కమల్ ఇండియన్ 2 ఉండేది అప్పుడే!

కమల్ హాసన్ ప్రస్తుతం తన విశ్వరూపం 2 ప్రమోషన్స్ తో పాటు.. బిగ్ బాస్ సీజన్ 2 హోస్ట్ గా బిజీ బిజీ గా వున్నాడు.
విశ్వరూపం 2 సినిమా తర్వాత కమల్ హాసన్ చేసిన శభాష్ నాయుడు సినిమా కొన్ని కారణాల వలన షూటింగ్ దశలోనే ఆగిపోయింది. ఇక ఆ సినిమాని కమల్ హాసన్ పక్కన పెట్టేసినట్లే కనబడుతుంది. ఇక ఎప్పుడో మూడ్ వచ్చినప్పుడు అన్ని అనుకూలిస్తే విశ్వరూపం 2 సినిమాలాగా ఎప్పుడో బయటికి తీస్తాడు. అయితే కమల్ హాసన్ దర్శకుడు శంకర్ తో కలిసి బిగ్ బాస్ సీజన్ 1 అప్పుడు ఇండియన్ 2 సినిమా చేస్తున్నామని ప్రకటించాడు. ఆ సినిమాని టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తాడని అనౌన్స్మెంట్ కూడా జరిగింది. ఇది జరిగి ఏడాది పూర్తయ్యింది కూడా.

బిగ్ బాస్ అవగానే షూటింగ్

అయితే శంకర్ 2.ఓ సినిమా విడుదల విషయంలో పలు సమస్యలు ఎదుర్కొంటున్నాడు. మరో పక్క కమల్ రాజకీయాలతో బిజీ అవ్వగా ఈ ప్రాజెక్ట్ నుండి నిర్మాత దిల్ రాజు తప్పుకున్నాడు. అయితే తాజాగా కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమా గురించి అప్ డేట్ ఒకటి బయిటికి వచ్చింది. దర్శకుడు శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ చెయ్యబోయే ఇండియన్ 2 సినిమా కమల్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 పూర్తవగానే ఉంటుందని తెలిసింది. ఇక బిగ్ బాస్ సీజన్ 2 పూర్తయ్యేసరికి శంకర్ కూడా తన 2.ఓ సినిమా విడుదలకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసి కమల్ కోసం సిద్దమవుతాడట. ఎలాగూ 2.ఓ నవంబర్ 29 న ఉంటుందని శంకర్ అధికారికంగా ప్రకటించాడు కూడా.

భారతీయుడుకి సీక్వెల్ గా…

మరి గతంలో శంకర్, కమల్ హాసన్ కాంబోలో వచ్చిన భారతీయుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాదు.. ఇప్పటికీ ఆ సినిమా పై అందరిలో అంతే ఆసక్తి ఉంది. అందుకే మళ్లీ వారి కాంబోలో రాబోయే ఇండియన్ మీద భారీ అంచనాలే ఉన్నాయి. కాబట్టే ఆ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకెళుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*