కంచుకోట‌లో సీన్ తేడా….. వైసీపీ పుంజుకుందా…!

ysrcongressparty-in-krishna-district

రాష్ట్రంలో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ రాష‌్ట్రంలో ముగిసింది. దాదాపు అర్ధరాత్రి వరకు కూడా సాగిన పోలింగ్‌ ప్రక్రియ ఓ మరకగానే మిగిల్చింది. అయితే, ఎక్కడికక్కడ ప్రజలు పోటిత్తి ఓటేయడం మాత్రం ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉందని చెప్పడానికి ప్రధాన నిదర్శనంగా మారింది. రాజధాని జిల్లాగా ఉన్న కృష్ణా జిల్లాలోనూ ఓటర్లు భారీ ఎత్తున తరలి వచ్చారు. ఎక్కడికక్కడ ఓటర్లు తమ చైతన్యాన్ని చాటి చెప్పారు. గన్నవరం, పెనమలూరు వంటి నియోజకవర్గాల్లో ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చి తమ సత్తా చాటుకున్నారు. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్‌ కేంద్రాలకు తరలి వచ్చి తమ నేతలకు ఓటెత్తారు. ఇక, ఈ జిల్లాలో ముగిసిన ఎన్నికల ప్రక్రియ తర్వాత ఏ పార్టీ పరిస్థితి ఏంటి? అనేది చర్చకు వస్తోంది.

ఫలితాలు మారతాయా…?

కృష్ణా జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రెండు ఎంపీ స్థానాలు ఉన్నాయి. అలాగే ఏలూరు ఎంపీ సీటు ప‌రిధిలో జిల్లాలోని నూజివీడు, కైక‌లూరు సెగ్మెంట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో రెండు ఎంపీ స్థానాలను కూడా టీడీపీ తన ఖాతాలో వేసుకుంది. ఇక, అసెంబ్లీ విషయానికి వస్తే.. నూజివీడు, తిరువూరు, పామర్రు, గుడివాడ, విజయవాడ వెస్ట్‌ లలో వైసీపీ విజయం సాధించింది. ఒక్క కైకలూరులో మాత్రం బీజేపీ జెండా ఎగరేసింది. ఇక, ఈ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు వస్తాయా? లేక ఏమైనా మారతాయా? అనే ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబుపై సానుకూల పవనాలు ఉన్నప్పటికీ.. చాలా నియోజకవర్గాల్లో మాత్రం సిట్టింగ్‌ టీడీపీ ఎమ్మెల్యేలపై తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ఒకానొక సందర్భంలో చంద్రబాబు సైతం ఈ విషయాన్ని గ్రహించారు. సిట్టింగ్‌ ఎంపీ, ఎమ్మెల్యేలు పొరపాట్లు చేస్తే .. వాటిని సరిదిద్దుతానని, ఈ దఫా తనకే అవకాశం ఇవ్వమని ఆయన చెప్పుకొచ్చారు.

సీట్లు కోల్పోతుందా…?

అయితే, ప్రజలు చంద్రబాబు వైపు మొగ్గారో.. లేక ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై తమకున్న ఆవేదనను వెళ్లగక్కారా ? అనేది మాత్రం మే 23 వరకు వెయిట్‌ చేస్తేనే తప్ప స్పష్టం కాదు. అయితే, పోలింగ్‌ సరళిని చూస్తే.. మాత్రం దాదాపు 4 నుంచి 6 నియోజకవర్గాల్లో టీడీపీ తన అభ్యర్థులను కోల్పోతున్న పరిణామమే కనిపిస్తోంది. ముఖ్యంగా విజయవాడలో సెంట్రల్‌ నియోజకవర్గం, పశ్చిమ నియోజకవర్గంలో పోలింగ్‌ పూర్తి కాకముందుగానే ఈ తరహా విశ్లేషణలు ఊపందుకున్నాయి. ఇక, మంత్రి దేవినేని ఉమా ప్రాతినిధ్యం వహిస్తున్న మైలవరం నియోజకవర్గంలోనూ వ్యతిరేక పవనాలు కనిపించాయి. మంత్రి ఉమా త‌న జీవితంలో ఎన్నడూ లేనంత ట‌ఫ్ ఫైట్ ఎదుర్కొన్నారు. ఉమా ఓడిపోతాడ‌ని చెప్పేవాళ్లు, గెలిచేవాళ్ల సంఖ్య స‌గం స‌గం ఉంది.

నేతలపై ఉన్న వ్యతిరేకతే…..

టీడీపీకి పెన‌మ‌లూరు, విజ‌య‌వాడ తూర్పు, గ‌న్నవ‌రం గ్యారెంటీగా గెలిచే ఛాన్సులు ఉన్నాయి. మంత్రి కొల్లు రవీంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్న మచిలీపట్నంలోనూ వ్యతిరేక గాలులు కనిపించాయి. అయితే ఇక్కడ వైసీపీ, జ‌న‌సేన అభ్యర్థులు కాపులు కావ‌డమే టీడీపీ అభ్యర్థికి క‌లిసి రానుంది. అదేవిధంగా జగ్గయ్యపేట, నందిగామల్లోనూ టీడీపీవ్యతిరేకత కనిపించింది. పామ‌ర్రు, పెడ‌న‌, గుడివాడ‌, కైక‌లూరు, నూజివీడులో వైసీపీ గాలులు వీచాయ్‌. తిరువూరులో మంత్రి జ‌వ‌హ‌ర్ కూడా ఏటికి ఎదురీదుతోన్న ప‌రిస్థితే. ఆయా నియోజకవర్గాల్లో ఓటు వేసిన అనంతరం తెలుసుకున్న పరిస్తితిని గమనిస్తే.. ప్రజలు స్థానిక నేతలపై ఉన్న వ్యతిరేకతనే ఓటింగ్‌లో చూపించినట్టు తెలుస్తోంది. ఏదేమైనా.. రాజధాని జిల్లాలో టీడీపీకి గతంలో వచ్చిన ఓట్లు, సీట్లు తగ్గే పరిస్థితి కనిపిస్తోంది.

Ravi Batchali
About Ravi Batchali 17221 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*