మహానటి.. మహేశ్ ను దాటేస్తుందా..?

మహానటి సినిమా విడుదలై దాదాపుగా 20 రోజులు కావొస్తుంది. ఇప్పటికీ మహానటి వసూళ్లకు బ్రేక్ పడడం లేదు. చిన్న బడ్జెట్ గా తెరకెక్కిన మహానటి మూవీ భారీ కలెక్షన్స్ కొల్లగొడుతూ నిర్మాతలుకు బోలెడన్ని లాభాలు తెచ్చిపెడుతుంది. ఇప్పటికి మహానటి క్రేజ్ ని ఎక్కడా తగ్గకుండా మహానటి బృందం కూడా ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పటికే అమరావతి, వైజాగ్ వంటి నగరాల్లో మహానటి బృందం హల్చల్ చేస్తూ ప్రేక్షకుల్లో మహానటిపై ఉన్న క్యూరియాసిటీని మరింత పెంచుతుంది.

ఓవర్సీస్ లో విశేష ఆదరణ…

కేవలం తెలుగు రాష్ట్రాలు, తమిళంలోనే కాదు మహానటి జోరు ఓవర్సీస్ లోను కొనసాగుతుంది. ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్లను సాధించిన టాప్ 10 చిత్రాల జాబితాలో మహానటి 6వ స్థానాన్ని సొంతం చేసుకుంది. సావిత్రి నట జీవితం కన్నా.. ఎక్కువగా ఆమె పర్సనల్ లైఫ్ లో జరిగిన ఒడిడుకుల మీద ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఉండడం.. సావిత్రి మీదున్న సానుభూతితోనే.. మహానటికి ప్రేక్షకులంతా బ్రహ్మరథం పట్టారు. ఆ క్యూరియాసిటీ ఫలితమే మహానటి కలెక్షన్స్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తెలుగు ప్రేక్షకులతో పాటు మహానటి మూవీ ఓవర్సీస్ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టేసింది.

శ్రీమంతుడు చిన్నబోయేనా…

అక్కడ ఓవర్సీస్ ప్రేక్షకుల ఆదరణతో మహానటి మూవీ బడా స్టార్స్ సినిమాలు అంటే… అజ్ఞాతవాసి, ఫిదా, ఖైదీ నెంబర్ 150, అ ఆ సినిమాల రికార్డులను అధిగమిస్తూ ముందుకు వెళ్లి 6వ స్థానంలో కూర్చుంది. మరి టాప్ 6 లో ఉన్న మహానటి మెల్లగా మహేష్ బాబు శ్రీమంతుడికి కూడా ఎసరు పెట్టొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మహానటి కన్నా ముందు అంటే టాప్ 5 లో శ్రీమంతుడు ఉంది. ఒకవేళ మహానటి గనక శ్రీమంతుడు వసూళ్లని క్రాస్ చేసింది అంటే… మహానటి ప్రభంజనం ఏ లెవల్లో ఓవర్సీస్ లో నడిచిందో అనేది చరిత్రలో చెప్పుకునే స్థాయిలో నిలిచిపోతుంది.