ఎటాక్ మూవీ రివ్యూ

సినిమా: ఎటాక్
రేటింగ్ : 1.5/5
తారాగణం : మంచు మనోజ్, జగపతిబాబు, ప్రకాష్ రాజ్, వడ్డే నవీన్, సురభి
దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ
నిర్మాత : సి.కళ్యాణ్
గత కొంతకాలంగా ప్రచారార్భాటాలే తప్ప కంటెంట్ జోలికి వెళ్లని రాంగోపాల్ వర్మ తనదైన స్టయిల్‌లో సినిమాలు తీసి మెప్పించలేకపోతున్నాడు. అయితే రీసెంట్‌గా కిల్లర్ వీరప్పన్ మూవీతో ఫర్వాలేదనిపించుకున్న వర్మ తన చివరి చిత్రంగా వంగవీటి ప్రకటించాడు. ఇక తెలుగు సినిమాలు చెయ్యనని చెప్పేశాడు. ఈ నేపథ్యంలో వర్మ బ్రాండ్‌తో…స్టార్ ఇమేజ్‌తో క్రైంథ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన చిత్రం ఎటాక్. మరి వర్మ తనకు అలవాటైన జానర్‌లో తీసిన ఎటాక్ మూవీ ప్రేక్షకులను ఏ రకంగా మెప్పించిందో చూద్దామా…
కథ
చార్మినార్ గ్రూప్స్‌కు అధినేత గురురాజ్ (ప్రకాష్‌రాజ్). అయితే ఒకప్పుడు ఈ గురురాజ్ హైదరాబాద్‌లో పేరుమోసిన బడా రౌడీ. అయితే తన కుటుంబం శ్రేయస్సు దృష్ట్యా అవన్నీ వదిలేసి రౌడీయిజానికి దూరంగా ప్రశాంతంగా బతుకుతుంటాడు. అప్పటికీ ప్రత్యర్థులు గురురాజ్‌ను చంపడం కోసం పథకాలు వేస్తునే ఉంటారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ వస్తుంటాడు గురురాజ్. అయితే ఒకసారి ప్రత్యర్థులు గురురాజ్‌పై కోలుకోలేని ఎటాక్ చేస్తారు. గుడికి వెళుతున్నాడని తెలిసి గురురాజ్‌ను చంపడానికి పథకం వేస్తారు. ప్రత్యర్థుల దాడిలో గురురాజ్ చనిపోతాడు. అయితే గురురాజ్ హత్య వెనక నరసింహులు ఉన్నాడని కుటుంబ సభ్యులతో సహా అందరూ ఊహిస్తారు. గురురాజ్ పెద్ద కొడుకు కాళీ (జగపతిబాబు) ఆగ్రహంతో నరసింహులును చంపడానికి తీవ్రంగా వెదుకుతుంటాడు.
అయితే జగపతిబాబు రెండో తమ్ముడు గోపి గోపి (వడ్డే నవీన్) సౌమ్యుడు. మొదటినుంచి గొడవలకు దూరంగా ఉంటూ వస్తుంటాడు. అన్నయ్య జగపతిబాబును గొడవలొద్దు…వాటికి దూరంగా ఉందామని అంటూంటాడు. అయితే జగపతిబాబు చిన్న తమ్ముడు రాధ (మంచు మనోజ్) మాత్రం పెద్ద అన్నయ్యకే సపోర్ట్‌గా నిలబడతాడు. అయితే తన తండ్రిని చంపిన ప్రత్యర్థులపు ఎదురుదెబ్బ తీయాలని భావించిన కాశీపై అతని ప్రత్యర్థులు అనుకోని దాడి జరిపి నడిరోడ్డుపై నరికి చంపేస్తారు. ఇక మంచు మనోజ్ రంగంలోకి దిగుతాడు. తన అన్నను చంపిన ప్రత్యర్థులను మట్టుబెడతానని శపథం చేస్తాడు. అయితే అతని ప్రేయసి వల్లి (సురభి) వద్దని వారిస్తుంది. తను లేకుండా జీవించలేనని…అతనికి ప్రాణగండం ఉందని…ఈ గొడవలకు దూరంగా ఉందామని వేడుకుంటుంది. అయినా మంచు మనోజ్ తన తండ్రిని, అన్నను పొట్టన బెట్టుకున్న ప్రత్యర్థులను కౌంటర్ ఎటాక్ చేసి చంపాలనుకుంటాడు. ఈ ప్రయత్నంలో ఫైనల్‌గా విజయం ఎవరిది. తన అన్నను చంపిన ప్రత్యర్థులను ఎలా కనిపెట్టాడు? వారిపై ఏ రకంగా పగ తీర్చుకున్నాడు అన్నది చూడాలంటే వెండితెరపై చూడాల్సిందే….
విశ్లేషణ
నటీనటుల విషయంలో అందరూ సీనియర్స్ కావడంతో తమ తమ పరిధుల మేరకు నటించారు. మంచు మనోజ్ అతి తగ్గించుకుని సీరియస్ పాత్రలో నటించాడు. పూర్తి మాస్ క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. ప్రకాష్‌రాజ్, జగపతిబాబు రోల్స్ అతిథి పాత్రలు కావడంతో ఉన్నంతలో ఆహార్యం పండించారు. చాలా కాలం తర్వాత వడ్డే నవీన్ మళ్లీ తెరపై కనిపించాడు. అతనిది సాఫ్ట్ క్యారెక్టర్. ఎక్కడా నటించడానికి స్కోప్‌లేని పాత్ర. లేడీ విలన్ క్యారెక్టర్‌లో పూనమ్ కౌర్ ఆకట్టుకుంది. ఫస్ట్ టైమ్ రౌద్రరసంతో కూడిన విలనిజం క్యారెక్టర్ చేసింది పూనమ్. ఇక హీరోయిన్ సురభి పాత్ర నటించడానికి ఏమీ లేదు. ఎక్స్‌ప్రెషన్స్ శూన్యం.
సాంకేతిక వర్గం
తనకు అలవాటైన జానర్‌లోనే మూవీని తీసినా…వర్మ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో మరోసారి విఫలం అయ్యాడు. ఇలాంటి కథలు వర్మే గత చిత్రాలలో చూపించేశాడు. కొత్తగా చూపించడానికి ఏమీ లేదు. పగలు…ప్రతీకారాలు అనే అంశం పాత బూజుపట్టిన పాత చింతకాయ పచ్చడే…అయినా ఒక్కోసారి కథాంశం కొత్తగా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు. అయితే కథ…కథాంశం…తీసిన విధానం అన్నీ రొటీన్ కావడంతో కేవలం ఆ చిన్న పాయింట్ పట్టుకుని రెండున్నర గంటల పాటు ప్రేక్షకులపై ఎటాక్ చేసినట్లుగా ఉంది. ఇక వర్మ సినిమాలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ఎడిటింగ్. ఎటాక్ సినిమాలో ఎడిటింగ్ కూడా వర్మ సినిమాలలో ఉన్నట్టుగా లేదు. సాగదీసినట్లుగా ఉంది. పైగా చనిపోయిన ప్రకాష్‌రాజ్‌తో మాట్లాడించడం కూడా ప్రేక్షకులకు ఇబ్బందిగా మారింది. కెమెరా పనితనం కూడా పెద్దగా ఏమీ లేదు. కేవలం అగ్ర నటీనటులు నటించారనే విషయం తప్ప మిగిలిన అంశాలన్నీ అథః పాతాళానికి తొక్కేసినట్టుగా ఉంది. అన్వర్ ఆలీ ఎడిటింగ్, రవిశంకర్ సంగీతం, అంజి ఫొటోగ్రఫీ ఏ అంశాలలోనూ మెప్పించలేకపోయారు. ఒక సాదాసీదా చిత్రాన్ని మళ్లీ మళ్లీ చూస్తున్నట్లుగానే ఉంది. డైలాగులు కూడా పెద్దగా ఆకట్టుకోవు.
ఇదొక పరమ రొటీన్ క్రైం థ్రిల్లర్. వర్మ టేకింగ్స్ అభిమానించేవారికి సైతం రివర్స్ ఎటాక్ తప్పదు. ఈ సమ్మర్‌లో ఎండగా ఉందని…చల్లగా పడుకోవచ్చని ఈ సినిమాకు వచ్చినా లోపల కొట్టే వడదెబ్బకు ఎక్కడున్నా ఒకటే అనిపించక మానదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*