ఆటగాళ్లు మూవీ రివ్యూ

బ్యానర్: ఫ్రెండ్స్‌ మూవీ క్రియేషన్స్‌
నటీనటులు: నారా రోహిత్‌, జగపతిబాబు, దర్శన బానిక్‌, బ్రహ్మానందం, సుబ్బరాజు, తులసి, జీవా, చలపతిరావు తదితరులు
సినిమాటోగ్రఫీ: విజయ్‌ సి. కుమార్‌
ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె.వెంకటేష్‌
సంగీతం: సాయికార్తీక్‌
నిర్మాతలు: వాసిరెడ్డి రవీంద్రనాథ్‌, వాసిరెడ్డి శివాజీ ప్రసాద్‌, రాము మక్కెన, వడ్లపూడి జితేంద్ర
డైరెక్టర్: పరుచూరి మురళి

నారా రోహిత్ హీరో మెటీరియల్ కాకపోయినా… విభిన్నమైన కథలతో హీరోగా ఆకట్టుకుంటాడు. నారా రోహిత్ లో హీరోకుండాల్సిన ఫిట్నెస్ గాని.. గ్రేసీ లుక్స్ కానీ లేవు. కానీ తనకు తగ్గ పాత్రలతో కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు రోహిత్. మంచి మంచి ఆసక్తికర టైటిల్స్ తో వస్తున్నా నారా రోహిత్ కి ఈమధ్యన సరైన హిట్ పడడం లేదు. రొటీన్ మూస కథలతో ప్లాప్స్ లో ఉన్న నారా రోహిత్… టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ విలన్స్ లిస్ట్ లో ఉన్న జగపతి బాబుతో కలిసి పరచూరి మురళి దర్శకత్వంలో ఆటగాళ్లు సినిమా చేసాడు. పెదబాబు, ఆంధ్రుడు వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో పాటు మరికొన్ని సినిమాలు చేసిన పరుచూరి మురళి భారీ గ్యాప్‌ తర్వాత తెరకెక్కించిన సినిమా ఆటగాళ్లు. నారా రోహిత్‌, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక నారా రోహిత్ కి హిట్స్ లేకపోయినా.. ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు అంటేనే సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. మరి ఆటగాళ్లు సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఎంటర్టైన్ చేసినదో సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

రోడ్ ఆక్సిడెంట్ లో చనిపోయిన ఒక రైతు బిడ్డని సినిమా డైరెక్టర్‌ సిద్ధార్థ్ (నారా రోహిత్) దత్తత తీసుకుంటాడు. సిద్దార్ధ్ ఆ పాపను దత్తత తీసుకోకముందే సిద్ధార్థ్ ప్రేమించి పెళ్లాడిన అంజలి (దర్శన బాబిక్) ఇంట్లో హత్యకు గురవుతుంది. అయితే సిద్ధార్థ్‌ తన భార్య అంజలిని హత్య చేశాడని టీవీల్లో వార్తలు వస్తాయి. బయటి వాళ్లెవరూ ఇంట్లోకి రాకపోవడంతో నేరం సిద్ధార్థే చేశాడని అంతా భావిస్తారు. పోలీసులు సిద్ధార్థ్‌ ని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరుస్తారు. అంజలిని చంపింది సిద్ధార్థేనని సాక్ష్యాధారాలతో నిరూపిస్తాడు వీరేందర్‌ (జగపతి బాబు) అనే న్యాయవాది. అయితే న్యాయం ఎటువైపు ఉంటె అటు వైపు నిలబడి టేకప్ చేసిన ఏ కేసునైనా గెలుస్తుంటాడు వీరేందర్. అయితే న్యాయం ఉన్న వైపే వీరేందర్‌ వాదిస్తాడు కాబట్టి… తనవైపు న్యాయం ఉంది కాబట్టి తన తరఫున వాదించాల్సిందిగా వీరేందర్‌ని కోరతాడు సిద్ధార్థ్‌. అలా అంజలి కేసు కొత్త మలుపు తిరుగుతుంది. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా ఉన్న వీరేందర్‌ డిఫెన్స్‌ తరఫున వాదించడం ఏమిటని అందరూ ఆశ్చర్యపోతారు. అయినా న్యాయాన్ని గెలిపించడానికే నిర్ణయించుకుంటాడు వీరేందర్‌. మరి నిజంగానే సిద్దార్ధ్ తన భార్య అంజలిని హత్య చేశాడా.? ఎవరైనా హత్య చేసి ఆ నేరంలో సిద్దార్ధ్ ని ఇరికించారా.? అసలు అంజలిని హత్య చెయ్యాల్సిన అవసరం ఎవరికుంది.? వీరేందర్ సిద్దార్ధ్ ని రక్షిస్తాడా.? అనే విషయాలను ఆటగాళ్లు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల నటన:

సినిమా డైరెక్టర్‌గా నారా రోహిత్ బాగా మెప్పించాడు. తన భార్యను హత్య చేసాడని నారా రోహిత్ ని అరెస్ట్ చేసే సన్నివేశాలలో కానివ్వండి, కోర్టు సన్నివేశాల్లో కానివ్వండి నారా రోహిత్ ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ అద్భుతంగా పలికించాడు. ఎమోషనల్ సీన్స్ లోనూ రోహిత్ నటన బావుంది. కానీ నారా రోహిత్ అంత లావుగా ఉండి మరీ బరువుగా కనబడడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీరేంద్ర పాత్రలో జగపతి బాబు అద్భుతంగా నటించారు. ఓ రకంగా చెప్పాలంటే ఈ సినిమాకు ఆయనే హీరో. నారా రోహిత్ క్యారెక్టర్ కన్నా… జగపతి బాబు క్యారెక్టర్ బావుంటుంది. స్టైలిష్‌‌గా కనిపించడంతో పాటు న్యాయం కోసం పోరాడే లాయర్ పాత్రలో జగపతి బాబు ఒదిగిపోయాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ దర్శన బానిక్ పాత్రకు పెద్ద ప్రాధాన్యం లేదు. ఆమె చాలా తక్కువ సమయమే సినిమాలో కనిపిస్తుంది. అవుట్ డేటెడ్ కామెడీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన బ్రహ్మి కామెడీ అసలు ఆకట్టుకోలేదు. గో గో పాత్రలో బ్రహ్మానందం నటన అసలు మెప్పించలేకపోయింది. తల్లిగా తులసి… డీసీపీ నాయక్ పాత్రకు సుబ్బరాజు న్యాయం చేశారు. మిగతా పాత్రలకు అంతగా ప్రాధాన్యత లేదు.

విశ్లేషణ:

దర్శకుడు మురళి గతంలో చేసిన సినిమాల్లో ఎంతో కొంత విషయం ఉండేది. హిట్స్ ప్లాప్స్ పక్కన పెడితే అతను చెప్పాలనుకున్న పాయింట్‌ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉండేది . కానీ ఈ ఆటగాళ్లు సినిమా విషయానికి వస్తే ఎంచుకున్న కథలో కొత్తదనం లేదు. కథనం కూడా దానికి తగ్గట్టుగానే ఉంది. ప్రారంభమైన ఐదు నిమిషాలకే సినిమా ఎలా ఉండబోతోందనే విషయంలో ఒక నిర్థారణకు వస్తాడు ప్రేక్షకుడు. టీవీ ఛానల్స్‌ కి సంబంధించి చూసిన సీన్ేి మళ్లీమళ్లీ చూడాల్సి రావడం, కథను పక్కన పెట్టి బ్రహ్మానందంతో కామెడీ చేయించే ప్రయత్నం చెయ్యడం, సాయి కార్తీక్‌ అండ్‌ టీమ్‌తో ఒక డాన్స్‌ సాంగ్‌ పెట్టడం వంటివి కథకు పెద్ద అవరోధాలుగా మారాయి. నిజం చెప్పాలంటే ఈ కథతో షార్ట్‌ ఫిలిం చెయ్యవచ్చు తప్ప రెండున్నర గంటల సినిమా తియ్యడం…. దాన్ని ప్రేక్షకులు చూసే సాహసం చెయ్యడం కరెక్ట్‌ కాదు. నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న నారా రోహిత్‌ నుంచి మంచి నటనను రాబట్టడంలో దర్శకుడు మురళి విఫలమయ్యాడు. ఏ దశలోనూ అతనిలోని నటుడ్ని బయటికి తీసుకురాలేకపోయాడు. ఆటగాళ్లు అనే టైటిల్‌ చూసి ఓ కొత్త తరహా కథతో సినిమా చేసి ఉంటారు… సినిమాలో చాలా ట్విస్టులు ఉంటాయి, సినిమా చూస్తూ థ్రిల్‌ అయిపోతాం అనుకుంటే పొరపాటే. ఇందులో అలాంటి అంశాలు ఏమీ ఉండవు. ఫైనల్‌గా చెప్పాలంటే సినిమా ప్రారంభం నుంచి ఇంటర్వెల్‌ వరకు ఈ సినిమాకి ఎందుకొచ్చామా అని బాధపడే ప్రేక్షకులకు సెకండాఫ్‌లో కాస్త ఫర్వాలేదు అనిపించే కొన్ని సీన్స్‌ తప్ప సినిమాలో చెప్పుకోవడానికి ఏమీ లేదు.

సాంకేతికవర్గం పనితీరు:

సాయికార్తీక్‌ మ్యూజిక్ అస్సలు బాగోకపోయినా… బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కొన్ని సన్నివేశాల్లో నేపధ్య సంగీతం పతాక స్థాయిలో ఉంది. ఇక ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. చాలా సీన్స్ ని చక్కగా అందంగా కెమెరాలో బంధించాడు. ఇక ఎడిటింగ్ విషయానికొస్తే… మార్తాండ్ కె వెంకటేశ్ తన కత్తెరకు మరింత పదును పెడితే బాగుండనిపిస్తుంది. నిర్మాణ విలువలు కథానుసారంగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్: జగపతిబాబు స్క్రీన్ ప్రెజన్స్, రోహిత్ – జగపతి బాబు మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు, సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్: కథ, కథనం, డైరెక్షన్, మ్యూజిక్,ఎడిటింగ్

రేటింగ్: 2.0/5

Sandeep
About Sandeep 6665 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*