బాలయ్య ని ఆకాశానికెత్తుస్తున్నాడు.. మ్యాటరేంటి?

క్రాంతి

బాలకృష్ణ ఈ రోజు అంటే జూన్ 10 తన పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. తన తండ్రి బయోపిక్ ని వెండితెర మీద ఆవిష్కరించడానికి బాలకృష్ణ గత ఏడాది నుండి తీవ్రంగా కృషి చేస్తున్నాడు. ఎట్టకేలకు మార్చ్ నెలాఖరున ఎన్టీఆర్ బయో పిక్ సెట్స్ మీదకెళ్లింది. అయితే మధ్యలో మళ్ళీ కొన్ని డిస్ట్రబెన్సెస్ వచ్చి సినిమా రెగ్యులర్ షూటింగ్ వాయిదా పడింది. మళ్ళీ ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ బయో పిక్ క్రిష్ దర్శకత్వాన సెట్స్ మీదకెళ్లబోతుంది. బాలకృష్ణ తో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాని తెరకెక్కించిన క్రిష్ ఇప్పుడు బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ పనులను చకచకా పూర్తి చెయ్యడానికి సన్నద్దుడవుతున్నాడు.

తనని నమ్మి తన మీద ఇంత పెద్ద బాధ్యత పెట్టిన బాలయ్యని క్రిష్ తెగ పొగిడేస్తున్నాడు. గతంలోనే అంటే ఎన్టీఆర్ బయోపిక్ ని బాలయ్య క్రిష్ చేతుల్లో పెట్టినప్పుడే… నన్ను నమ్మి ఇంత బాధ్యత నాకప్పగించిన బాలకృష్ణ గారికి నా కృతజ్ఞతలు. ఇది కేవలం ఒక సినిమా బాధ్యత కాదు. ప్రపంచంలోని తెలుగువాళ్లందరి అభిమానానికి, ఆత్మాభిమానానికి అద్దంపట్టే బాధ్యత. మనసా వాచా కర్మణా నిర్వర్తిస్తానని మాటిస్తున్నాను… అంటూ పొగిడిన క్రిష్ తాజాగా బాలకృష్ణ పుట్టినరోజునాడు ఎన్టీఆర్ బయోపిక్ పోస్టర్ తో పాటుగా బాలయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ…. తన నూరవ చిత్రంలో అమ్మ పేరుని ధరించి కూస్తంత మాతృఋణం తీర్చుకున్న “బసవ రామ తారక పుత్రుడు”,ఇప్పుడు నాన్న పాత్రనే పోషిస్తూ కాస్తంత పితృఋణాన్ని కూడా తీర్చుకుంటున్న “తారక రామ పుత్రుడు”, శతాధిక చిత్ర “నటసింహం”, నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు… అంటూ పొగిడేస్తున్నాడు.

మరి బాలయ్యని క్రిష్ ఒక రేంజ్ లో పొగిడేస్తున్నాడు. అయితే క్రిష్, బాలయ్యకి కృతఙ్ఞతలు చెప్పడంలో అతిశయోక్తి లేదుగాని.. ఎక్కువగా బాలయ్యని పొగడడం మాత్రం కాస్త అతి అనిపిస్తుందనే టాక్ వినబడుతుంది. అందుకే బాలయ్యని అంతగా పొగడడంలో క్రిష్ ఆంతర్యమేమిటో అంటూ సెటైర్స్ కూడా వేస్తున్నారు. ఇకపోతే బాలయ్య హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ నటీనటులను క్రిష్ ఎంపిక చేస్తున్నాడు. ఇప్పటికే బసవతారకం పాత్రకి విద్యాబాలన్ ని క్రిష్ ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఎన్టీఆర్ బయోపిక్ జులై నెలాఖరు నుండి సెట్స్ మీదకెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*