బోయ‌పాటి గురించి 32 సార్లు ఏడ్చింద‌ట‌!

Kiara advani career

టాలీవుడ్‌లో మెరుస్తున్న హిందీ భామ‌లు ఎంతో మంది. ఇంకా ఈ మ‌ధ్య త‌క్కువైంది కానీ.. ఒక‌ప్పుడు ముంబై, డిల్లీ నుంచి వ‌చ్చి పాతుకుపోయేవాళ్లే ఎక్కువ‌. భాష తెలియ‌క‌పోయినా కోట్ల‌కు కోట్లు పారితోషికం ఇచ్చి వాళ్ల‌కి అవ‌కాశాలు క‌ట్టబెట్టేవాళ్లు. ఇప్పుడు మాత్రం కన్న‌డ, మ‌ల‌యాళ భామ‌ల జోరు కాస్త ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అలాగ‌ని ఉత్త‌రాది నుంచి భామ‌ల సంద‌డేమీ త‌గ్గ‌లేదు. అడ‌పాద‌డ‌పా వ‌స్తూ జెండా ఎగ‌రేస్తున్నారు. అలా ఈ యేడాది తెలుగులో మంచి పేరు తెచ్చ‌కున్న బాలీవుడ్ భామ‌ల్లో కియారా అద్వానీ ఒక‌రు. ఈ ముద్దుగుమ్మ మ‌హేష్‌బాబు స‌ర‌స‌న `భ‌ర‌త్ అనే నేను`లో న‌టించి విజ‌యాన్ని అందుకొంది. ఆ వెంట‌నే బోయపాటి శ్రీను సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశాన్ని చేజిక్కించుకుంది. అయితే ఉత్త‌రాది నుంచి వ‌చ్చే భామ‌ల్లో చాలామంది తెలుగులో ఎదుర‌య్యే అనుభ‌వాల్ని అక్క‌డకి వెళ్లి క‌థ‌లు క‌థ‌లుగా చెబుతుంటారు. రాధికా ఆప్టే, తాప్సి త‌దిత‌రులు అలా కొన్ని టాలీవుడ్ విష‌యాలు బాలీవుడ్ మీడియాకి చెప్పి వార్త‌ల్లో నిలిచారు. వివాదాల్ని రేకెత్తించినంత ప‌ని చేశారు.

ఒక్క సీను కోసం 32 టేక్ లు….

తాజాగా కియారా అద్వానీ కూడా టాలీవుడ్ ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను గురించి చెప్పింది. అయితే అదేమీ వివాదాస్పదం కాలేదు. బోయ‌పాటి ఎంత ప‌ర్‌ఫెక్ష‌నిస్టో, తాను ఒక స‌న్నివేశం కోసం ఎంత క‌ష్ట‌ప‌డ్డానో చెప్పుకొచ్చింది కియారా. రామ్‌చ‌ర‌ణ్ – బోయ‌పాటి క‌ల‌యిక‌లో రూపొందుతున్న సినిమాలో కియారా ఓ ఎమోష‌న‌ల్ సీన్ చేయాల్సి వ‌చ్చింద‌ట‌. అందులో బాగా ఏడ్చాల్సి ఉంటుంద‌ట‌. అయితే ఆ ఏడుపు ప‌క్కాగా ఉండాల‌ని రీటేకులు చేయించాడ‌ట‌. అలా మొత్తం 31 సార్లు ఏడ్చినా అనుకొన్న స‌న్నివేశం అనుకున్న‌ట్టుగా రాలేద‌ట‌. 32వ సారి షాట్ ఓకే అయ్యింద‌ని, అన్నిసార్లు తాను ఏడ్చాన‌ని న‌వ్వుతూ చెప్పుకొచ్చింది కియారా. మొత్తంగా బోయ‌పాటి ఈ సుకుమారిని కాస్త ఇబ్బంది పెట్టిన‌ట్టే ఉన్నాడు. అయినా ఇలా క‌ష్ట‌ప‌డితేనే క‌దా, మంచి నటి అని పేరొచ్చేదీ!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*