ఎగిరేది జ‌గ‌న్ జెండాయే..!

కృష్టా జిల్లాలోని పశ్చిమ కృష్టాలో పశ్చిమగోదావరి జిల్లాకు సరిహద్దుగా ఉన్నా నూజివీడు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ జెండానే ఎగురుతుందా ? ఇక్కడ సిట్టింగ్‌ వైసీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావే తిరిగి పాగా వెయ్యనున్నారా ? అంటే నూజివీడు నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిణామాలు అవుననే స్పష్టం చేస్తున్నాయి. ప్రతిపక్ష ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నూజివీడులో ఇక్కడ జరిగిన అభివృద్ధి, ఎమ్మెల్యే పనితీరు కంటే విపక్షంలోని లుకలుకలే తిరిగి వైసీపీని గెలిపించేందుకు దోహదం చేస్తాయి అన్న దానిలో సందేహమే లేదు. వాస్తవంగా చెప్పాలంటే కృష్టా జిల్లాలో నూజివీడు సీటును టీడీపీ ఓ బలిదానం సీటుగా భావిస్తున్నట్టే కనిపిస్తోంది.

చివరిక్షణంలో అభ్యర్థిని……

ప్ర‌తి ఎన్నిక‌ల‌కు ముందు జిల్లాల్లోని మిగిలిన అన్ని నియోజకవర్గాల అభ్యర్ధులు ఖ‌రారయ్యాక చివరి క్షణంలో ఎవరికి సీటు ఇవ్వాలో తెలియని పక్షంలో ఏదో ఒక ఈక్వేషన్‌లో టీడీపీ ఇక్కడ అభ్యర్థిని నిలబెట్టేసి చేతులు దులుపుకుంటుంది. అంతేగాని పార్టీని బలోపేతం చెయ్యాలన్న అంశంపై ఏ మాత్రం దృష్టి పెట్టడం లేదు. గత మూడు ఎన్నికల్లోనూ ఇదే తంతు. 2004 ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే కోటగిరి హనుమంతరావు ఓటమి తర్వాత 15 సంవత్సరాల్లో ఇప్పటికి ఇక్కడ టీడీపీ తరుపున బలమైన అభ్యర్థిని ఎంపిక చేయలేని దీనస్థితికి టీడీపీ దిగజారిపోయింది. 2009 ఎన్నికల్లో నూజివీడు టీడీపీ సీటు కోసం పలువురు పోటి పడ్డారు. చివరకు గ్రామస్థాయి లీడర్లు కూడా తమకే ఎమ్మెల్యే సీటు కావాలని అధిష్టానం వద్ద పోటీ పడ్డారంటే ఇక్కడ పార్టీ ఎంత దీనస్థితికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.

ప్రజారాజ్యాన్ని…..

2009లో ప్రజారాజ్యం నుంచి దిగుమతి చేసుకున్న చిన్నం రామకోటయ్యకు సీటు ఇవ్వగా టీడీపీ కార్యకర్తలంతా పార్టీ మీద అభిమానంతో ఆయనను గెలిపించారు. మూడేళ్లు తిరగకుండానే ఆయన అధిష్టానంపై తిరగబాటు ఎగరవేసి కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఇక గత ఎన్నికల్లో మళ్లీ నియోజకవర్గానికి సంబంధం లేని ముద్రబోయిన వెంకటేశ్వరరావును బీసీ కార్డు ప్రయోగిస్తూ ఇక్కడ దింపారు. ఆ ఎన్నికల్లో స్థానిక పార్టీనాయకులకు ముద్రబోయినకు పొస‌గ‌లేదు. దీంతో టీడీపీ వాళ్లే ఆయనను చిత్తు చిత్తుగా ఓడించారు. ఎన్నికల తర్వాతైన ముద్రబోయిన ఇక్కడ పార్టీ కేడర్‌ను సమన్వయం చేసుకుంటూ ముందు పోవాల్సింది పోయి ఏలూరు ఎంపీ మాగంటి బాబుతో వైరం పెట్టుకున్నారు. దీంతో నియోజకవర్గ టీడీపీ ఎంపీ మాగంటి వర్గం… నియెజకవర్గ ఇన్‌ఛార్జ్‌ ముద్రబోయిన వర్గంగా రెండుగా చీలిపోయింది. ఇప్పుడు ఈ పరిణామాలే వైసీపీకి సానుకూలంగా మారుతున్నాయి.

బలమైన అభ్యర్థి ఉంటే తప్ప……

ఇక్క‌డ‌ నుంచి వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరుపున ఎవరు పోటీ చేస్తారో క్లారిటీ లేకపోవడం ఒక మైనెస్‌ అయితే ఎన్నికలకు ముందు ఎవరినైనా కొత్త అభ్యర్థిని పోటీలో పెట్టినా… వాళ్లకు ఇక్కడ ఎలెక్షనింగ్‌ చేసే సమయం లేకపోయినా టీడీపీ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం దృష్టి పెట్టి నూజివీడు టీడీపీ పగ్గాలు అన్ని ఈక్వేషన్ల కోణంలో ఆలోచించి ఓ బలమైన అభ్యర్థికి అప్పగిస్తేనే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ పుంజుకుంటుందని… లేకపోతే మళ్లీ ఇక్కడ ఎగిరేది వైసీపీ జెండాయేనని టీడీపీ వర్గాలే చెబుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*