కాలా మూవీ రివ్యూ

ప్రొడక్షన్ కంపెనీ: వండర్ బార్ ఫిలిమ్స్
నటీనటులు: రజినీకాంత్, హ్యూమా ఖురేషి, నానా పటేకర్, ఈశ్వరి రావు, సుకన్య, అంజలి పాటిల్, అరుళ్దాస్, ధనుష్ (గెస్ట్ రోల్), సముథిరా కని తదితరులు
సినిమాటోగ్రఫీ: మురళి
మ్యూజిక్ డైరెక్టర్: సంతోష్ నారాయణన్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
ప్రొడ్యూసర్: ధనుష్
దర్శకత్వం: పా రంజిత్

సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే ఫాన్స్ లో పిచ్చ క్రేజ్. ఆయన స్టయిల్ అంటే పడి చచ్చిపోయే అభిమానులు ఉన్నారు. అందుకే ఆయన గత చిత్రాలు అట్టర్ ప్లాప్ అయినా కూడా.. రజినీకాంత్ సినిమాలు వస్తున్నాయి అంటే… ఆ సినిమాపై భారీ అంచనాలుంటాయి. మరోపక్క ఇతర హీరోలు రజినీకాంత్ చిత్రాలతో పోటీ పడలేక మరో డేట్ చూసుకునేంత క్రేజ్ రజినీకాంత్ ది. ప్రస్తుతం ఆయన ‘లింగా, కబాలి’ వంటి ప్లాప్స్ లో ఉన్నాడు. అయినప్పటికీ ఆయన తాజా చిత్రం ‘కాలా’ మీద భారీ అంచనాలు, పిచ్చ క్రేజ్ ఉంది. ఎంత క్రేజ్ అంటే… కొన్ని చోట్ల ‘కాలా’ సినిమా విడుదల సందర్భంగా పలు కంపెనీలు తమ ఉద్యోగులకు సెలవులు ప్రకటించేంతటి క్రేజ్. రజినీకాంత్ స్టయిల్, మ్యానరిజం, డైలాగ్ డెలివరీ ఇలా ప్రతి విషయంలోనూ రజినీతో పోటీపడే వారెవరు లేరంటే నమ్మాలి. గతంలో తనకి ‘కబాలి’ వంటి ప్లాప్ ఇచ్చిన దర్శకుడు పా రంజిత్ కి ‘కాలా ‘సినిమాతో మరో అవకాశం ఇవ్వడం అనేది గొప్ప విషయమే. మరి రంజిత్ పా చెప్పిన ‘కాలా’ స్టోరీ రజినీకాంత్ ఆయన అల్లుడు ధనుష్ కి ఎంతగా నచ్చకపోతే.. ‘కబాలి’ ప్లాప్ తో ఉన్న రంజిత్ పా కి మరో అవకాశం ఇస్తారు. ఇక రంజిత్ పా కూడా ఈ సినిమాతో రజినీకాంత్ కి హిట్ ఇచ్చి ‘కబాలి’ తో వచ్చిన తన బ్యాడ్ రిమార్క్ ని చెరిపేసుకోవాలని.. ఆరాటపడుతున్నారు. ఇక రజినీకాంత్ కూడా సినిమాలు మీద సినిమాలు చేసేసి తొందరగా రాజకీయాల్లోకి వెళ్లాలని చూస్తున్నాడు. మరోపక్క మామగారి ఫెమ్ ని క్యాష్ చేసుకోవాలని అల్లుడు ధనుష్ కాచుకుని కూర్చున్నాడు. మరో పక్క కర్ణాటక లో కావేరి జలాల సమస్య వల్ల అక్కడ కోర్టు అనుమతులున్నా ‘కాలా’ విడుదలవుతుందో లేదో అనే అనుమానాలు ఉన్నాయి. మరి అనేక అడ్డంకులు దాటుకుని నేడు గురువారం భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులముందుకు వచ్చిన ‘కాలా’ సినిమా ప్రేక్షకుల అంచనాలు అందుకుందో లేదో సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

ఏషియన్ కంట్రీస్ లోనే అతిపెద్ద స్లమ్ ఏరియా ముంబైలోని ధారవి ప్రాంతం. ఆ స్లమ్ ఏరియా లో ఎంతో మంది పేద ప్రజలు దీనావస్థలో బ్రతుకుతుంటారు. అక్కడివారిని ప్రభుత్వాలు పట్టించుకోవు. అదే స్లమ్ ఏరియాలో కారికాలన్ ఉరఫ్ కాలా(రజినికాంత్) అందరూ బాగుండాలని తపన పడుతుంటాడు. అక్కడి ప్రజల సమస్యలు పరిష్కారానికి… వారందరికీ నాయకుడవుతాడు. నలుగురు బాగుండాలని తపనపడే కాలాకి.. అక్కడ హరి దాదా (నానా పటేకర్) అనే ఒక రాజకీయ నాయకుడు వలన అనేక సమస్యలు వస్తాయి. హరి దాదా.. కాలా నివసించే ముంబై లోని ధారవి స్లమ్ ఏరియా పై కన్నేస్తాడు. ఎలాగైనా ఆ ప్రాంతాన్ని దక్కించుకోవాలని కుట్రలు పన్నుతుంటాడు. అందులో భాగంగానే… అక్కడి పేద వారికి మాయమాటలు చెప్పి ఆ స్థలాన్ని ఖాళీ చేయించాలనుకుంటాడు. కానీ కాలా మాత్రం అక్కడి ప్రజల్లో చైతన్యవంతం చేసి వారికి అండగా ఉంటాడు. అలాగే రాజకీయ నాయకుడు హరి దాదా ని ఎదుర్కోవడంలో జనాలను ఏకం చేస్తాడు. మరి అక్కడి ప్రజల సహాయంతో కాలా హరిదాదాని ఎలా ఎదుర్కున్నాడు? అసలు అక్కడి ప్రజలు కాలా మాట విన్నారా? బలమైన హరిదాదాపై కాలా ఎలాంటి విజయాన్ని సాధించాడు? అనేది మిగతా కాలా కథ.

నటీనటులు:

లుంగీ కట్టుకుని… నోటిలోని చుట్టతో రఫ్ గా అంటే ఊర మాస్ లుక్ లో రజినీకాంత్ లుక్స్ అబ్బబ్బ ఏమున్నాయి రా.. అందుకు కాదు రజినీకాంత్ అభిమాన గణం ఆ రేంజ్ లో ఉంది. ఇది పూర్తిగా రజని షో. నల్లని దుస్తుల్లో మురికివాడల హక్కుల కోసం పోరాడే నాయకుడిగా రజినీ అదుర్స్ అనిపించాడు రజినీకాంత్.. కరికాలన్ గా బాడీ లాంగ్వేజ్, స్టైలిష్ లుక్‌లో అదరగొట్టాడు. ప్రతీఫ్రేమ్‌లో రజినీ చరిష్మా, స్క్రీన్ ప్రజెన్స్ తెరపై గ్రాండ్‌గా కనిపిస్తుంది. అభిమానులు ఎక్స్ పెక్ట్ చేసిన విధంగా రజిని ఎంట్రీ లేకపోయినా….సింపుల్‌గా ఎంట్రీ ఇచ్చాడు. స్లమ్‌లో పేదవారి పక్షాన పోరాడే నాయకుడిగా అదరగొట్టాడు… వారి తరపున ప్రభుత్వాన్ని ఢీకొట్టే నాయకుడి పాత్రలో దుమ్ము దులిపాడు. దర్శకుడు రంజిత్ పా… రజినికి ఉన్న క్రేజ్ ని, స్టయిల్ ని కావాల్సినట్టుగా వాడేసుకున్నాడు. ఇక రజినీకాంత్ తన స్టయిల్ తో అదరగొడుతూనే.. పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీతో ఇరగదీసాడు. యాక్షన్ సీన్స్ లో ఎంతగా అదరగొట్టాడో… ఎమోషనల్ సీన్స్ లోను పెరఫార్మెన్స్ తో కట్టిపడేసాడు. అసలు మొత్తంగా చెప్పాలి అంటే… రొటీన్ కథని తన భుజాల మీద రజినీకాంత్ మోశాడు అంటే అతిశయోక్తి ఎక్కడా కనిపించదు. ఇక రజినీకాంత్ కి పోటీగా, రాజకీయ నేతగా నానాపటేకర్ నటన అద్భుతం. హరిదాదాగా నానా పటేకర్ నటన అదుర్స్. రజినీకాంత్ కి నానా పటేకర్ కి మధ్య ఉన్న సీన్స్ సినిమాకి హైలెట్ గా అనిపిస్తాయి. ఇక ఎన్జీవో సభ్యురాలిగా హ్యూమఖురేషి ఎంట్రీ బాగుంది. ఉన్నంతలో హ్యూమా ఖురేషి ట్రెడిషనల్ గా మెప్పించింది. ఇక రజినీకాంత్ వైఫ్‌గా ఈశ్వరీబాయ్ కూడా ఆకట్టుకుంది. మిగతా నటీనటులు తమ పరిధిమేర నటించి ఆకట్టుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు:

ఈ సినిమాకి సంతోష్ నారాయణ అందించిన మ్యూజిక్ వర్కౌట్ కాలేదు. అయితే పాటలు పూర్తిగా నిరాశపరచగా తన బలమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సంతోష్ నారాయణ్ సినిమాకి లైఫ్ ఇచ్చాడు. కాలా సాంగ్స్ ఎక్కడా ఆకట్టుకునేలా అనిపించలేదు. ఇకపోతే కాలా సినిమా కి మెయిన్ హైలెట్ అని చెప్పుకునేది… సినెమాటోగ్రఫీనే. మురళి అందించిన కెమెరా వర్క్ సూపర్ అనిపించేలా ఉంది. ఫ్లైఓవర్ ఫైట్, ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీన్స్, పోలీస్‌స్టేషన్ సీన్స్, మురికి వాడల్లో వచ్చే సీన్స్… ఇలా అన్ని విషయాల్లోనూ సినిమాటోగ్రఫీ చాల చాలా బావుంది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ విషయంలో మరికాస్త శ్రద్ద పెడితే బావుండేది. ఇక ఈ సినిమాకి మరో హైలెట్ ఆర్ట్ వర్క్. కాలా సినిమాకి ధనుష్ అందించిన నిర్మాణ విలువలు బావున్నాయి.

విశ్లేషణ:

కబాలి సినిమా వలె ఈ సినిమా కథను కూడా దర్శకుడు రంజిత్ పా చాలా రొటీన్ గానే రాసుకున్నాడు. కాలా కథ ఎప్పుడో 1990 లో వచ్చిన కథల్లానే ఉంది. ఇదే కథ తో కోకొల్లలుగా సినిమాలు తెరకెక్కాయి. అయితే దర్శకుడు కథలో కొత్తదనం లేకపోయినా రజినీకాంత్ స్టయిల్ తోనూ, తన టేకింగ్ తోనూ సినిమాని నడిపించెయ్యాలనుకుని.. అందులో చాలావరకు సక్సెస్ అయ్యాడు కూడా. కబాలి సినిమాలో రజినీకాంత్ ని సరిగా వాడలేకపోయిన రంజిత్ పా… కాలా లో కావాల్సినంతగా వాడేసాడు. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంపై రంజిత్ పా ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో వయసు మళ్ళిన పాత్ర కాబట్టి రజినీ మసాలా అంశాలకు ఎక్కువ చోటు లేకుండా పోయింది. విలన్ హీరో మధ్య హక్కుల కోసం జరిగే యుద్ధం కొత్త పాయింట్ కాదు. కానీ తనదైన టేకింగ్ తో రంజిత్ పా మెప్పించే ప్రయత్నం గట్టిగానే చేసాడు. అయితే సినిమాలో రెండు మూడు యాక్షన్ సీన్స్ అద్భుతంగా ఉన్నప్పటికీ కథ మొత్తం సింగల్ లైన్ మీద మరీ ఎక్కువ ట్విస్టులు లేకుండా సాగటం కొంత మైనస్ అయ్యింది. అందుకే స్లోగా వెళ్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక డైలాగ్స్ మాత్రం ఆకట్టుకునేలా రాసుకున్నాడు రంజిత్. ‘నేల నీకు అధికారం.. నేల మాకు జీవితం’ అనే డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక రజినీకాంత్, విలన్ నానాపటేకర్ మధ్య వచ్చే సీన్స్ అద్భుతంగా ఉన్నాయి. అన్నిటికి మించి రజినీ స్టయిల్, డైలాగ్ డెలివరీ కి ఫాన్స్ ఫిదా అవ్వడం ఖాయం. మరి మామూలుగానే రజినీకాంత్ స్క్రీన్ మీద కనబడగానే వెర్రెక్కి విజిల్స్ వేసే అభిమానులు…. ఈ సినిమా లో రజిని నల్ల లుంగి, చొక్కా, నోటిలోని చుట్టకు పడిపోవడం ఖాయమే. చివరిగా రంజిత్ పా.. డైరెక్షన్ పర్వాలేదు అనే కన్నా… రజినీకాంత్ వన్ మ్యాన్ షో అని చెప్పడం కరెక్ట్.

ప్లస్ పాయింట్స్: రజినీకాంత్ నటన, స్టయిల్, ఇంటర్వెల్ బ్లాక్, డైలాగ్స్, నానా పటేకర్, క్లైమాక్స్, సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్: రొటీన్ కథ, స్లో నేరేషన్, మ్యూజిక్, ఎమోషన్స్, ఎడిటింగ్,

రేటింగ్: 2.5/5

Sandeep
About Sandeep 6186 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*