద‌ని విశ్లేష‌ణ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో వైసీపీకి బ‌లంగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల‌ను త‌న‌వైపు తిప్పుకోవాల‌ని చంద్ర బాబు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో దాదాపు 40 నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌మైన నాయ‌కుల‌ను ఆయ‌న రంగ‌లోకి దింపాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే, వీరి ఎంపిక అంత ఈజీగా ఉండ‌రాద‌ని, ముఖం చూసి, సిఫార‌సులు చూసి టికెట్ ఇవ్వ‌రాద‌ని కూడా చంద్రబాబు డిసైడ్ అయ్యారు. కేవ‌లం స‌ర్వే ఆధారంగా.. స‌ర్వేలో వ‌చ్చిన మార్కుల ఆధారంగానే నాయ‌కుల‌ను నిర్ణ‌యించాల‌ని ఆయ‌న డిసైడ్ అయ్యారు.

ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కోటీమ్…….

దీంతో తాజాగా చంద్ర‌బాబు.. స‌ర్వేకి సిద్ధ‌మ‌య్యారు. అభ్యర్థుల ఎంపిక కోసం టీడీపీ అధిష్ఠానం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక టీమ్‌ని ఏర్పాటు చేసి.. ఒకరికి బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. పార్టీకి చెందిన వారు కానీ, స్థానికులుకానీ ఈ టీమ్‌లో ఉండరు. వీరు నిర్వహించిన సర్వే నివేదికను పార్టీకి చెందిన వారికి కాకుండా సీఎం చంద్రబాబు వ్యక్తిగత పరిశీలకులకు అందిస్తారు. సర్వేలో వెల్లడైన మెజార్టీ అభిప్రా యాలను క్రోడీకరించి.. అభ్యర్థి గుణగణాలు, గత చరిత్ర, పార్టీలు మారే స్వభావం.. ఇలా 18 అంశాలను పరిశీలించి అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తారు.

ఈ నెలాఖరు నాటికే……

ఈ నెలాఖరు నాటికి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఒక కొలిక్కి వస్తుందని చెప్తున్నారు. తాజాగా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జుల‌తోనూ భేటీ అయ్యారు. మొత్తం మీద అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను జ‌న‌వ‌రి నాటికి పూర్తి చేయాలన్నది పార్టీ అధిష్ఠానం యోచన గా ఉంది. అయితే పేర్లు ప్రకటించడానికి కొంత సమయం తీసుకునే అవకాశం ఉంద‌ని సీనియ‌ర్లు చెబుతున్నారు. మొత్తానికి ఈ స‌ర్వేల ఉదంతం పార్టీలో మ‌ళ్లీ చ‌ర్చ‌కు దారితీసింది. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇద్ద‌రు ముగ్గురు అభ్య‌ర్థుల పేర్ల‌తో కూడా స‌ర్వేలు చేయించారు. వీరిలో సిట్టింగ్‌ల కంటే మిగిలిన వారికి ఎక్కువ మార్కులు రావ‌డం పార్టీలో చాలా మందికి టెన్ష‌న్‌గా మారింది. ఈ క్ర‌మంలోనే రాబోయే రోజుల్లో ఏం జ‌రుగుతుందోన‌ని నాయ‌కులు హ‌డావుడి ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం.