గీత గోవిందం మూవీ రివ్యూ

Vijaya Devarakonda Rashmika Mandanna cinema telugu post telugu news

బ్యానర్: గీత ఆర్ట్స్
నటీనటులు: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, నిత్య మీనన్, అను ఇమ్మాన్యువల్, నాగ బాబు, రాహుల్ రామకృష్ణ, అన్నపూర్ణ, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, సత్యం రాజేష్ తదితరులు
సినిమాటోగ్రఫీ: మణికందన్
మ్యూజిక్ డైరెక్టర్: గోపి సుందర్
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్
నిర్మాత: బన్నీ వాస్
డైరెక్టర్: పరశురామ్

పెళ్లి చూపులు సినిమాతో హీరోగా ఎంటర్ అయిన విజయ్ దేవరకొండ అంతకు ముందు హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. పెళ్లి చూపులు సినిమా హిట్ అయినప్పటికీ.. విజయ దేవరకొండకి సందీప్ వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి బిగ్ బ్రేక్ ఇచ్చింది. అర్జున్ రెడ్డి గా విజయ్ దేవరకొండ అదరగొట్టే పెరఫార్మెన్స్ తో యూత్ కి బాగా దగ్గరయ్యాడు. అర్జున్ రెడ్డి యాటిట్యూడ్ తోనే ప్రస్తుతం సినిమాలు చేస్తున్న విజయ్ సినిమాలకు మార్కెట్ ఒక రేంజ్ లో పెరిగింది. విజయ్ దేవరకొండ సినిమా వస్తుంది అంటే పిచ్చెక్కిపోయి ఎదురు చూసే యువ ప్రేక్షకులు ఇప్పుడు విజయ్ సొంతమయ్యారు. విజయ్ దేవరకొండ కి అర్జున్ రెడ్డి సినిమా తర్వాత పెద్ద బ్యానర్స్ నుండి ఆఫర్స్ రావడం.. విజయ్ కూడా ఆచితూచి సినిమాలు ఒకే చెయ్యడం చేస్తున్నాడు. ఇక అల్లు అరవింద్ తన గీత ఆర్ట్స్ బ్యానర్ లో విజయ్ ని లాక్ చేసాడు. బన్నీ వాస్ నిర్మతగా.. పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఒక లవ్ ఎంటెర్టైనెర్ గీత గోవిందం సినిమా చేసాడు. ఈ సినిమా లో కాలేజ్ లెక్చరర్ గా అమ్మాయిని ప్రేమలో పడేసే లవర్ బాయ్ లా విజయ్ దేవరకొండ స్టయిలిష్ పెరఫార్మెన్స్ సినిమా మీద అంచనాలు పెంచేలా చేసింది. ఇక ఛలో సినిమా తో తెలుగులోకి హీరోయిన్ గా ఎంటర్ అయిన రష్మిక మందన్న గీత పాత్రలో గోవిందుడిని అంటే విజయ్ దేవరకొండని తన వెంటపడేలా చేసుకున్న పాత్రలో కనిపించనుంది. మరి ఈ సినిమా లో విజయ్, రష్మికల కెమిస్ట్రీ మీద యూత్ లో భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. మరి ఆగస్టు 15న సోలోగా బరిలోకి దిగుతున్న విజయ్ దేవరకొండ ఈ గీత గోవిందం తో ఎలాంటి సక్సెస్ ని సొంతం చేసుకున్నాడో చూసేద్దాం.

కథ:

లేడీస్ కాలేజ్ లో జూనియర్ లెక్చరర్ గా పనిచేసే విజయ్ గోవింద్(విజయ్ దేవరకొండ).. కాలేజ్ అమ్మాయిలను చూసి చూసి.. తన భార్య ఎలా ఉండాలో కలలు కంటుంటాడు. తన భార్య ఇలా ఉండాలి.. అలా ఉండాలి.. అచ్చం గీత గోవిందం సినిమా టీజర్ లో చూపించినట్టుగా.. ఎన్నెన్నో జన్మల బంధం… నీది నాది అన్నట్టుగా.. అన్నమాట. గోవింద్ ఎలాంటి భార్య కావాలనుకుంటాడో.. అలాంటి లక్షణాలున్న అమ్మాయి గీత(రష్మిక మందన్న)ని గోవింద్ బస్సులో చూసి మనసు పారేసుకుని.. ఆమెనే ఆరాధిస్తూ.. గుడిలో అనుకోని చేదు సంఘటనతో కలవడం.. విజయ్ గోవింద్ మీద నెగెటీవ్ ఇంప్రెషన్ తో ఉన్న గీత ని పడెయ్యడానికి విజయ్ చేసే ప్రయత్నాలు… అనుకోకుండా గోవింద్ చెల్లి పెళ్లి గీత అన్నయ్య ఫణింద్ర(సుబ్బరాజు) తో ఫిక్స్ అవడంతో.. తమ మధ్యన జరిగిన చేదు సంఘటనను ఎవరికీ తెలియకుండా గీత, గోవింద్ లు దాచెయ్యడం… గీతని ఏడిపించిన వాడి కోసం ఆమె అన్న ఫణింద్ర వెతకడం… ఇక గీత, గోవింద్ మీద పెంచుకున్న అపోహలు, అపార్ధాలు తొలిగిపోయి.. పెళ్లికి సిద్ధమయ్యే టైంలో.. గీతతో పెళ్లి ని గోవింద్ రిజెక్ట్ చెయ్యడం… జరుగుతుంది. అసలు గీత – గోవింద్ మధ్యన జరిగిన ఆ చేదు సంఘటన ఏమిటి? ఈ విషయం పెద్దవాళ్లకి తెలియకుండా ఎందుకు దాచాల్సి వచ్చింది? గీత అపోహలు తొలిగాక గోవింద్ ని ఇష్టపడినా.. గోవింద్.. గీత తో పెళ్లిని ఎందుకు రిజెక్ట్ చేసాడు? అసలు గీత – గోవింద్ ల ప్రేమ సక్సెస్ అయ్యిందా..? వారికి పెళ్లి జరిగిందా..? అనేది తెలియాలంటే గీత గోవిందం సినిమా స్క్రీన్ మీద చూడాల్సిందే.

నటీనటుల నటన:

విజయ్ దేవరకొండ.. విజయ్ గోవింద్ పాత్రకి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. కాలేజ్ లెక్చరర్ గా అతని స్టయిల్, అమ్మాయిని ప్రేమలో పడేసే కుర్రాడిగా.. అతని యాటిట్యూడ్, విజయ్ దేవరకొండ కొంటె లుక్స్ వెరసి పక్కింటి అబ్బాయిలా.. విజయ్ దేవరకొండ బెస్ట్ పెరఫార్మెన్స్ ఇచ్చాడు. చాలా ఈజ్ గా కనబడుతూ.. గోవింద్ పాత్రకి ప్రాణం పోసాడు. కాలేజ్ లెక్చరర్ లా ఇన్ షర్ట్, తనలో ఉన్న స్పార్క్ ని ఎనర్జీని చూపిస్తూ నటనతో అదరగొట్టేసాడు. డైలాగ్ డెలివరీ, వాయిస్ లోని గ్రిప్ విజయ్ కున్న ప్రధాన ఆకర్షణ. గీత గోవిందం సినిమా మొత్తం గోవింద్ పాత్ర, గీత అంటే రష్మిక పాత్ర చుట్టూనే తిరుగుతుంటుంది. హీరోయిన్ గా రష్మిక మందన్న నటన హైలెట్ గా చెప్పొచ్చు. ఛలో సినిమాలో చాలా ట్రెడిషనల్ గా లైట్ గా.. అందమైన లుక్స్ తో కేర్ లెస్ అమ్మాయిగా కనబడిన రష్మిక మందన్న.. గీత గోవిందంలో గీత గా మెస్మరైజ్ చేసిందనే చెప్పాలి. అరమరిక లేని అందం. అపురూప సౌందర్యం.. ఒకసారి చూస్తే కళ్ళు పక్కకు తిప్పుకోనివ్వకుండా… అయస్కాంతంలా అతుక్కుపోయే అందం ఆమె సొంతం అనడంలో అతిశయోక్తి లేదు. గ్లామర్ గా అందాలు ఆరబొయ్యక పోయినా… అందరినీ ఆకట్టుకుంది రష్మిక. కాస్త కోపాన్ని చూపించే పాత్రలో గీతగా పర్ఫెక్ట్ ఛాయస్ అనిపించింది. అలాగే ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి ధీటుగా నటించి అందరి మనసులను గెలిచేసింది. విజయ్ దేవరకొండకి ఫ్రెండ్ క్యారెక్టర్ లో కనబడిన రాహుల్ రామకృష్ణ ప్రేమ సలహాలు ఇచ్చే స్నేహితుడిగా కొత్త పాత్ర కాకపోయినా నవ్వించడంలో కొంతవరకు సక్సెస్ అయ్యాడు. గీత అన్నగా ఫణింద్ర పాత్రలో సుబ్బరాజు రొటీన్ అయినా ఆ పాత్ర తీర్చిదిద్దిన విధానం బాగుంది. వెన్నెల కిషోర్, గిరిబాబు, అన్నపూర్ణ, నాగేంద్ర బాబు, సత్యం రాజేష్ తమ పరిధి మేర ఆకట్టుకున్నారు.

విశ్లేషణ:

దర్శకుడు పరశురామ్ చాలా సింపుల్ కథతో గీత గోవిందం సినిమాని తెరకెక్కించాడు. కేవలం రెండు పాత్రలోనే హైలెట్ చేస్తూ రాసుకున్న కథతో.. చివరివరకు బాగానే నడిపించాడు. ఫస్ట్ హాఫ్ లో కామెడీతో కూడిన కథతో ప్రేక్షకుడిని బలంగా కట్టిపడేసిన దర్శకుడు సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి నీరసించి పోయాడనిపించింది. సెకండ్ హాఫ్ మొత్తం కాస్త నెమ్మదిగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. లవర్స్ మధ్య అపార్థాలు లేదా ప్రేయసి ప్రసన్నం చేసుకోవడం కోసం హీరో పడే తిప్పలు ఇవన్నీ ప్రేక్షకుడికి కొత్త కాదు. గతంలో చాలా సినిమాల్లో చూసిందే. అందుకే మరీ కొత్తగా తెరమీద ఏదో చూస్తున్నాం అన్న అనుభూతి మాత్రం గీత గోవిందంతో కలగదు. కానీ ఈ సినిమాతో యూత్ ని మెప్పించేందుకు పరశురామ్ చేసిన ప్రయత్నం పర్వాలేదు అనిపిస్తుంది. విజయ్ దేవరకొండ – రష్మిక ల మధ్య కెమిస్ట్రీ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. విజయ్ తన నటనతో చాలా వరకు ఆకట్టుకున్నాడు. రష్మిక కోసం ఆమె వెనకే తిరుగుతూ ఆమెని పడెయ్యడం.. అలాగే రష్మికకి నో చెప్పే సన్నివేశాలలో విజయ్ నటన బావుంది. అలాగే రష్మిక మందన్న కూడా కాస్త కోపం, కాస్త పొగరు వగరుతో మెప్పించింది. కాకపోతే కొన్ని కొన్ని సీన్స్ లో సహజత్వం లోపించింది అనే ఫీలింగ్ కలుగుతుంది. ఫ్రెండ్ చెప్పాడని… బస్సు లో రష్మికని కిస్ చేసే ప్రయత్నం.. అలాగే విజయ్ ని విపరీతంగా ద్వేషించే రష్మిక లాజిక్ లేకుండా ప్రేమించెయ్యడం… ఇలా కొన్ని సీన్స్ లో సహజత్వం లోపించిన ఫీలింగ్ కలుగుతుంది. అంతేకాకుండా గోవింద్.. గీతని అంత ప్రేమిస్తున్నప్పుడు అన్ని అనుకూలించి పెళ్ళికి రెడీ అయ్యాక గీత ని రిజెక్ట్ చెయ్యడం కూడా ప్రేక్షకుడు పెద్దగా జీర్ణించుకోలేడు. అలాగే హీరో ప్రతి ఒక్క విషయానికి మందు కొట్టడం వంటి విషయాలు అంతగా అనిపించవు. ఆంజనేయులు, సోలో, శ్రీరస్తు-శుభమస్తు సినిమాలతో ఆకట్టుకున్న డైరెక్టర్ పరశురాం ఈ సారి తన ఈ సినిమాలో కామెడీకి ప్రయారిటీ ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో వెన్నెల కామెడీ కాస్త హైలెట్ అయినప్పటికీ.. విజయ్ – రష్మికల పెళ్లి సెట్ అయ్యాక కాస్త బఫూన్ లా మారిపోయాడు. ఇక ఈ సినిమా లో ప్రీ క్లైమాక్స్ కూడా కాస్త రొటీన్ అనిపిస్తుంది. కానీ ఈ సినిమాకి ప్రమోషన్స్ హైలెట్ గా ఉండడం, ఒక పాట విషయంలో కాంట్రవర్సీ కావడం, కొన్ని సీన్స్ లీక్ అవడం.. ఇలా ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడడం.. అలాగే విజయ్ దేవరకొండ మీదున్న ఎక్స్ పెక్టేషన్స్, ఈ సినిమాకి పోటీగా పది రోజుల వరకు ఎలాంటి సినిమా లేకపోవడం.. విజయ్ దేవరకొండ గీత గోవిందం సినిమాకి కలిసొచ్చే అంశమే కాదు.. విజయ్ కున్న క్రేజ్ తో అతను అభిమానులకు మాత్రమే కాదు.. యావత్ యూత్ కి ఈ సినిమా మాత్రం బాగా నచ్చుతుంది అని చెప్పగలం.

సాంకేతికవర్గం పనితీరు:

గీత గోవిందం సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ మ్యూజిక్… రెండు పాటల్లోనే మ్యాజిక్ చేసినా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం దంచేసాడు.. ఇంకేం కావాలె పాట ఈ సినిమాకి హైలెట్ అనేలా అనిపిస్తే…మిగిలిన పాటలు కాస్త యావరేజ్ గానే అనిపిస్తాయి. ఇక గోపి బ్యాగ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టేసాడు. రొమాంటిక్ సీన్స్ లో, ఎమోషనల్ సీన్స్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుత: అన్నట్టుగా ఉంది. ఇక ఈ సినిమాకి మరో మెయిన్ హైలెట్… మణికందన్ సినిమాటోగ్రఫీ. కాలేజ్ పరిసరాలను, పాటల్లోని అందాలను తన కెమరాతో అందంగా చూపించాడు మణికందన్. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ షార్ప్ గానే ఉన్నా సెకండ్ హాఫ్ మాత్రం సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండ్ హాఫ్ లో చాలా కట్స్ పెట్టాల్సింది.. కాస్త లైట్ తీసుకున్నారనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. గీతా ఆర్ట్స్, బన్నీ వాస్ నిర్మాణంలో క్వాలిటీ ఉంది.

ప్లస్ పాయింట్స్: విజయ్, రశ్మిక, కథలో ట్విస్ట్, నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ, ఫస్ట్ హాఫ్, కామెడీ

నెగటివ్ పాయింట్స్: సెకండ్ హాఫ్, రొటీన్ ప్రీ క్లైమాక్స్, ఎమోషన్స్

రేటింగ్: 2.75 /5

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*