చిరు మాటను పెడ చెవిన పెట్టిన డైరెక్టర్..!

ప్రస్తుతం చిరంజీవి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చరిత్రాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి సినిమా చేస్తున్నాడు. ఇక ఆయన కొడుకు రామ్ చరణ్ రంగస్థలం వంటి అదరగొట్టే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాక బోయపాటి శ్రీను దర్శకత్వంలో మాస్ ఎంటెర్టైనెర్ లో నటిస్తున్నాడు. అయితే చిరుత దగ్గర నుండి చిరంజీవి… రామ్ చరణ్ కథల విషయంలో ఇన్వాల్వ్ అవుతూనే ఉన్నాడు. కాకపోతే సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ధ్రువ సినిమా విషయంలో, రంగస్థలం సినిమా విషయంలో చిరు తల దూర్చకపోయినా.. మధ్యమధ్యలో ఆ సినిమాల సెట్స్ కొచ్చి స్క్రిప్ట్ తెలుసుకుని వెళ్లేవాడట. అయితే బోయపాటి శ్రీను మాత్రం ముందుగా చరణ్ కి కథ చెప్పగా.. ఆ తర్వాత చిరుని కలిశాడట.

చెప్పినా పట్టించుకోకుండా…

బోయపాటి చెప్పిన క‌థంతా విని… బోయ‌పాటి పై న‌మ్మ‌కంతో చిరు నీకిష్టం వచ్చినట్టుగా సినిమాని తెరకెక్కించమని ఫ్రీ హ్యాండ్ ఇవ్వడడంతో ఒక సలహా కూడా ఇచ్చాడట. అదేమిటంటే.. సినిమాలో యాక్ష‌న్ పాళ్లు మ‌రీ మితిమీర‌కుండా చూసుకో.. అని ఒకే ఒక్క స‌ల‌హా ఇచ్చాడ‌ట‌. అయితే ఆ ఒక్క స‌ల‌హాని కూడా బోయ‌పాటి ఇప్పుడు ప‌క్క‌న పెట్టేసాడు. ఎందుకంటే ఇప్పటివరకు తాను తీసిన సినిమాల్లోని యాక్షన్ సీక్వెన్స్ కన్నా ఎక్కువగా చరణ్ సినిమాలో ఉండబోతున్నాయట. రంగ‌స్థలం సినిమా విషయంలో చిరు అసలు ఇవాల్వ్ కాకుండా పూర్తిగా చ‌ర‌ణ్ జ‌డ్జిమెంట్‌పై నడవడం… ఆ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ట‌యిపోయింది. అదే న‌మ్మ‌కంతో బోయ‌పాటి శ్రీ‌ను – చరణ్ సినిమా విష‌యంలోనూ చిరు ఏమాత్రం క‌ల‌గజేసుకోవ‌డం లేదు.

చిరంజీవికి తీరక లేకపోవడంతో…

ఇక ఎలాగూ సైరా సినిమా విషయంలో చిరు పూర్తి హ్యాండ్ ఉంటుంది కాబట్టి.. ఎక్కువగా చిరు కి సైరా గురించిన ఆలోచనలే తప్ప చరణ్ సినిమా గురించి ఆలోచించే తీరిక కూడా లేకపోవడంతో.. బోయపాటి తన పని సులువుగా చేసుకుపోతున్నాడట. ఇప్పటికే రష్యా బోర్డర్‌కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అజర్‌బైజాన్‌ దేశంలో చరణ్ – బోయపాటి సినిమా యాక్షన్ సినిమా సన్నివేశాలు ఓ రేంజ్ లో చిత్రీకరిస్తున్నారట. అయితే బీహార్ బ్యాక్‌డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా బీహార్ పరిసర ప్రాంతాల్లోనే తెరకెక్కించాలని ముందుగా అనుకున్నప్పటికీ.. ఇక్కడ సెట్స్ అవీ వేసి ఖర్చు పెంచడం ఎందుకులే అని… తోడేళ్లు, ఎలుగుబంట్లు, చిరుతలు ఎక్కువగా ఉన్న… అలాగే ఎత్తయిన పర్వతాల చల్లటి గాలులు ఎక్కువగా ఉన్న అజర్‌బైజాన్‌ లోనే ఈ సినిమా యాక్షన్ సన్నివేశాలను త్వరితగతిన చిత్రీకరిస్తున్నారట. ఇక అజర్‌బైజాన్‌ షెడ్యూల్ లో హీరో చరణ్, వివేక్ ఓబెరాయ్, కియరా అద్వానీ, బోయపాటిలతో కొంతమంది ఫైటర్లు కూడా పాల్గొంటున్నారని సమాచారం.