బాహుబలి ది కంక్లూషన్ ని ఆ రాష్ట్రంలో కొనేవాళ్లే లేరట

బాహుబలి అనే చిత్రం అంతర్జాతీయ స్థాయిలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ స్థాయిని చాటి చెప్పిన చిత్రంగా ఎందరో ప్రముఖ సెలబ్రిటీస్ అభిప్రాయం పడుతుండగా, రెబెల్ స్టార్ కృష్ణం రాజు ఏకంగా వంద అడుగులు ముందుకి వేసి ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన దర్శకుడు స్టీవెన్ స్పెల్బర్గ్ భారతీయ చిత్రాలపై చేసిన విమర్శలకు ధీటైన సమాధానం ఇచ్చిన చిత్రంగా బాహుబలిని ఆయన అభివర్ణించారు. ఎప్పుడో ఒక ఇంటర్వ్యూ లో భారతీయ చిత్రాల గురించి స్పందన తెలుపని స్టీవెన్ స్పెల్బర్గ్ ని అడగగా ఆయన ‘నో కామెంట్స్’ అంటూ దాట వేసే ప్రయత్నం చేసినప్పటికీ కుదరకపోవటంతో ఆయన “ఒకే కథతో వేలాది చిత్రాలు ఎలా చేస్తారో నాకు అర్ధం కాదు.” అంటూ చేసిన వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాలనుకుంటారని కృష్ణం రాజు బాహుబలి ది కంక్లూషన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై అన్నారు. అంతటి ప్రముఖ దర్శకుడినే అంతలా ప్రభావితం చేయగల చిత్రంగా ఆయన మాటలద్వారా ఆయన బాహుబలిని చిత్రీకరించగా, అటువంటి చిత్రాన్ని కొనటానికి పొరుగు రాష్ట్రమైన కర్ణాటక కి చెందిన బయ్యర్లు ఎవరూ ముందుకి రాకపోవటం గమనార్హం.

బాహుబలి ది బిగినింగ్ తెలుగు చిత్రం ఐయి ఉండి కర్ణాటక రాష్ట్రంలో 40 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు చేయగా ఈ రెండు సంవత్సరాలలో మారిన పరిస్థితుల కారణంగా బాహుబలి ది కంక్లూషన్ థియేట్రికల్ రైట్స్ పొందటానికి కర్ణాటక రాష్ట్ర బయ్యర్లు సిద్ధంగా లేరు. క్రేజీ చిత్రాలకు కర్ణాటక రాష్ట్రంలో అధిక ధరలకు టికెట్ విక్రయించి థియేట్రికల్ హక్కులకు వెచ్చించిన సొమ్ము రాబట్టుకునే వెసులుబాటు పై అక్కడి ప్రభుత్వం కొత్తగా ఆంక్షలు విధించటంతో పాటు, కావేరి జలాల విషయమై కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలకు నొచ్చుకున్న కన్నడిగులు వారి ఆగ్రహాన్ని బాహుబలి ది కంక్లూషన్ చిత్రంపై చూపబోతున్నట్టు సంకేతాలు వెలువడటం, లాంటి కారణాల చేత ఇప్పటికి కర్ణాటక థియేట్రికల్ హక్కులు అమ్ముడుకాలేదు.