వీరిద్దరి వల్లే వైసీపీ దూసుకుపోతోంది….!

నెల్లూరు జిల్లాలో టీడీపీని సొంత పార్టీ నాయ‌కుల‌నే బ‌ద్నాం చేస్తున్నారా ? పార్టీని ఎద‌గ‌నివ్వడం లేదా ? వైసీపీ బ‌లంగా ఉంద‌ని, ఆ పార్టీలోకి వెళ్తే బెట‌ర‌ని చాప‌కింద నీరుగా ప్రచారం చేస్తున్నారా ? అంటే… తాజా ప‌రిణామాలు ఔన‌నే స‌మాధాన‌మే ఇస్తున్నాయి. విష‌యంలోకి వెళ్తే.. గ‌త ఎన్నిక‌ల్లో నెల్లూరులో టీడీపీ ఆశించిన విధంగా సీట్లను ద‌క్కించు కోలేక పోయింది. వైసీపీ ప‌లు స్థానాల్లో కీల‌కంగా మారింది. దీంతో ఇక్కడ పార్టీని బ‌లోపేతం చేసుకోవాల‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల‌ని చంద్రబాబు భావించారు. అయితే, ఆయ‌న అనుకున్నది అనుకున్నట్టు జ‌రిగితే….. ఇప్పుడు నెల్లూరు రాజ‌కీయాలు తెర‌మీద‌కి ఎందుకు వ‌స్తాయి? ఇక్కడ త‌మ్ముళ్లే పార్టీ సైకిల్ కు పంక్ఛర్లు చేస్తున్నారు. పార్టీలో బ‌లం లేద‌ని త‌మ్ముళ్లే చెప్పుకొంటున్నారు.

వీరిద్దరి వల్లనేనా?

ముఖ్యంగా మంత్రి నారాయ‌ణ‌, సోమిరెడ్డి చంద్రమోహ‌న్‌రెడ్డిల వ్యవ‌హారం అయితే, పార్టీ ఎలా పోయినా ఫ‌ర్వాలేదులే.. అనే రేంజ్‌లో ఉండ‌డం గ‌మ‌నార్హం. నెల్లూరు జిల్లా టీడీపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇక్కడ నుంచి ఇద్దరు కీల‌క నాయ‌కులు మంత్రులుగా ఉన్నారు. అయితే, ఇద్దరూ కూడా ఎమ్మెల్సీలే కావ‌డం గ‌మ‌నార్హం. మంత్రులు పి. నారాయ‌ణ‌, సోమిరెడ్డిలు కూడా ప్రజా క్షేత్రం నుంచి వ‌చ్చిన వారు కాదు. సోమిరెడ్డి అయితే, వ‌రుస ప‌రాభ‌వాలు నెత్తికెత్తుకున్నారు. మ‌రి ఇలాంటి నాయ‌కుల మాట‌లను కిందిస్థాయి కేడ‌ర్ అస్సలు ల‌క్ష్య పెట్టడం లేద‌నేది తాజా వార్త.

పార్టీలో గ్రూపుల గోల…..

ఈ నేప‌థ్యంలోనే మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి పార్టీని వీడేందుకు అన్నీ సిద్ధం చేసుకున్నారు. కేవ‌లం ముహూర్తం కోస‌మే వేచి ఉన్నార‌ని తెలుస్తోంది. ఇద్దరు మంత్రులు జిల్లాలో త‌న‌ను రాజ‌కీయంగా అణ‌గ‌దొక్కే ప్రయ‌త్నాలు చేస్తుండ‌డాన్ని స‌హించ‌లేకే ఆయ‌న పార్టీ మారుతున్నార‌న్నది ఓపెస్ సీక్రెట్‌. ఇక‌, అంత‌టి నేత‌కే టీడీపీ అంటే విర‌క్తి పుట్టిన నేప‌థ్యంలో మేం ఎందుకంటూ.. ఆయన దారిలో మరి కొంత మంది ఉన్నారని ప్రచారం జరుగుతోంది. పార్టీలో ఉన్న గ్రూపుల గోల, వచ్చే ఎన్నికల్లో గెలవలేమనే భయంతో.. కొందరు పార్టీని వీడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

బలంగా వైసీపీ…..

వాస్తవానికి ఎవ‌రు కాద‌న్నా.. జిల్లాలో వైసీపీ చాలా బ‌లంగా ఉంది. తెలుగుదేశం పార్టీలోనే కొనసాగితే.. ఎన్నికల్లో గెలవడం కష్టమనే అభిప్రాయంతోనే… ఆనం పార్టీ మారుతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా… మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి కూడా పార్టీని వీడతారని ప్రచారం ఊపందుకుంది. ఆయన వస్తే… బాగుంటుందని.. స్వయంగా జగన్ అన్నట్టుగా జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేప‌థ్యంలో కీల‌క నేత‌లు మౌనంగా ఉండ‌డం, జిల్లాకే చెందిన మంత్రులు ప‌ట్టించుకోక పోవ‌డం కూడా పార్టీకి అశ‌నిపాతంగా ప‌రిణ‌మించింది.

ఆదాల కూడా అసంతృప్తిలో…..

ముఖ్యంగా ఆదాల విష‌యాన్ని తీసుకుంటే.. పార్టీ అధికారంలోకి వ‌చ్చి నాలుగేళ్లు గ‌డిచిపోతున్నా.. ఇప్పటి వ‌ర‌కు జిల్లాకు ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చడంలో పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని, ప్రజ‌ల్లోకి ఏ ముఖం పెట్టుకుని వెళ్తామ‌ని ప్రశ్నిస్తున్నారు. ఇదే విష‌యాన్ని మంత్రులు నారాయ‌ణ‌, సోమిరెడ్డిల‌తోనూ అన్నారు. అయితే, వీరి నుంచి స‌రైన స‌మాధానం ల‌భించ‌లేదు. దీంతో ఆయ‌న త్వర‌లోనే త‌న దారి తాను చూసుకుంటాన‌ని చెబుతున్నారు. మొత్తంగా నెల్లూరులో ఇద్దరు మంత్రులు ఉండి కూడా పార్టీ బ‌లోపేతం కాక‌పోగా.. నానాటికీ బ‌ల‌హీన ప‌డుతుండ‌డం అంద‌రినీ విస్మయానికి గురిచేస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*