సర్దుకుపోదాం రండి….!

వైసీపీ అధినేత జగన్ కు చేరికలు కొత్త తలనొప్పులు తెచ్చేటట్లున్నాయి. ఎనిమిది నెలల క్రితం వరకూ వైసీపీలో చేరేందుకు ఎవరూ ముందుకు రాలేదు. పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు పార్టీని విడిచి వెళ్లిపోయారు. దీంతో పార్టీలో నైరాశ్యం అలుముకుంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఢీకొట్టగలమా? అన్న సందేహం ఒకదశలో పార్టీ నేతల్లో వ్యక్తమయింది. ఈ క్రమంలో ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను జగన్ నియమించడం, ఆ తర్వాత జరిగిన ప్లీనరీలో నవరత్నాలను ప్రకటించడం, వెనువెంటనే ప్రజాసంకల్ప పాదయాత్ర చేపట్టడంతో పార్టీకి మంచి బూమ్ వచ్చింది. నవరత్నాలకు మంచి స్పందన లభించింది. దీనికి పాదయాత్ర తోడు కావడంతో జగన్ పార్టీకి ఏపీలోని అన్ని జిల్లాల్లోని క్యాడర్ లో జోష్ పెరిగింది.

పార్టీ కార్యక్రమాలకు దూరంగా…..

మూడున్నరేళ్ల పాటు నైరాశ్యంలో ఉన్న వైసీపీ నేతలు పార్టీ కార్యక్రమాలను పెద్దగా చేపట్టలేదు. ఎన్నికల్లో ఓటమి పాలయి ఆర్థికంగా నష్టపోయి కొందరు, ఏడాది ముందు జనంలోకి వెళ్లాలని మరికొందరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు. దీంతో వైసీపీ ఒక దశలో నిస్తేజంగా మారింది. అయితే జగన్ పాదయాత్ర ప్రభావమో…తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడమో తెలియదు కాని ఆ పార్టీకి మంచి ఊపు వచ్చింది. దీంతో వైసీపీలో చేరేందుకు అనేక మంది నేతలు ముందుకు వస్తున్నారు. కడప, కర్నూలు జిల్లాల్లో పాదయాత్ర జరుగుతున్నప్పుడు పెద్దగా నేతలు చేరకపోయినప్పటికీ అనంతపురం జిల్లా నుంచి చేరికలు మొదలయ్యాయి. గుంటూరు జిల్లాకు వచ్చే సరికి నేతలు పార్టీలోకి క్యూ కట్టడం మొదలుపెట్టారు.

చేరికలతో విభేదాలు…..

పార్టీలోకి వచ్చే వారందరినీ జగన్ సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాలతో అనేకమంది పార్టీలో చేరేందుకు రెడీ అయిపోయారు. కొందరు ఇప్పటికే చేరిపోగా మరికొందరు జగన్ స్వయంగా కండువా కప్పే ముహూర్తాన్ని పెట్టేసుకున్నారు. అయితే ఈ చేరికలతో పార్టీలో విభేదాలు పెరిగాయన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. కొత్తగా వచ్చే నేతలకు ఎనిమిదేళ్లుగా పార్టీలో ఉన్న వారు కలసి పనిచేస్తారా? అన్నది సందేహమే. చేరికలతో బలం పెరుగుతుందని భావించి జగన్ గేట్లు ఎత్తివేశారు. దీంతో పోలో మంటూ నేతలు వచ్చి పడుతున్నారు. అయితే పేరున్న నేతలే వస్తుండటంతో పార్టీకి బలమేనని పైకి చెబుతున్నా లోపల మాత్రం అనుమానాలు లేకపోలేదు. పార్టీకి కష్టకాలంలో అండగా ఉన్నవారికి ప్రత్యామ్నాయం చూపాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

నచ్చజెప్పే ప్రయత్నాలు…..

ఇప్పటికే నెల్లూరు, ప్రకాశం జిల్లాలో చేరికలతో విభేదాలు పొడచూపాయి. నెల్లూరులో ఆనం రామనారాయణరెడ్డి త్వరలో చేరబోతుండటంతో మేకపాటి వర్గీయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జగన్ తో పర్సనల్ గా మాట్లాడి తమ విషయమేంటో తేల్చుకోవాలని మేకపాటి భావిస్తున్నారు. టిక్కెట్ల విషయంలో తేడా వస్తే ఊరుకునేది లేదని పరోక్షంగా మేకపాటి వర్గం పార్టీ నాయకత్వానికి సంకేతాలు కూడా పంపింది. అలాగే ప్రకాశం జిల్లాలో మానుగుంట మహీధర్ రెడ్డి రాకను కందుకూరు వైసీపీ ఇన్ ఛార్జి తూమాటి మాధవరావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే మాధవరావుకు మించి బలమైన వ్యక్తి మహీధర్ రెడ్డి అన్నది అందరికీ తెలిసిందే. అయితే కొన్నేళ్లపాటు పార్టీ కోసం కష్టపడిన తనకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని తూమాటి కూడా జిల్లా పార్టీ బాధ్యులతో చెప్పినట్లు తెలిసింది. ఇలా వలసలతో అనేక ప్రాంతాల్లో విభేదాలు తలెత్తే అవకాశాలున్నాయి. కాని జగన్ మాత్రం బలమైన అభ్యర్థులు దొరికిన చోట పార్టీలో చేర్చుకోక తప్పదని, టిక్కెట్ రాకపోయినా అధికారంలోకి వస్తే తగిన పదవులు ఇస్తామని నచ్చ జెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. సర్దుకుపోవాలని సూచిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*