
ప్రత్యేకహోదా పోరాటాన్ని ప్రతిపక్ష నేత జగన్ గ్రామస్థాయికి తీసుకెళుతున్నారు. ప్రజల్లోనూ హోదా కాంక్ష రగిలేలా చేయడంలో విజయవంతం అయ్యారు. అంతేగాక అధినేత ఏ ఆదేశాలిచ్చినా వెంటనే నాయకులంతా తూచ తప్పకుండా పాటించేస్తున్నారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామస్థాయి నేతలంగా తాహతుకు మించి మరీ.. ఉద్యమాలు, నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. నాణేనికి మరోవైపు మాత్రం ఈ నేతలందరిలో సరికొత్త టెన్షన్ మొదలైంది. అధినేత పిలుపునివ్వడం సరేగానీ.. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఇప్పటికే చాలా మంది నియోజకవర్గ ఇన్‌ఛార్జులు చేతిచమురు వదిలించుకుంటున్నారు. అసలే ఎన్నికల ఏడాది కావడంతో ఆర్థికంగా వెనుకంజ వేసేందుకు జంకుతున్నారు. అయితే ఇన్ని చేసినా తమకు అధినేత టికెట్ ఇస్తారో లేదోననే భయం మాత్రం వీరిని వెంటాడుతోందట.
ఆర్థికంగా నలిగిపోయి…..
ప్రస్తుతం ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే.. అంతకు రెట్టింపు స్థాయిలో నాయకులు కూడా బాధలు పడుతున్నారు. అధికార పార్టీ నేతల పరిస్థితి కొంత బాగానే ఉన్నా.. ప్రతిపక్ష నేతల పరిస్థితి మరీ దిగజారిపోయిందట. ఒకపక్క అధినేత జగన్ పాదయాత్ర.. మరోపక్క నిరసనలు, ఆందోళనలు, ఇతర కార్యక్రమాలకు జనసమీకరణ.. ఇలా అన్నీ ఆర్థికంగా ముడిపడి ఉన్నవే కావడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారట. అంతేగాక ఎప్పుడు ఏ కార్యక్రమాన్ని ప్రకటిస్తారోనని హడలిపోతున్నారట. ఇప్పటికే ఏడెనిమిదేళ్లుగా ప్రతిపక్షంలోనే కొనసాగుతుండటంతో ఆర్థికంగా నలిగిపోయారు. ఈ ఎన్నికలు అధినేతతో పాటు తమ రాజకీయ భవిష్యత్‌కు ఎంతో కీలకం కనుక.. ఆర్థిక నష్టాలు వెంటాడుతున్నా.. కొందరు ధైర్యంతో ముందుకెళుతుంటే మరికొందరు మాత్రం వణికిపోతున్నారట.
ఖర్చులు తడిసి మోపెడు…..
వైసీపీ నేతలకు ఇప్పుడు ఇదే భయం పట్టుకుంది. పార్టీ హైకమాండ్ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా అందులో జోష్‌గా పాల్గొనాల్సి వస్తుండటంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు భయపడిపోతున్నారట. వైసీపీలో ఇప్పటివరకు ఉన్న 44 మంది ఎమ్మెల్యేలతోపాటు మిగిలిన సీనియర్ నేతలకు పార్టీ కార్యక్రమాలకు పెడుతున్న ఖర్చులు తడిసి మోపుడవుతున్నాయి. జగన్ యువభేరి నుంచి మొదలైన కార్యక్రమాలు ఇటీవల ఎంపీల దీక్ష, తాజాగా ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ చేపట్టిన బంద్ వరకూ అన్నీ డబ్బుతో కూడుకున్నవి కావడంతో ఆయా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్చార్జులు తీవ్ర ఇబ్బందులు పడ్డారట. భవిష్యత్ గెలుపు కోసం అప్పులు చేసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.
పాదయాత్ర ప్రవేశించగానే….
ఇక జగన్ పాదయాత్ర ముగిసే వరకూ ఆయా జిల్లాల నేతలకు గుండె గుబేల్ మంటోంది. పాదయాత్ర తమ నియోజకవర్గం పొలిమేర దాటేలోగా దాదాపు రూ.20 లక్షల నుంచి రూ.25లక్షల దాకా ఖర్చు అవుతోందని ఆ పార్టీ నేతలు వాపోతున్నారట. మరోవైపు ఆ పార్టీ ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల అభివృద్ధి కోసం వచ్చే నిధులు నాలుగేళ్లుగా నిలిచిపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. నియోజకవర్గాల్లో పార్టీ ఆదేశించిన ప్రతి కార్యక్రమానికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ ఖర్చవుతోంది. ఈ ఆర్ధిక ఇబ్బందులను ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోతున్నారట. ఎంత ఖర్చు చేసినా తమకే సీటు ఇస్తారా? లేదా? అన్న భయంలో మరికొందరు నేతలు ఉన్నారట.
Leave a Reply