పీతల ఇలాకాలో.. పరిస్థితి ఇలా….!!!

ysrcp-tdp-in-chinthalapudi-assembly-constiuency

పశ్చిమగోదావరి జిల్లాలో ఓట్ల పరంగా అతి పెద్ద నియోజకవర్గమైన చింతలపూడి ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ మధ్య హోరా హోరీ పోరు నడిచింది. తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన ఈ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో మాజీ మంత్రి పీతల సుజాత 15,000 ఓట్ల పై చిలుకు మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుతం ఇక్కడ నుంచి వైసీపీ తరపున మాజీ కేంద్ర సర్వీసుల అధికారి వీ.ఆర్‌. ఎలీజా, టీడీపీ నుంచి 2009లో పోటీ చేసి ఓడిపోయిన డాక్టర్‌ కర్రా రాజారావు రేసులో ఉన్నారు. ఎలీజాకు వైసీపీ అధినేత జగన్‌ ఏడాది క్రితమే సమన్వయకర్త బాధ్యతలు అప్పగించగా ఆయన అప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం అవుతూ వచ్చారు. ఇక చంద్రబాబు నామినేషన్ల ప్రక్రియకు ముందే రాజారావు అభ్యర్థిత్వం ఖరారు చేశారు. అయితే గతంలో ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన అనుభవంతో పాటు పార్టీ కేడర్‌ సమిష్ఠిగా పని చేయడంతో రాజారావు సైతం ప్రచారంలో దూసుకువచ్చారు.

అంచనాకు మించి పని చేసి…

ఇక టీడీపీకి చింతలపూడి కంచుకోట అయినా ప్రస్తుత ఎన్నికల్లో నియోజకవర్గంలో మారిన రాజకీయ సమీకరణలు నేపథ్యంలో రెండు పార్టీలు హోరా హోరీగానే తలపడ్డాయి. ఏలూరు ఎంపీగా వైసీపీ నుంచి పోటీ చేస్తున్న కోటగిరి శ్రీధర్‌కు చింతలపూడి సొంత నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలోని కామవరపుకోట మండలం తూర్పు యడవల్లి ఆయన స్వగ్రామం కావడం, శ్రీధర్ కుటుంబీకులు, అనుచరులు ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో చింతలపూడిలో వైసీపీ శ్రేణులు అంచనాలకు మించి పని చేశాయి. ఇక టీడీపీ విషయానికి వస్తే ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న పీతల సుజాతకు సీటు రాకపోవడంతో ఇక్కడ పార్టీ నామినేషన్ల వేల కాస్త డిస్టబెన్స్‌లో పడింది. ఆ తర్వాత టీడీపీలో అన్ని వర్గాలు కలిసికట్టుగా పని చెయ్యడంతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్యింది. వాస్తవంగా చూస్తే చింతలపూడి టీడీపీకి కంచుకోటగా ఉన్నా ఐదు సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉండి ఈ నియోజకవర్గం నుంచి గెలిచినా సుజాతకు మంత్రి పదవి వచ్చినా పార్టీ ఆ స్థాయిలో బలపడలేదన్నది వాస్తవం.

రెండు పార్టీలూ ప్రచారంలో…..

ఇక ప్రచారంలో టీడీపీ అటు ఏలూరు ఎంపీ అభ్యర్థి మాగంటి బాబు, చింతలపూడి అసెంబ్లీ అభ్యర్థి కర్రా రాజారావు విసృతంగా ప్రచారం చెయ్యగా వైసీపీ తరపున నియోజకవర్గంలో ఇటు కోటగిరి శ్రీధర్‌ కుటుంబ సభ్యులు, అనుచరగణం, వైసీపీ కేడర్‌ విసృతంగా ప్రచారం చేసింది. అయితే నియోజకవ్గంలో పట్టున్న మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ టీడీపీలోకి రావడం ఆ పార్టీకి చాలా ప్లస్‌ అయ్యింది. ఘంటా మురళీ వర్గం నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ప్రభావం చూపే స్థాయిలోనే ఉంది. మురళీ కాలికి బలపం కట్టుకుని మరీ ప్రచారంలో తిరగడంతో పాటు తన వర్గాన్ని టీడీపీ వైపు మల్లించడంలో సక్సెస్‌ అయ్యారు. అటు మురళీతో వైసీపీలో ముందు నుంచి విబేధిస్తున్న కోటగిరి వర్గం మురళీ పార్టీ మారాక మరింత కసితో మురళీ సామాజికవర్గంతో పాటు, మిగిలిన వర్గాలను తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఏదేమైనా ప్రచారంలో ఇరు పార్టీల నాయకులు సత్తా చాటారు.

ఎవరు గెలిచినా….

నియోజకవర్గంలో పోలింగ్‌ సరళిని బట్టి చూస్తే జంగారెడ్డిగూడెం నగర పంచాయతీలో టీడీపీకి స్పష్టమైన ఆధిక్యం ఉంది. జంగారెడ్డిగూడెం మండలంలో టీడీపీ పోల్‌ మేనేజ్‌మెంట్‌లో ఫెయిల్‌ అవ్వడంతో రూరల్‌ మండలం వైసీపీకి ఆధిక్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి. టీడీపీకి ఆధిక్యం వచ్చే జంగారెడ్డిగూడెం మండలంలో ఆ పార్టీ నాయకుల తప్పిదాల వల్లే వైసీపీకి ఆధిక్యం వస్తుందని తెలుస్తోంది. నియోజకవర్గ కేంద్రమైన చింతలపూడి, లింగపాలెం మండలాల్లో వైసీపీకి ఆధిక్యం కనపడుతోంది. శ్రీధర్‌ సొంత మండలం అయిన కామవరపుకోటలో రెండు పార్టీల శ్రేణులు ఎన్నికల వేళ‌ ఎక్కడికక్కడ మోహరించి ఆధిక్యం కోసం విశ్వ ప్రయత్నాలు చేశాయి. కామవరపుకోట మండలంలో ఎవరికి మెజారిటీ వచ్చినా స్వల్పంగానే ఉండే ఛాన్సులు ఉన్నాయి. ఏదేమైనా చింతలపూడి నియోజకవర్గంపై ఇరు పార్టీలు ధీమాతో ఉన్నా పలు అంచనాలు ఉన్నా టీడీపీకే కాస్త ఫేవర్‌ అవుతుందనే టాక్ మీడియా, న్యూట్రల్ వ‌ర్గాల్లో ఉంది. ఫైన‌ల్‌గా ఎవరు గెలిచినా 3 నుంచి 6 వేల ఓట్ల మెజారిటీతోనే బయటపడే స్కోప్‌ ఎక్కువగా కనిపిస్తోంది. మరి తుది ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

Ravi Batchali
About Ravi Batchali 17100 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*