మేధావులు మైండ్ ఎవ‌రి వైపు? వైసీపీలో అంతర్మధనం

అవును! వ‌చ్చే ఏడాది ఏపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఒక్క ఏపీ అనే మాటేమిటి.. దేశ‌వ్యాప్తంగా సార్వ‌త్రిక స‌మ‌రానికి రంగం సిద్ధ‌మైంది. దీంతో అన్ని పార్టీల్లోనూ అంత‌ర్మ‌థ‌నం ప్రారంభ‌మైంది. ముఖ్యంగా ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ప్ర‌తి ష్టాత్మ‌కంగా భావిస్తున్న టీడీపీ, వైసీపీ, ప‌వ‌ర్ స్టార్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీల్లో అంత‌ర్మ‌థ‌నం ప్రారంభ‌మైంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు మాస్‌ను న‌మ్ముకున్న నాయ‌కులు ఇప్పుడు హ‌ఠాత్తుగా మేధావి వ‌ర్గం వైపు దృష్టి పెట్ట‌డం అందరినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్న విష‌యం. దీనికి ప్ర‌ధాన కార‌ణంగా మేధావులు గ‌త కొన్నాళ్లుగా బ‌హిరంగంగా గ‌ళం విప్ప‌తున్నారు.

వీరికి పెరిగిన డిమాండ్……

గ‌తంలో టీవీ చానెళ్లలో రాజ‌కీయ చ‌ర్చ‌లు జ‌రిగిన‌ప్పుడు సీనియ‌ర్ మోస్టు రాజ‌కీయ నేత‌లు కూర్చుని స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేవారు. అయితే, ఇప్పుడు మారిన ప‌రిస్థితుల్లో మేధావుల‌ను ప్రొఫెస‌ర్ల‌ను కూడా ఛానెళ్లు ఆహ్వానిస్తున్నాయి. దీంతో మేధావి వ‌ర్గానికి డిమాండ్ పెరిగింది. ఇక‌, వీరికి ఫాలోయింగ్ కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం., దీంతో మేధావి వ‌ర్గంగా పేరు ప‌డిన వ్య‌క్తి ఇచ్చిన పిలుపు, చేసిన సూచ‌న‌ల‌కు ఎంతో వాల్యూ కూడా ఉంటోంది. దీంతో ఇప్పుడు ఈ మేధావి వ‌ర్గం ఎటువైపు నిలుస్తుంది? ఎవ‌రికి ఓట్లు వేయ‌మ‌ని ప‌రోక్షంగా ప్ర‌జ‌ల‌కు సూచ‌న‌లు చేస్తుంది ? వంటి కీల‌క అంశాల‌పై పార్టీలు దృష్టి పెట్టాయి.

తెలంగాణ ఉద్యమంలో సయితం…..

నిజానికి తెలంగాణ ఉద్య‌మాన్ని కూడా మేధావుల సంఘం జేఏసీ ముందుకు న‌డిపించింది. వివిధ పోరాటాల రూపంలో మేధావులు రోడ్ల‌మీద‌కు వ‌చ్చి ప్ర‌జ‌ల‌ను చైత‌న్యం చేశారు. పోనీ.. అంత రేంజ్‌లో కాక‌పోయినా. కొంత‌మేర‌కైనా ఏపీలో ప్ర‌జ‌ల‌ను మేధావులు ప్ర‌భావితం చేయ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీంతో అన్ని పార్టీలూ మేధావుల వంక చూస్తున్నాయి. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో మేధావి వ‌ర్గం పూర్తిగా చంద్ర‌బాబుకు అనుకూలంగా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఒకింత ఆశ్చ‌ర్యంగా ఉన్న‌ప్ప‌టికీ ఇదినిజం. గ‌తం ఏడాది కింద‌టి వ‌ర‌కు కూడా ప‌వ‌న్ వైపు నిలిచిన మేధావి వ‌ర్గం ఇప్పుడు బాబువైపు తిరిగింది.

దశ..దిశ లేదని…..

ప‌వ‌న్ పార్టీకి ఒక ద‌శ దిశ లేద‌ని మేధావుల మాట‌. నిజానికి స‌మాజంలో మార్పు కోరుకునే వారిలో మేధావులే ముందుంటార‌న్న విష‌యం తెలిసిందే. అయితే, వారు తొలుత మార్పును ఆశించారు. అయితే, ప‌వ‌న్ త‌న రాజ‌కీయ సిద్ధాంతాల‌ను కానీ, వ్యూహాల‌ను కానీ ప్ర‌క‌టించ‌డంలోనూ ఉద్య‌మ పంథాలో స‌మ‌స్య‌ల‌ను సాధించే ల‌క్ష‌ణం చూపించ‌లేక పోవ‌డం వ‌ల్లా.. మేధావులు మౌనం వ‌హించారు. ఇక‌, జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న‌పై ఉన్న కేసుల నేప‌థ్యంలో ఆయ‌న‌ను స‌మ‌ర్ధించ‌లేమని కొందరు బహిరంగంగా చెబుతున్నా…మరికొందరు మాత్రం కావాలని పెట్టిన కేసులనికొట్టి పారేస్తున్నారు.

చంద్రబాబుకు అనుకూలమా?

ఇక‌, మిగిలింది చంద్ర‌బాబు. ఆయ‌న‌పై ఎలాంటి వివాదాలూ లేక‌పోవ‌డం, రాజ‌కీయంగా సీనియ‌ర్ మోస్ట్ కావ‌డం, జాతీయ రాజ‌కీయాల్లోనూ త‌న‌దైన శైలిలో ముందుకు పోతుండ‌డం వంటి ప‌రిణామాలు ఇక్క‌డ క‌లిసి వ‌చ్చాయి. దీంతోమేధావులు ఇప్పుడు బాబుకు అనుకూలంగా చ‌క్రం తిప్పుతున్నారని స‌మాచారం. అయితే వీరిలో కూడా మెజార్టీ వ‌ర్గం బాబు వైపు మొగ్గు చూపుతున్నా కొంద‌రు బాబును వ్య‌తిరేకిస్తోన్న వారు ఇన్‌డైరెక్టుగా జ‌గ‌న్‌కు త‌మ వంతు సాయం చేస్తున్నారు. మ‌రి ఈ మేథావుల వ్యూహాలు ఎన్నిక‌ల్లో ఎంత వ‌ర‌కు ప‌నికొస్తాయో ? చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*