దానికి నేనూ సిద్దమే అంటుంది..!
ఈ మధ్యన పరభాషా హీరోయిన్లు తమ తెలుగు సినిమాలకు తామే డబ్బింగ్ చెప్పేసుకుంటున్నారు. ఫిదాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి తన సొంత గొంతుతో ఫిదాకి డబ్బింగ్ చెప్పేసింది. ఇక రాశి ఖన్నా, అనుపమ పరమేశ్వరన్, కీర్తి సురేష్, అను ఇమ్మాన్యువల్ వంటి వారు తమ సినిమాలకు తామే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. ఇది వరకు తెలుగులో ప్రాంప్టింగ్ డైలాగ్స్ చెప్పి నటించేసి.. డబ్బింగ్ విషయాన్ని తారలు లైట్ తీసుకునేవారు కానీ.. తాజాగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న భామలు మాత్రం తమ గొంతుని సవరిస్తూ చెలరేగిపోతున్నారు. ఇక తాజాగా స్టార్ హీరోయిన్ అవతారమెత్తిన పూజ హెగ్డే కూడా అరవింద సమేత కోసమే గొంతు సవరించింది. అలాగే గీత గోవిందంతో హిట్ అందుకున్న రష్మిక కూడా తన డబ్బింగ్ తానే చెప్పుకోవడానికి రెడీ అయ్యింది. ఇక ఎప్పుడూ చిన్మయితో డబ్బింగ్ చెప్పించుకునే సమంత యూ-టర్న్ కోసం తానే డబ్బింగ్ చెప్పుకుంది. అయితే ఎవరి డబ్బింగ్ కి రాని నెగెటివ్ టాక్ సమంత గొంతు విషయంలో వచ్చింది. సమంత డబ్బింగ్ అంతగా నప్పలేదని.. చిన్మయి హస్కి వాయిస్ ముందు సొంత బొంగురు గొంతు బాగోలేదని.. ఇక ఆమె డబ్బింగ్ చెప్పకుండా ఉంటే బావుంటుందని సెటైర్స్ వేస్తున్నారు.
మరో హిరోయిన్ కూడా...
ఇకపోతే ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్ ఒకరు తెలుగులో నటిస్తుంది. ఆమె కూడా తెలుగులో తన సినిమాకి డబ్బింగ్ చెప్పడానికి రెడీగా ఉన్నానంటుంది. ఆమె ఎవరో కాదు.. సాహో భామ శ్రద్ద కపూర్. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహో సినిమాలో ప్రభాస్ కి జోడిగా నటిస్తున్న శ్రద్ద కపూర్ తెలుగులో డబ్బింగ్ చెప్పడానికి తానూ సిద్దమంటుంది. భారీ బడ్జెట్ తో నాలుగు భాషల్లో తెరకెక్కుతున్న సాహు చిత్రంలో నటిస్తున్న శ్రద్ద కపూర్ సాహో షూటింగ్ స్పాట్ లో తనకి తెలుగులో డైలాగ్స్ చెప్పడానికి ప్రభాస్ ఎంతో హెల్ప్ చేసాడని... అందుకే ప్రాంప్టింగ్ లేకుండా డైలాగులను గుర్తుపెట్టుకుని మరీ చెప్పానని చెప్పింది.
దర్శకుడు ఒప్పుకుంటే...
ఇక సాహో సెట్స్ లో తాను తెలుగులో మాట్లాడుతుంటే... దర్శకుడు సుజిత్ తన వాయిస్ లోకల్ తెలుగు అమ్మాయిలా ఉందని చెప్పడంతో సంతోఫంగా ఫీల్ అయ్యానని... అయితే సాహో సినిమాకి తెలుగులో తాను డబ్బింగ్ చెప్పాలా.. వద్దా అనే విషయంలో సుజిత్ ఇంకా ఏ డెసిషన్ తీసుకోలేదని.... ఆయన ఓకే అంటే తాను తెలుగు డబ్బింగ్ చెప్పడానికి రెడీ అంటోంది. మరి హిందీలో ఎలాగూ శ్రద్దనే డబ్బింగ్ చెప్పుకుంటుంది. తెలుగులో శ్రద్ధ డబ్బింగ్ చెబుతుందా లేదా అనేది దర్శకుడు తీసుకునే నిర్ణయం పై ఆధారపడిందన్నమాట.