బైయోపిక్కే కానీ కథ అంతా కల్పితమే

చిత్రం, నువ్వు నేను, జయం చిత్రాలతో అందుకున్న హ్యాట్రిక్ విజయాలతో అగ్ర దర్శకుల జాబితాలోకి ఎక్కేసిన తేజ అప్పటి నుంచి వరుస పరాజయాలు మూటగట్టుకుంటూ లైం లైట్ నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. తేజ తెరకెక్కించిన గత చిత్రం హోరా హోరి తాను తీసిన చిత్రాలకు పూర్తి భిన్నం అని, కచ్చితంగా ఆ చిత్రం తనకు పూర్వ వైభవం తీసుకు వస్తుందని నమ్మిన తేజ కి హోరా హోరి కూడా చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది. హోరా హోరి అనంతరం గ్యాప్ తీసుకుని ఒక బలమైన పొలిటికల్ డ్రామా కథ ని రాసుకున్నాడు తేజ. వరుస వైఫల్యాలు అనంతరం కూడా సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు తేజ కి తన కొడుకు రానా దగ్గుబాటి హీరో గా పెట్టి నిర్మిస్తూ దర్శకత్వ అవకాశం కలిపించాడంటే ఈ సారి తేజ కథ ని నమ్మొచ్చు ఏమో.

గత కొంత కాలంగా సైలెంట్ గా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే టైటిల్ ఖరారు చేశారు. రానా దగ్గుబాటి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను రానా పంచుకున్నాడు. “పొలిటికల్ డ్రామా గా తెరకెక్కుతున్న నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో నేనొక రాజకీయ నాయకుడి పాత్ర పోషిస్తున్నాను. లీడర్ చిత్ర నేపధ్యానికి ఇది పూర్తి విరుద్ధం. అనంతపురం ప్రాంతంలో చోటు చేసుకుంటున్న కొన్ని ఆసక్తికర రాజకీయ అంశాల చుట్టూ ఈ చిత్ర కథ ప్రయాణం చేస్తుంది. ఇది ఒక బైయోపిక్ లాంటిదే కానీ ఈ కథ పూర్తిగా కల్పితం. కానీ నేటి రాష్ట్ర పరిస్థితులకు అడ్డం పట్టే విధంగా ఈ చిత్రం ఉండబోతుంది.” అని నేనే రాజు నేనే మంత్రి సినిమా వివరాలు వెల్లడించాడు రానా దగ్గుబాటి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*