2.ఓ మూవీ రివ్యూ

2.o final Review

బ్యానర్: లైకా ప్రొడక్షన్స్
నటీనటులు: సూపర్ స్టార్ రజినీకాంత్, అమీ జాక్సన్, అక్షయ్ కుమార్, సుధాన్షు పాండే, రియాజ్ ఖాన్, కళాభవన్ షాజాన్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: ఏ ఆర్ రెహ్మాన్
సినిమాటోగ్రఫీ: నిరవ్ షా
ఎడిటింగ్: ఆంథోనీ
కథ: ఎస్. శంకర్, బి. జెయమోహన్
ప్రొడ్యూసర్స్: ఏ. సుభాస్కరం, రాజు మహాలింగం
దర్శకత్వం: ఎస్. శంకర్

గత ఎనిమిది నెలలుగా ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. ఈ ఏడాది జనవరిలో విడుదల కావాల్సిన శంకర్ – సూపర్ స్టార్ రజినీకాంత్ ల 2.ఓ చిత్రం ఎట్టకేలకు నేడు నవంబర్ 29 గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రోబో చిత్రంతో మ్యాజిక్ చేసిన శంకర్ – రజినీకాంత్ లు మళ్ళీ 2.ఓ తో సునామి సృష్టించడానికి రెడీ అయ్యారు. 2.ఓ సినిమా మొదలైనప్పుడు రజినీకాంత్ కొన్నాళ్లు అనారోగ్యంతో అమెరికా వెళ్లడంతో 2.ఓ షూటింగ్ వాయిదా పడింది. తర్వాత షూటింగ్ కంప్లీట్ చేసుకున్నప్పటికీ…. సినిమాకి ప్రధాన బలమైన గ్రాఫిక్స్ వర్క్ విషయంలో జరిగిన గందరగోళంతో సినిమా విడుదల అలా అలా లేట్ అవుతూ వచ్చింది. రోబో సినిమా లో శంకర్ చిట్టి రోబో ని అద్భుతంగా చూపించాడు. శంకర్ మార్క్ మేకింగ్ ని అంతా మెచ్చుకున్నారు. రోబోలతో మ్యాజిక్ చేశాడన్నారు. మరి నిజమే ఆ సినిమాలో చిట్టి కి రజినీకాంత్ కి మధ్య జరిగిన ఫైట్ మామూలుది కాదు. దేశ రక్షణ కోసం చిట్టిని తయారు చేసిన రజినీకి ఆ చిట్టి రోబో తోనే మానవాళికి ముప్పని తెలిసిన తర్వాత దానిని నిర్వీర్యం చెయ్యడం, వశీకర్ గురువు చిట్టిని తెచ్చి తన స్వార్ధం కోసం వాడుకోవాలనుకుంటే…. ఐష్ మీద ప్రేమతో ఆ చిట్టి వశీకర్(రజినీ) నే చంపాలనుకోవడం… వశీకర్ మళ్ళీ చిట్టి రోబోతో యుద్ధం చేస్తూ దాన్ని సాధించడం…. అలాగే ఈ చిత్రం లో మెయిన్ హైలెట్ వేలకు వేలు చిట్టి రోబోలు సృష్టించిన విధ్వంసం అలాంటి ఇలాంటిది కాదు. అప్పట్లోనే రోబోతో హాలీవుడ్ రేంజ్ ని చూపించిన శంకర్ ఇప్పుడు 2.ఓ తో హాలీవుడ్ ని దింపేశాడా అనిపించేలా తెరకెక్కించాడు. రోబో చిత్రానికి సీక్వెల్ కాదని చెప్పినా…. రోబో లోని విలన్ చిట్టి ని మళ్ళీ రో లోడ్ చేసి విలన్ అక్షయ కుమార్ భరతం పట్టడడమే 2.ఓ మెయిన్ లైన్. మరి 2.ఓ ట్రైలర్, మేకింగ్ వీడియోస్, సాంగ్ అన్ని సినిమా మీద భారీ అంచనాలు పెంచేలా ఉన్నాయి. ఈ సినిమా క్రేజీ కాంబో ఒక ఎత్తైతే.. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటించడం మరో ఎత్తు. మరి రజినీకాంత్, శంకర్, అక్షయ్ కుమార్, అమీ జాక్సన్ ఈ సినిమా కోసం ఎంతగా కష్టపడ్డారో… మేకింగ్ వీడియోస్ లో తెలుస్తుండగా… ఈ సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ ఎంత బలమో ట్రైలర్ లో తెలిసింది. మరి 600 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ 2.ఓ ని ప్రపంచవ్యాప్తంగా 10,500 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. రజనీకాంత్ క్రేజ్ తక్కువ కాకపోవడం.. కాంబినేషన్ క్రేజ్ కూడా తోడవడంతో 2.ఓ కనీవినీ ఎరుగని స్థాయిలో రిలీజవుతోంది. ఇక విదేశాల్లో కూడా ఈ చిత్రానికి భారీగా స్క్రీన్లు దక్కాయి. రజినీకి వివిధ దేశాల్లో భారీగా అభిమానగణం ఉండటం.. 2 .ఓ స్కేల్ కూడా చాలా పెద్దది కావడంతో దీన్ని ఒక హాలీవుడ్ సినిమా స్థాయిలో భారీగా రిలీజ్ చేస్తున్నారు. మరి రిలీజ్ విషయంలో రికార్డులు నెలకొల్పుతున్న ఈ చిత్రం వసూళ్ల పరంగా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ :

2.ఓ ట్రైలర్ లో చూపించిన విధంగానే…. ఈ సినిమాలో ప్రజలందరి సెల్ ఫోన్స్ అన్ని మాయమైపోతుంటాయి. అసలు ఆ సెల్ ఫోన్స్ ఎందుకు తమ నుండి మాయమవుతున్నాయో అనే అయోమయంలో ప్రజలు ఉంటారు. అయితే ఈ సెల్ ఫోన్స్ అన్నీ ఎలా మాయమవుతున్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నించే లోపే… సెల్ ఫోన్ వ్యాపారి ఒకరు హత్య చేయబడతాడు. అయితే సెల్ ఫోన్స్ మాయం వెనుకున్న కథను, ఆ సెల్ ఫోన్ వ్యాపారి హత్య వెనుకున్న కారణాలు తెలుసుకోవడానికి వశీకర్(రజినీ) వెన్నెల (అమీ జాక్సన్ రోబోట్ వెర్షన్) లు ప్రయత్నిస్తారు. అయితే మాయమైన ఆ సెల్ ఫోన్స్ అన్నీ కలిసి ఒక పక్షి ఆకారంలో మారతాయి. సెల్‌ఫోన్ల మాదిరిగా తయారైన ప‌క్షి.. సిటీలో చొర‌బ‌డి విధ్వంసం సృష్టిస్తుంటుంది. పరిస్థితి అదుపు తప్పుతుందని గ్రహించిన వశీకర్… ప్రభుత్వం అనుమతితో వెన్నెల సహాయంతో చిట్టీని రీ లాంచ్ చేస్తాడు. మరి చిట్టి 2.ఓ ఆ సెల్ ఫోన్స్ ఎందుకు మాయమవుతున్నాయో కనుక్కుందా? అసలు సెల్ ఫోన్స్ మాయమవడానికి కారణం ఏమిటి? సెల్ ఫోన్స్ మాయం వెనుక ఎవరు వున్నారు ? చిట్టి ఈ పరిస్థితిని ఎలా అదుపులోకి తీసుకువస్తుంది ? అనేదే 2.ఓ మిగతా కథ.

నటీనటుల నటన:

ఈ సినిమాకి రజినీకాంత్ ఆయువు పట్టయితే.. అక్షయ కుమార్ కీలకం. రోబో చిత్రంలో సైంటిస్ట్ వశీకర్ గా రజినీకాంత్ అదరగొట్టిన విషయం తెలిసిందే. చిట్టిగా కూడా రజినీ నటన అద్భుతం, అలాగే ఐశ్వర్య రాయ్(సనా)తో రొమాన్స్, వశీకర్ తో పాటుగా చిట్టి రోబో రూపంలో ఉన్న రజినీ సనాని ప్రేమించడం, దానివలన వలన చిట్టి రోబో విలన్ గా మారడం అన్నీ అద్భుతమే. ఇక ఇప్పుడు 2.ఓ లో వశీకర్ పాత్రలో నటించిన సూపర్ స్టార్ రజినీకాంత్ నటనతో బాగుంది. అలాగే చిట్టి పాత్రలో రజినీకాంత్ హావభావాలు బాగున్నాయి. కాకపోతే ఈ సినిమాలో రోబోలో లాగా కాకుండా రజినీకాంత్ మార్క్ స్టైల్ మిస్ అయ్యిందనే చెప్పాలి. వశీకర్ కంటే రెండు పాత్రల చిట్టిగా మొత్తం వన్ మ్యాన్ షో చేసాడు రజినీ. ఇక బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అటు పక్షి రాజు గా అలాగే కామన్ మ్యాన్ గా అద్భుతమైన నటనను కనబరిచారు. ఫ్లాష్ బ్యాక్ లో పక్షుల బాగు కోసం తపించిపోయే వృద్ధుడిగా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అసలు ఈ పాత్రను ఆయన ఒప్పుకోవడమే సాహసం. ఇక ఆయన మేకప్ కోసం పడిన కష్టం…. మేకింగ్ వీడియోస్ లోనే చూసాం. హీరోయిన్ గా వెన్నెల రోబోట్ గా అమీ జాక్సన్ నటన ఆకట్టుకుంటుంది. కాకపోతే అమీ జాక్సన్ లోని గ్లామర్ మాత్రం ఈ సినిమాలో ఎక్కడా కనబడదు. అయితే సినిమాలోని కథ మొత్తం చిట్టి, అక్షయ్ కుమార్, వశీకర్ రజినీ పాత్రల చుట్టూనే తిరుగుతుంది. మధ్యమధ్యలో అమీ వెన్నెల పాత్ర వస్తుంటుంది. ఇక మిగతా పాత్రల నటనకు, వాటి తీరుతెన్నులకు పెద్దగా ప్రాధాన్యం లేదు.

విశ్లేషణ:

దర్శకుడు శంకర్ పేరు చెబితే.. ఆ సినిమాల్లోని భారీ సెట్టింగ్స్, అంతా భారీతనమే గుర్తుకు వస్తుంది. స్టోరీ లైన్ ఎలా ఉన్నా తన గ్రాఫిక్స్ మాయాజాలంతో ప్రేక్షకులను కట్టిపడేసే శక్తి ఒక్క శంకర్ కే ఉంది. సౌత్ లోనే నెంబర్ 1 అనిపించుకున్న శంకర్ రోబో సినిమాతో చేసిన మ్యాజిక్… శంకర్ – విక్రమ్ ల ఐ సినిమాలో వర్తించలేదు. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి భారీగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఐ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది. తర్వాత రజినీకాంత్ తో మళ్లీ రోబో సీక్వెల్ కాదని చెప్పినప్పటికీ.. ట్రైలర్స్ లో, టీజర్ లో 2.ఓ మొత్తం రోబో సీక్వెల్ మాదిరిగానే కనబడింది. రోబోలో ఒక రోబోకి మనిషి లాంటి తెలివితేలు ఉంటే…అదెంత ప్రమాదకరమో విజువల్ వండర్ గా చూపించిన శంకర్ ఇపుడు 2.ఓ లో సెల్ ఫోన్ వాడకం ఎంత ప్రమాదకరం అనేది… అలాగే సెల్ ఫోన్స్ వాడకం జీవరాశుల మరణానికి ఎలా కారణం అవుతుంది అనే పాయింట్ మీద రాసుకున్న కథతో తెరకెక్కించాడు. దేనిలోనైనా భారీ తనాన్ని కోరుకునే శంకర్ మేధాశక్తిని కొలమానంలో కొలవడం చాలా కష్టమైన పనే. అసలు మనిషి సెల్ ఫోన్ కి ఎంతగా అడిక్ట్ అవుతున్నాడు.. దానివలన జరిగే ప్రమాదాలను కూడా కనిపెట్టలేక.. ఎలాంటి ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారో.. అలాగే ఎలాంటి ప్రమాదాలకు కారణమవుతున్నారో.. సెల్ ఫోన్ మనిషి మనుగడనే కాదు.. సమస్త జీవరాశులు నాశనం చేసే వస్తువుగా ఎలా మారిందో.. విజువల్ ఎఫెక్ట్స్ తో.. గ్రాఫిక్స్ తో శంకర్ ఈ సినిమాలో చూపించాడు. అక్షయ్ కుమార్ సెల్ ఫోన్స్ అన్నిటిని తనలోకి లాగేసుకుని పక్షి అవతారంలోకి మారటం, సెల్ ఫోన్స్ పక్షిగా మానవాళిని విధ్వంసం చెయ్యడానికి రావడం.. రోబోలో చిట్టిని డిస్‌మాంటిల్ చేసిన వశీకర్ ఆ పక్షి రాజ్ ని మట్టుబెట్టేందుకు చిట్టిని 2.ఓ గా రీలోడ్ చెయ్యడం అంతా బాగానే మ్యానేజ్ చేసిన శంకర్.. తాను రాసుకున్న కథను గ్రిప్పింగ్ తో తెర మీదకు తీసుకురాలేకపోయాడు. ఈ చిత్రంలో రజినీ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని శంకర్ తెరకెక్కించిన కొన్ని సన్నివేశాలు చిత్రానికి హైలైట్ గా నిలిచాయి. హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే చూసే టాప్ మేకింగ్ ని తనదైన శైలిని ఇండియన్ స్క్రీన్ మీద ఆవిష్కరించాడు శంకర్. మరి గ్రాఫిక్స్ కోసం కాంప్రమైజ్ కాకుండా ఏడాది టైం తీసుకున్న శంకర్ ఈ చిత్రంలో చూపించిన గ్రాఫిక్స్ క్వాలిటీ కూడా అంచనాలను అందుకోలేకపోయింది. అయితే ఇద్దరు స్టార్ హీరోలను అంటే సూపర్ స్టార్ రజిని, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ లను పెట్టి వారి ఇమేజ్ తగ్గట్లుగా కథ నడపడంలో దర్శకుడు శంకర్ విజయం సాధించాడనే చెప్పాలి. కాకపోతే రోబో సినిమాలో ఉన్న ఎమోషన్స్, కామెడీ, ప్రేమ, రొమాన్స్ అన్ని ఈ 2.ఓ లో మిస్ అయ్యాయనే చెప్పాలి. మరి రెగ్యులర్ సినిమాలను ఇష్టపడే కమర్షియల్ ప్రేక్షకులకు 2.ఓ ఓ అన్నంత లేకపోయినా… కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు మాత్రం బాగా కనెక్ట్ అవుతుందనే చెప్పాలి.

సాంకేతిక వర్గం పనితీరు:

ఏఆర్ రెహమాన్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. అందుకే సౌత్ లోని పెద్ద ప్రాజెక్టులకు ఏఆర్ రెహ్మాన్ అయితేనే మ్యూజిక్ బావుంటుందని దర్శకనిర్మాతలు నమ్ముతారు. అయితే ఒకప్పుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అంటే అద్భుతంగా ఉండేది. కానీ గత కొన్నాళ్లుగా రెహ్మాన్ మ్యూజిక్ లో అంత పస కనబడ్డం లేదు. ఇక 2.ఓ లో పాటలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా… ఉన్న పాటల్లో మ్యూజిక్ ఆకట్టుకోలేదు కాని.. రెహ్మాన్ అందించిన నేపధ్య సంగీత మాత్రం అద్భుతమనే చెప్పాలి. హై స్టాండర్డ్స్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టేసాడు. రెహమాన్ బ్యాంగ్రౌండ్ మ్యూజిక్ సినిమాని మ‌రో స్థాయికి తీసుకెళ్ళింద‌ని ఘంటాపదంగా చెప్పొచ్చు. ఇక నిరవ్ షా కెమెరా పనితనం ప్రతి ఫ్రేమ్ లోనూ అడుగడునా కనబడుతుంది. అసలు నీరవ్ షా కెమెరా పనితనం గురించి ఎంత చెప్పినా తక్కువే. విజువల్స్ తో వండర్ క్రియేట్ చేసాడనే చెప్పాలి. ప్రతి ఫ్రెమ్ ని రిచ్ గా చూపించడంతో సినిమాటోగ్రాఫర్ సక్సెస్ అయ్యాడు. క్లైమాక్స్ అయితే అద్భుతంగా చిత్రీకరించాడు. అందుకే సినిమాకి మెయిన్ హైలెట్ గా సినెమాటోగ్రఫీనే అనేలా ఉంది. యాక్షన్ సీక్వెన్సెస్ కానివ్వండి ఏదైనా సరే… కెమెరా గొప్పదనం అడుగడుగునా తెలుస్తుంది. అంటోనీ ఎడిటింగ్ బాగుంది. ఇక లైకా ప్రొడక్షన్స్ పెట్టిన పెట్టుబడి సినిమాలోని ప్రతి చిన్న సీన్ లోనూ కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తుంది. దర్శకుడు శంకర్ ఏది అడిగితే అది కాదనకుండా సమకూర్చడం వలనే 2.ఓ నిర్మాణ విలువలకు అంతగా పేరొచ్చింది. మరి వారి కష్టం వృధా కాదులే.

ప్లస్ పాయింట్స్ : అక్షయ్ కుమార్ నటన, చిట్టి – అక్షయ్ కుమార్ ల మధ్య వచ్చే సన్నివేశాలు, ఇంట‌ర్వెల్ బ్యాంగ్‌, నేపధ్య సంగీతం, క్లైమాక్స్ ఎపిసోడ్, సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ : వీఎఫ్ఎక్స్, 3డి గ్రాఫిక్స్, కమర్షియల్ అంశాలు లేకపోవడం, రజినీ మార్క్ స్టైల్, కామెడీ

రేటింగ్: 2.75 /5

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*