రకుల్ కి జయలలిత పాత్ర ఇచ్చారా..?

ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ మెల్లిగా ఫామ్ లోకొస్తుంది. గత ఏడాది నుండి బాగా అవకాశాలు తగ్గిన రకుల్ ప్రీత్ సింగ్ కి ఇప్పుడు మెల్లిగా అవకాశాలు వస్తున్నాయి. స్పైడర్ సినిమా దెబ్బకి కోలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ కి అవకాశాలు రావేమో అనుకున్నారు. కానీ సూర్య హీరోగా సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఎన్జీకే సినిమా రకుల్ కి సెకండ్ హీరోయిన్ పాత్ర దొరికింది. అయితే మొదటి హీరోయిన్ గా సాయి పల్లవి కి ఛాన్స్ రాగా పెద్దగా క్రేజ్ లేని రకుల్ ప్రీత్ కి సెకండ్ హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. ఇకపోతే ఎన్జీకే లో సాయి పల్లవి సూర్య భార్య‌ పాత్రలో నటిస్తుంది.

ఎంజీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా…

ప్రస్తుతం బయోపిక్స్ సీజన్స్ నడుస్తున్న ఈ టైం లో టాలీవుడ్, కోలీవుడ్స్ లో బయోపిక్స్ పిచ్చి పీక్స్ కి చేరింది. మహానటి సినిమా హిట్ తో అది మరింత ముదిరింది. టాలీవుడ్ లో ఎన్టీఆర్ బయో పిక్, వైఎస్సార్ బయోపిక్ యాత్ర సినిమాలు పోటాపోటీగా తెరకెక్కుతుండగా.. తమిళనాట ఎంజీఆర్, జయలలిత బయోపిక్స్ కూడా అతి త్వరలోనే పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. అయితే సూర్య – సెల్వ రాఘవన్ కాంబోలో వస్తున్న ఎన్జీకే సినిమా నటుడు, పొలిటీషియన్ అయినా ఎంజీఆర్ జీవితచరిత్రను ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్నారనే టాక్ కోలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

ఎంత దాచిపెట్టాల‌ని చూసినా…

అయితే ఈ సినిమాలో సూర్య భార్య రోల్ లో సాయి పల్లవి నటిస్తుండగా… మరో ముఖ్యమైన అంటే తమిళనాడులో ఎంజీఆర్ జీవితంలో ఎంతో కీలకమైన మాజీ సీఎం జయలలిత పాత్రని రకుల్ ప్రీత్ సింగ్ పోషిస్తున్నట్టుగా చెబుతున్నారు. అయితే ఇంతవరకు రకుల్ ప్రీత్ సింగ్ జయలలిత పాత్ర పోషిస్తున్నట్టుగా బయటికి పొక్కకుండా చిత్ర బృందం చాలా జాగ్రత్తలు తీసుకుందట. ఎందుకంటే జయలలిత పాత్ర ఒక సినిమాలో కనబడుతుంది అంటే.. ఎక్కడ లేని సమస్యలు వస్తాయని భావించి రకుల్ జయలలిత పాత్రని బయటకి రానివ్వకుండా జాగ్రత్త పడితే ఇప్పుడేమో అదే సెన్సేషన్ అయ్యి కూర్చుంది. అయితే రకుల్ నిజంగానే ఎన్జీకేలో జయలలితగా కనబడనుందా..? అంటే ఇంకా స్పష్టమైన సమాచారం అయితే లేదు.