రామ్ గోపాల్ వర్మ.. ఒక సిల్లీ కంప్లైంట్

మామూలుగా రామ్ గోపాల్ వర్మ వేరే వాళ్లను గిల్లుతూ ఉంటాడు. ఏదో ఒక మాట అంటుంటాడు. కానీ జై కుమార్ అనే కుర్రాడు కొన్ని రోజులుగా వర్మను గిచ్చుతూ ఉన్నాడు. ఆయన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. వర్మ తనతో చాలా సినిమాలకు పని చేయించుకుని డబ్బులివ్వలేదని, క్రెడిట్ కూడా ఇవ్వలేదని వాపోయాడతను. ‘జీఎస్టీ’తో పాటు ‘ఆఫీసర్’ కథ కూడా తనదే అని అతను ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇందుకు కొన్ని ఆధారాలు కూడా చూపే ప్రయత్నం చేసిన జై.. వర్మకు లీగల్ నోటీస్ పంపించి కేసు కూడా పెట్టాడు. దీనిపై వర్మను అడిగితే స్థాయి తక్కువ వ్యక్తుల గురించి తాను మాట్లాడనన్నాడు. అలా అన్న వర్మ.. జై మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన చేసిన కంప్లైంట్ ఏంటో చూస్తే షాకవ్వాల్సిందే.

ఫోటో మార్ఫింగ్ చేశాడని…

జై తన ఫొటోను మార్ఫింగ్ చేసి నగ్నంగా ఉన్న ఒక మహిళ శరీరానికి తగిలించాడని, దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసే ప్రయత్నం చేశాడని, ఈ రకంగా తన ఇమేజ్ దెబ్బ తీసే ప్రయత్నం చేసిన జై మీద చర్యలు తీసుకోవాలని వర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జై ఆరోపణలపై స్పందించడానికి అతడి స్థాయి సరిపోదన్న వర్మ.. ఇలాంటి సిల్లీ కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లడమేంటో జనాలకు అర్థం కావడం లేదు.

చిన్న ఫిర్యాదుతో పెద్ద రచ్చ…

సోషల్ మీడియాలో ఇలాంటివి కోకొల్లలుగా ఉంటాయి. వాదనల్లో మేటి అయిన వర్మ.. జై చేసిన ఆరోపణలపై నేరుగా స్పందించకుండా, అతను సంధించిన ప్రశ్నలకు బదులివ్వకుండా ఇప్పుడిలాంటి కంప్లైంట్ చేయడం ద్వారా తన స్థాయిని చాలా తగ్గించేసుకున్నాడనే చెప్పాలి. వర్మ లాంటి డేరింగ్ పర్సనాలిటీ నుంచి ఆయన అభిమానులు ఇలాంటివి ఆశించరు గాక ఆశించరు. ఓ స్థాయిలో ఉన్నవాళ్లు ఏదైనా పని చేయాలంటే అందులో ఓ ఫైర్ కనిపించాలని కోరుకుంటారు. ఓ సెలబ్రిటీ పోలీస్ స్టేషన్ లో కంప్లెయింట్ ఇచ్చినపుడు.. కచ్చితంగా ఏదో పెద్ద విషయం అని అంతా అనుకుంటారు. అదే వర్మ లాంటి వ్యక్తి పోలీస్ స్టేషన్ మెట్లు తొక్కినపుడు.. వెనక చాలా కథ ఉందని భావించడంలో తప్పులేదు.

దీనికే ఇంత చేయాలా..?

దీనికి ఆన్ లైన్ జనాల రియాక్షన్ వేరేగా ఉంది. నెట్ లో పెట్టిన ఒక్క ఫోటోకే పోలీస్ కంప్లెయింట్ ఇస్తే మెగా క్యాంప్ పై వర్మ చేసే ఆరోపణలు, వారిని తిట్టించడాలు వంటి వాటిపై ఎన్ని కేసులు పెట్టి, ఎన్ని కంప్లెయింట్స్ ఇవ్వాలో కదా? అంటూ వర్మను నిలదీస్తున్నారు నెటిజన్స్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*