ముద్దు చేదు కాదట…..!

తెలుగు సినిమా కొత్త‌ రూపం దాల్చుతోంది.. సినిమాలో ఆ హ‌ద్దు చెరిగిపోతోంది. ఆ పొర తెర‌ క‌నుమరుగ‌వుతోంది.. క్ర‌మంగా ముద్దుల ప‌ద్దు పెరుగుతోంది. ఈ మ‌ధ్య వ‌స్తున్న చిత్రాల్లో ఆ సీన్ల‌కు క‌త్తెర్లు ప‌డ‌డం లేదు.. ఇక ఇప్పుడా స‌న్నివేశాలు కామనైపోతున్నాయి. ఇన్నాళ్లూ హాలీవుడ్‌, బాలీవుడ్‌కే ప‌రిమిత‌మైన ముద్దుల సీన్లు ఇప్పుడు టాలీవుడ్‌లోనూ త‌ళుక్కుమంటున్నాయి. ము..ము.. ముద్దంటే చేదా.. నీకా ఉద్దేశం లేదా.. ము ము ముద్దంటే మోజె.. ఇప్పుడా ఉద్దేశం లేదే.. అంటూ అశ్లీత‌కు దూరంగా ముద్దుముద్దుగా ఆనాడు చిత్రీక‌రించిన పాట‌ను తెలుగు ప్రేక్ష‌కులు ఎంతలా ఆద‌రిస్తారో అంద‌రికీ తెలిసిందే.

ఇక కుటుంబసమేతంగా చూడలేరా..?

ఆ నాటి పాట‌ల్లో భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య‌గానీ, ప్రేమికుల మ‌ధ్య‌గానీ.. హీరోహీరోయిన్ల మ‌ధ్య‌గానీ ముద్దు స‌న్నివేశాలు రాగానే.. సీట్ క‌ట్ అయి.. ద‌గ్గ‌ర‌వుతున్న‌ రెండు పువ్వులను చూపించి అక్క‌డితో స‌రిపెట్టేవారు. అందుకే నాడు చిత్రాల‌న్నీ క‌టుంబ స‌భ్యులంద‌రు క‌లిసి చూసేవే. ఎక్క‌డ కూడా అశ్లీత‌ల‌కు చోటు ఇవ్వ‌కుండా.. అద్భుత‌మైన సాహిత్య విలువ‌లు క‌లిగిన పాటలు, మాటల‌తో సినిమాలు ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందాయి. నిజానికి ఆనాటి నుంచి నిన్న‌మొన్న‌టి దాకా కుటుంబ క‌థా చిత్రాల హ‌వా కొన‌సాగింది. కానీ రెండు మూడేళ్లుగా తెలుగు సినిమా రంగంలో మార్పు మొద‌లైంది. క్ర‌మంగా అశ్లీల‌త‌కు, పెడ‌ర్థాలు వ‌చ్చేలా డైలాగుల మోతాడు పెరుగుతోంది.

యూత్ ను ఆకట్టుకునేందుకే..

దీంతో కుటుంబ‌మంతా క‌లిసి సినిమా చేసే అవ‌కాశం లేకుండా పోయింద‌నే విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి. ఇప్ప‌టికీ ప‌లు కుటుంబ క‌థా చిత్రాలు వ‌స్తున్నా.. ఎక్కువ‌గా యూత్‌ను ఆక‌ట్టుకునే చిత్రాలే వ‌స్తున్నాయి. యూత్‌ను టార్గెట్ చేస్తూ నిర్మిస్తున్నారు. హీరోహీరోయిన్ల మ‌ధ్య వ‌చ్చే ప్రేమ‌ స‌న్నివేశాల్లో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ముద్దు స‌న్నివేశాల‌ను డైరెక్టుగా చూపించేస్తున్నారు. చిత్రం సినిమాలోని ఓ పాట‌లో హీరోహీరోయిన్ల మ‌ధ్య కాస్త హాట్ స‌న్నివేశాలు క‌నిపిస్తేనే యూత్ పిచ్చెక్కిపోయింది. ఇక‌ ఇటీవ‌ల వ‌చ్చిన అర్జున్‌రెడ్డి సినిమాలో కాస్తంత డైరెక్టుగా ముద్దు సీన్లు చూపించారు. ఈ సినిమా పెద్ద హిట్ కొట్టింది. యూత్‌ను ఊపేసింది.

ఆర్ఎక్స్ 100, 24 కిస్సెస్ లలో…

ఇక ఇటీవ‌ల వ‌చ్చి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన ఆర్ ఎక్స్ 100 సినిమాలోనూ ఈ సీన్ల‌ను బాగా పండించారు ద‌ర్శ‌కుడు. ఇప్పుడు మ‌రికొద్ది రోజుల్లో విడుద‌ల కానున్న 24 కిస్సెస్ సినిమా టీజ‌ర్‌లోనే చూపించాల్సిందంతా చూపించేశారు. ఆ ఉన్న కొద్దిపాటి హ‌ద్దును కూడా చెరిపేశారు. హీరో, 21ఎఫ్ సినిమా ఫేమ్ హెబ్బా ప‌టేల్ మ‌ధ్య ముద్దు సీన్లు హ‌ద్దులు మీరాయి. బాలీవుడ్ రేంజ్‌లో ముద్దు సీన్లు చూపించారు. టీజ‌ర్‌లోనే ఇట్లా ఉంటే ఇక సినిమాలో ఎలా ఉంటుందో అనే ఊపు యూత్ లో క‌లిగేలా చూపించారు. చివ‌ర‌గా ఒక డౌటేమిటంటే.. తెలుగు ప్రేక్ష‌కులు ఎదిగిపోతున్నారా..? లేక తెలుగు సినిమా దిగ‌జారిపోతుందా.. అని. ఇక ముందుముందు ఎలాంటి సినిమాలు వ‌స్తాయో చూడాలి మ‌రి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*