ఆ వైసీపీ ఎమ్మెల్యే దశ తిరిగిందా…!

ycp mla muthyalanaidu in jagan goodlooks

రాజకీయాల్లో నమ్మకం, నిజాయతీ అన్న పదాలకు అర్ధాలు మారిపోతున్న రోజులివి. పదవులు కావాలంటే ఫిరాయించాలి. నమ్మించి గొంతు కోయాలి. మరి అటువంటివి లేకుండానే రాజకీయాల్లో రాణించవచ్చునని కొంతమంది మాత్రమే నిరూపించగలరు, అటువంటి వారిలో విశాఖ జిల్లా మాడుగుల వైసీపీ ఎమ్మెల్యే ఒకరు. ఆయన విశాఖ నుంచి 2014 ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలో ఒకరు. మిగిలిన ఇద్దరు ఎమ్మెల్యేలు జెండా ఎత్తేసినా పార్టీ కోసం నమ్మకంగా ఉన్న వారు మాడుగుల వైసీపీ ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు. ఆయన్ను కూడా టీడీపీ అనేక ప్రలోభాలు పెట్టింది. ఏకంగా 30 కోట్ల రూపాయలు ఇస్తామని కూడా ఆఫర్లు ఇచ్చిందని స్వయంగా ఆయనే చెప్పారు. కానీ గెలిచిన పార్టీకి వెన్నుపోటు పొడవకూడదన్న నీతికి కట్టుబడి ఆయన కొనసాగుతూ వచ్చారు.

మళ్ళీ టికెట్

బూడి ముత్యాలనాయుడు నిజాయతీని గుర్తించిన జగన్ ఈసారి ఎన్నికల్లో కూడా ఆయనకే టికెట్ ఇచ్చేందుకు నిర్ణయించారని టాక్ నడుస్తోంది. జగన్ ఎప్పుడు అభ్యర్ధులను ప్రకటించినా అందులో మొదటి లిస్ట్ లోనే బూడి పేరు ఉంటుందని అంటున్నారు. మాడుగులలో టీడీపీ నుంచి కూడా కొంతమంది పార్టీ మారి వచ్చేందుకు రెడీ అవుతున్నా జగన్ మాత్రం బూడికే టికెట్ కన్ ఫర్మ్ చేశారని అంటున్నారు. దీంతో బూడి వర్గీయుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. విశాఖ జిల్లాలో ఒకే ఒక్కడుగా ఉన్న ఎమ్మెల్యే బూడికి ఇది బహుమానం అంటున్నారు.

గెలిస్తే మంత్రి పదవి

ఇక బూడి వైసీపీ తరఫున గెలిచి పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి కూడా ఖాయమని ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉండగా మాడుగుల చరిత్రలో నాలుగుసార్లు గెలిచి మంత్రి పదవి చేపట్టిన టీడీపీ నాయకుడు రెడ్డి సత్యనారాయణ ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఆయన తరువాత ఎవరూ రెండవ మారు గెలవలేదు, మంత్రి పదవి కూడా దక్కలేదు. ఈ రికార్డ్ ని బద్దలు కొట్టి మళ్ళీ తమ నాయకుడు ఎమ్మెల్యేగా గెలుస్తాడని, ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని, తప్పకుండా తమ నేత మంత్రి అవుతాడని బూడి వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*