అతనిని ఓడించడం అంత సులువు కాదు….!

ఏపీ సీఎం చంద్రబాబుకు పదే పదే సవాళ్లు విసురుతూ…. ఆయ‌న‌పై కయ్యానికి కాలు దువ్వుతూ… ఆయనను తీవ్రమైన ప‌ద‌జాలంతో దూషించే ఓ విపక్ష వైసీపీ ఎమ్మెల్యేను ఓడించేందుకు టీడీపీ అధిష్టానం ఎన్నో ఎత్తులు, స్కెచులు, వ్యూహాలు పన్నుతున్నా చివరికి అక్కడ టీడీపీ నుంచి పోటీ చేసేందుకు సరైన అభ్యర్థి ఆ పార్టీకి దొరకడం లేదు. కృష్ణా జిల్లాల్లో గుడివాడ నియోజకవర్గం పేరు చెపితే మనకు ముందుగా వినిపించేది దివంగత మాజీ ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ పేరు. ఎన్టీఆర్‌ తర్వాత గుడివాడ నియోజకవర్గాన్ని పార్టీలతో సంబంధం లేకుండా తన కంచుకోటగా మార్చుకున్నాడు సిట్టింగ్‌ ఎమ్మెల్యే కొడాలి నాని.

జూనియర్ సిఫార్సుతో…..

జూనియర్‌ ఎన్టీఆర్ సిఫార్సుతో 2004 ఎన్నికల్లో టీడీపీ టికెట్‌ దక్కించుకున్న నాని ఆ ఎన్నికల్లో 7వేల ఓట్ల మెజార్టితో వైఎస్‌ గాలిలోను గెలిచి రికార్డ్‌ సృష్టించారు. 2009 ఎన్నికల్లో రెండో సారి గుడివాడ నుంచి టీడీపీ తరుపున పోటీ చేసిన నాని 17వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించి జిల్లాలోనే అత్యధిక మెజార్టీని తన పేరిట లిఖించుకున్నారు. గత ఎన్నికలకు మందు టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీలోకి జంప్‌ చేసిన నాని… నాడు చంద్రబాబును తీవ్రమైన పదజాలంతో దూషించారు. వైసీపీ అధికారంలోకి వస్తుందని మంత్రి పదవి దక్కించుకోవచ్చన్న ఆశతో వైసీపీలో చేరిన నాని ఆశలు రివర్స్‌ అయ్యాయి. గత ఎన్నికల్లో గుడివాడలో నాని వైసీపీ నుంచి గెలిచి… ఓవరాల్‌గా హ్యాట్రిక్‌ కొట్టినా స్టేట్‌లో మాత్రం టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో నాని ఫ్యూచర్‌ గందరగోళంలో పడిపోయింది.

హ్యాట్రిక్ విజయాలతో…..

వరుస‌గా మూడు ఎన్నికల్లో నాని గెలుస్తున్నా… మూడుసార్లు ప్రతిపక్ష పాత్రకే పరిమితం కావడంతో అటు మంత్రి అవ్వాలన్న నాని కోరిక తీరలేదు ఇటు గుడివాడ నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయింది. ఇక గత కొద్ది రోజులుగా పదే పదే చంద్రబాబును టార్గెట్‌గా చేసుకుని తీవ్రస్థాయిలో ధ్వ‌జమెత్తుతున్నారు. వచ్చే ఎన్నికల్లో నానిని గుడివాడలో ఎలాగైనా ఓడించి ఇక్కడ పసుపు జెండా రెపరెపలాడేలా చేయాలని టీడీపీ అధిష్టానం విశ్వప్రయత్నాలు చేస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్‌ గుడివాడపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. లోకేష్‌ కొద్దిరోజుల క్రితం గుడివాడలో ప్రర్యటించి ప‌లు ప‌నుల‌కు హామీలు ఇచ్చి… కార్య‌క‌ర్త‌ల‌కు తాను అందుబాటులో ఉంటాన‌ని హామీ ఇచ్చారు.

బుద్ధా వెంకన్నను నియమించి……

ఇక్కడ ప్రొటోకాల్‌ ఇన్‌చార్జ్‌గా ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్నను నియమించి నానిని నిలువరించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నానిని ఓడించేందుకు పార్టీ అధిష్టానం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా గుడివాడలో ఆయనను ఢీకొట్టే బలమైన అభ్యర్థి ఎవరు లేకపోవడం పార్టీ దుస్థితికి అద్దం పడుతుంది. ఎన్టీఆర్‌ జన్మించి… అసెంబ్లీకి ప్రాథినిత్యం వహించిన ఈ నియోపకవర్గంలో ఇప్పుడు టీడీపీ తరుపున పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థి లేరంటే అది నిజంగా దౌర్భాగ్యమే. గుడివాడలో నానిపై టీడీపీ నుంచి పోటీ చేసేందుకు సరైన అభ్యర్థి దొరకడం లేదు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు నానికి ధీటుగా బలమైన అభ్యర్థి కాదన్న అభిప్రాయం పార్టీ వ‌ర్గాల్లోనే ఉంది. గుడివాడ మున్సిపల్ చైర్మ‌న్‌ యలవర్తి శ్రీనివాసరావు, గుడివాడ అర్బ‌న్ బ్యాంక్ చైర్మ‌న్ పిన్నమనేని పూర్ణ వీరయ్య కూడా టికెట్‌ రేసులో ఉన్నా వీళ్లు కూడా నానికి ఎంత వరకు పోటీ ఇస్తారన్నది సందేహ‌మే.

ఆ సీటు దక్కకుంటేనే……

ఈ క్రమంలోనే దివంగత మాజీమంత్రి దేవినేని నెహ్రూ తనయుడు దేవినేని అవినాష్‌ పేరు సైతం ఇక్కడ పరిశీలనలో ఉంది. గత ఎన్నికల తర్వాత నెహ్రూ పార్టీలో చేరినప్పుడు అయనకు అసెంబ్లీ సీటుపై పార్టీవర్గాల నుంచి హామీ వచ్చింది. ఇప్పుడు నెహ్రూ లేకపోవడంతో ఆయన తనయుడు అవినాష్‌కు గుడివాడ సీటును సర్దుబాటు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. విజయవాడ సిటీలో పట్టున్న అవినాష్ న‌గ‌రంలో ఓ సీటుపై క‌న్నేశారు. ఆ సీటు ద‌క్క‌ని ప‌క్షంలో ఆయ‌న ఇక్క‌డ‌కు వ‌స్తే గుడివాడలో బలంగా పాతుకుపోయిన నానికి ఎంత వరకు పోటీ ఇస్తారు… స్థానిక నాయకులు అవినాష్‌కు సపోర్ట్‌ చేస్తారా ? అన్నది కూడా సందేహమే. ఏదేమైనా గుగివాడ‌లో నానిని ఓడించతీరాలన్న కసితో పార్టీ అధిష్టానం ఉన్నా అందుకు తగిన అభ్యర్థిని ఎంపిక చెయ్యడంలో మాత్రం చంద్రబాబుకు పెద్ద తలనొప్పి తప్పేలా లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*