చినబాబు మూవీ రివ్యూ

నటీనటులు: కార్తీ, సయేశా సైగల్, సత్య రాజ్, భానుప్రియ, ప్రియా భవాని, సూరి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: డి. ఇమ్మాన్
ఎడిటర్: రూబెన్
నిర్మాత: హీరో సూర్య
దర్శకత్వం: పాండిరాజ్

కోలీవుడ్ హీరో కార్తీ సినిమాలకు తెలుగులో మంచి డిమాండ్ వుంది. అతను కోలీవుడ్ లో నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ విడుదలవుతుంది. అలాగే కార్తీ పూర్తిగా ఒక తెలుగు స్ట్రయిట్ సినిమాలోనూ నటించాడు. కార్తీ ఇప్పటివరకు భారీ బడ్జెట్ చిత్రాలతో కాకుండా డిఫరెంట్ కథలను ఎన్నుకుంటూ మీడియం రేంజ్ హీరోగానే ఎదుగుతూ వస్తున్నాడు. స్టార్ హీరో కాకపోయినా… స్టార్ హీరోకున్న క్వాలిటీస్ మొత్తం హీరో కార్తీ లో ఉన్నాయి. ఇక కార్తీ కేవలం తమిళమే కాదు.. తెలుగులోనూ స్పష్టంగా మాట్లాడగల హీరో. అందుకే తెలుగులో తన పాత్ర డబ్బింగ్ ని తానే చెప్పుకుంటాడు. ఇక గతంలో వచ్చిన కాష్మోరా, ఊపిరి, ఖాకి సినిమాలతో కార్తీ మంచి జోరు మీదున్నాడు. ప్రస్తుతం రైతు సమస్యల బ్యాగ్రౌండ్ లో అనేక సినిమాలు తెరకెక్కుతుంటే.. అసలు వ్యవసాయ కుటుంబం బ్యాగ్రౌండ్ కాకుండా డైరెక్ట్ రైతు కథతోనే తన అన్న సూర్య నిర్మాతగా.. పాండిరాజ్ దర్శకత్వంలో కార్తీ ఈ సినిమాని కోలీవుడ్ లో కడైకుట్టి సింగంని చేసాడు. ఇప్పుడు అదే సినిమాతో తెలుగులో చినబాబు గా వచ్చాడు. ఇక అఖిల్ సినిమాతో తెలుగులో అఖిల్ పక్కన నటించి ఒక్కదెబ్బకే మాయమైన సయేశా సైగల్, కార్తీ కి జోడిగా ఈ సినిమాలో నటించింది. భారీ ప్రమోషన్స్ చినబాబుపై ఆసక్తిని రేకెత్తించిన కార్తీ గత సినిమా ఖాకి సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా సత్తా చాటి ఇప్పుడు రైతుగా ఎలాంటి నటన ప్రదర్శించాడు? అలాగే కేవలం రైతులకే కార్తీ నచ్చాడా? లేదంటే అన్ని వర్గాల ప్రేక్షకులను కార్తీ ఇంప్రెస్స్ చేశాడా? అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

రుద్రరాజు(సత్యరాజ్) కుటుంబం వ్యవసాయ వృత్తిలో ఉంటుంది. అలాగే ఆ గ్రామానికి రుద్రరాజు గ్రామ పెద్దగా ఉంటాడు. రుద్రరాజుకి వరసగా ఐదుగురు ఆడపిల్లలు పుడతారు. ఆఖరుకి అంటే ఆరోసారి రుద్రరాజుకి ఒక కొడుకు పుడతాడు. ఐదుగురు అమ్మాయిల తర్వాత పుట్టిన చిన్న కొడుకుని చినబాబు(కార్తీ)గా గారాబంగా పెంచుకుంటారు. అయితే పెద్దగా చదువుకోకుండా వ్యవసాయంలోకి దిగిపోతాడు చినబాబు. ఇక వ్యవసాయం చేస్తూ రైతుగా మందులు వాడకుండా పంటను పండించే ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ నెలకి ఒక సాఫ్ట్ వెర్ ఉద్యోగికి తీసిపోనంత సంపాదిస్తాడు. అందుకే వ్యవసాయం చేసుకునే రైతు అని అందరితో గర్వంగా చెప్పుకుంటాడు చినబాబు. అయితే చినబాబు తన అక్కల కూతుళ్లలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటాడు అనే సమయంలో బయటి అమ్మాయి నీల(సయేశా)ని ప్రేమిస్తాడు. అయితే నీలకి తన బావ సురేందర్(శత్రు) నుండే థ్రెట్ ఉంటుంది. ఎన్నికల్లో గెలవడానికి సురేందర్ చెయ్యకూడని పనులు చేస్తుంటాడు. అంతేకాకుండా నీలను తన తమ్ముడికిచ్చి పెళ్ళిచేయాలనుకుంటాడు. అలాగే చినబాబుతో సురేందర్ వైరం పెంచుకుంటాడు. మరి ఈ నేపథ్యంలో చినబాబు నీలని తన బావ సురేందర్ నుండి ఎలా కాపాడాడు? తన అక్కలు, బావలను నీలని పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పిస్తాడు? అసలు చినబాబుకి సురేందర్ కి మధ్య ఉన్నవిభేదాలు ఏమిటి? అసలందరూ ఉద్యోగాలు చేసి ఊళ్ళేలుతుంటే.. రుద్రరాజు మాత్రం తన కొడుకుని వ్యవసాయం ఎలా చెయ్యనిస్తాడు? అనేది మిగతా కథ.

నటీనటుల నటన:

చినబాబు గా కార్తీ ఒక రైతుగా చాలా కొత్తగా కనిపించాడు. కార్తీ తన పాత్రకు పూర్తిగా న్యాయం చేసాడు. తను ఎంతో ప్రేమించిన ఎద్దులు చనిపోయిన సమయంలో వేదన పడే రైతుగా కార్తి నటన బాగుంది. కార్తీ స్క్రీన్ ప్రజెంటేషన్ చాలా బావుంది. హీరోయిన్ సయేశా సైగల్ తో కెమిస్ట్రీ కూడా కార్తీ బాగా పండించాడు. ఇంతకుముందు పోలీస్ గా, మాంత్రికుడిగా, అన్న కోసం త్యాగం చేసే తమ్ముడిగా, ఒక ప్రేమికుడిగా నటించి మెప్పించిన కార్తీ ఇప్పుడు రైతుగా పంచె కట్టు లో అదరగొట్టేసాడనే చెప్పాలి. ఆర్గానిక్ వ్యవసాయ ద్వారా లక్షలు సంపాదించ్చు… రైతు అని చెప్పుకోవడానికి ఎలాంటి సిగ్గు పడక్కర్లేదని ఒక మెస్సేజ్ ఉన్న పాత్రకు కార్తీ ప్రాణం పెట్టాడు. హీరోయిన్ సాయేషా ఒక పల్లెటూరి అమ్మాయిలా తన పాత్రలో ట్రెడిషినల్ గా కనిపించింది. చినబాబు ప్రేయసిగా సయేషా ఫర్వాలేదనిపించింది. కార్తీతో కలిసి రొమాంటిక్ సన్నివేశాల్లో మెప్పించింది. కార్తీ తండ్రిగా సత్యరాజ్ చక్కటి నటన కనబరిచారు. కుటుంబ పెద్దగా, గ్రామ పెద్దగా సత్యరాజ్ ఎప్పటిలాగే అద్భుతంగా నటించి మెప్పించాడు. ఇక చినబాబు మేనల్లుడిగా, ఎప్పుడూ అతడినే అంటిపెట్టుకుని తిరిగే స్నేహితుడిగా సూరీ కూడా ఆకట్టుకున్నాడు. విలన్ గా శత్రు, చినబాబు తల్లిగా విజి తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక మిగతా నటీనటులు తమ పరిధిమేర నటించి మెప్పించారు.

విశ్లేషణ:

దర్శకుడు పాండిరాజ్ ఏదో వ్యవసాయం గురించి అక్కడక్కడా చూపించేసి వదిలిపెట్టకుండా… సినిమా మొత్తం వ్యవసాయమే ప్రధానం గా కథను నడిపించిన తీరు అభినందనీయం. పల్లెటూరి వాతావరణంలో చినబాబును అందంగా తెరకెక్కించారు. అటు వ్యవసాయాన్ని ప్రధానంగా చూపిస్తూనే కుటుంబం గురించి కూడా చాలా చక్కగా ప్రెజెట్ చేసాడు దర్శకుడు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న బాండింగ్ ని పర్ఫెక్ట్ గా చూపించాడు. ఇక దర్శకుడు ఎలా చెబితే అలా కార్తీ చినబాబుగా అద్భుతమైన పర్ ఫార్మెన్స్ ఇచ్చి సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాడు. అలాగే దర్శకుడు ఈ కుటుంబ కథలోనే కామెడీని కూడా బాగా బ్యాలెన్స్ చేసాడు. అంతేకాకుండా ఇంట్లో పెరిగిన అక్క కూతురినో లేదంటే మేనమామ కూతురినో కాదని బయటి అమ్మాయిని పెళ్లాడితే కుటుంబంలో ఏ సమస్యలు తలెత్తుతాయనే కథాంశంతో దర్శకుడు పాండిరాజ్ ఈ సినిమాను ఆకట్టుకునేలా తెరకెక్కించాడు. అయిదుగురు అక్కచెల్లెల్ల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ బావున్నాయి. కానీ మధ్యలో కొంచెం హెవీ ఎమోషనల్ డ్రామా అనిపిస్తుంది. దర్శకుడు పాండిరాజ్ కొన్ని సన్నివేశాల్లో ఇంకొంచెం జాగ్రత్త వహిస్తే బావుండేది. అలాగే కథను తెరకెక్కించిన విధానం కొంచెం రెగ్యులర్ గా అనిపిస్తుంటుంది. కార్తీ నుంచి ఫ్యాన్స్ ఆశించిన కామెడీ, రొమాన్స్ లాంటి అంశాలకు లోటు లేకుండా జాగ్రత్త పడ్డాడు. కాకపోతే సినిమా పూర్తిగా తమిళ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే తెరకెక్కించినట్టుగా అనిపిస్తుంది. మరి ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారు అనేది మాత్రం ఒక్క వారం ఆగితేనే తెలుస్తుంది.

సాంకేతికవర్గం పనితీరు:

ఈ చిత్రానికి మ్యూజిక్ అందించిన ఇమాన్ మ్యూజిక్ కంటే కాస్త బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది అనిపిస్తుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సో సో గా ఉన్నప్పటికీ పర్వాలేదనిపిస్తుంది. ఇక ఈ సినిమాకి మెయిన్ అస్సెట్ సినిమాటోగ్రఫీ. వేల్‌రాజ్ కెమెరా వ‌ర్క్ ఈ సినిమాకి ప్రాణం అనేలా ఉంది. ప‌ల్లెటూరి వాతావరణాన్ని చాలా నేచురల్ గా తెర‌పై త‌న విజువ‌ల్స్‌ తో వేల్‌రాజ్ చ‌క్క‌గా ఆవిష్క‌రించాడు. రూబెన్ ఎడిటింగ్ బావున్నప్పటికీ… అక్కడక్కడక డ్రాగ్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఇక నిర్మాతగా సూర్య మాత్రం ఎక్కడా తగ్గకుండా తన తమ్ముడు కార్తీ కోసం బడ్జెట్ అందించాడు చినబాబు సినిమాకి. నిర్మాణ విలువలు కథానుసారంగా రిచ్ గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్: రైతుగా కార్తీ నటన, దర్శకత్వం, ఫ్యామిలీ స్టోరీ, కథనం, సినిమాటోగ్రఫీ, ఫస్ట్ హాఫ్, కామెడీ,

మైనస్ పాయింట్స్: సెకండ్ హాఫ్, తమిళ నేటివిటీ, బ్యాగ్రౌండ్ స్కోర్, కొన్ని ఎమోషనల్ సీన్స్, మ్యూజిక్

రేటింగ్: 2.75 /3

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*