కవచం మూవీ రివ్యూ

Kavacham Review Telugu movie News

నటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మెహ్రీన్ కౌర్, నీల్ నితిన్ ముఖేష్, హర్షవర్ధన్ రాణే, సత్యం రాజేష్, పోసాని కృష్ణ మురళి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: ఎస్.ఎస్.థమన్
సినిమాటోగ్రఫీ: ఛోటా. కె. నాయుడు
ఎడిటింగ్: ఛోటా. కె. ప్రసాద్
నిర్మాతలు: నవీన్
దర్శకత్వం: శ్రీనివాస్ మామిళ్ళ

డబ్బుంటే హీరో అయిపోవొచ్చు, బ్యాగ్రౌండ్ ఉంటే ఇండస్ట్రీలో చక్రం తిప్పొచ్చు అనే రోజులు పోయాయి. చాలామంది ఫిల్మీ బ్యాగ్రౌండ్ తో వచ్చినా హీరోలుగా నిలదొక్కుకోలేక సైడ్ అయ్యారు. కానీ బెల్లంకొండ సురేష్ మాత్రం తన కొడుకుని స్టార్ హీరోగా నిలబెట్టే వరకు నిద్ర పోకూడదని కంకణం కట్టుకున్నాడు. కొడుకు శ్రీనివాస్ కోసం ఈ భారీ నిర్మాత స్టార్ డైరెక్టర్స్ ని, స్టార్ హీరోయిన్స్ ని, స్టార్ నిర్మాతలను పట్టుకోవడం… శ్రీనివాస్ ని హీరోగా స్టార్ డం తెచ్చి పెట్టే సినిమాలు చెయ్యడం…. ఒకటి కాదు రెండు కాదు.. ఇప్పటికి ఒకదాని తర్వాత ఒకటి నాలుగు సినిమాల నుండి అదేపని చేస్తున్నాడు. మరి బెల్లంకొండ మీద భారీ బడ్జెట్ పెట్టడం, భారీ హీరోయిన్స్ ని తేవడం అనేది వృధా ఖర్చే అవుతుంది. ఎందుకంటే శ్రీనివాస్ చిత్రాలన్నీ యావరేజ్ బోర్డర్ దాటడం లేదు. సూపర్ హిట్ అయిన చిత్రాలే కనబడ్డం లేదు. అయినా హిట్స్ తో సంబంధమే లేకుండా బెల్లంకొండ శ్రీనివాస్ ఎడాపెడా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఒక కొత్త దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ.. కవచం అనే పవర్ కథతో టాప్ హీరోయిన్స్ అయిన కాజల్ అగర్వాల్ తో కలిసి మరో హీరోయిన్ మెహ్రీన్ తోనూ రొమాన్స్ చేసాడు. మరి మీడియం బడ్జెట్ తో భారీగా నిర్మించిన ఈ సినిమా నేడు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో శ్రీనివాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనబడనున్నాడు. మరి గ్లామర్ డాల్స్ కాజల్, మెహ్రీన్ ల క్రేజ్ బెల్లంకొండ కి ఏ మాత్రం హెల్ప్ అయ్యిందో… ప్రతి సినిమాని యావరేజ్ తోనే సరిపెట్టుకుంటున్న శ్రీనివాస్ ఈ చిత్రంతో అయినా హిట్ అందుకుంటాడో.. లేదో అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

విజయ్ ( సాయి శ్రీనివాస్) వైజాగ్ లో ఎస్ఐగా్ విధులు నిర్వర్తిస్తూ ఉంటాడు. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ కావాలని కలలుకంటూ ఉంటాడు. అయితే అనుకోకుండా సంయుక్త(మెహ్రీన్)ని కొందరు వెంటాడుతుండగా వాళ్ల నుండి కాపాడి ఇంటికి తీసుకువెళ్తాడు. అప్పుడే తన తల్లికి పెద్ద యాక్సిడెంట్ కావడంతో ఆపరేషన్‌ కోసం 50 లక్షలు అవసరం పడతాయి. అయితే శ్రీనివాస్ ప్రాబ్లెమ్ ని అర్ధం చేసుకున్న సంయుక్త తనను కిడ్నాప్ చేసినట్టుగా నాటకం ఆడితే వాళ్ల మామయ్య(ముఖేష్ రుషి) యాభై లక్షలు ఇస్తాడని… అందుకే నాటకం ఆడమంటుంది. తన దగ్గర డబ్బు లేకపోవడం… విధిలేని పరిస్థితుల్లో సంయుక్తతో కిడ్నాప్ నాటకం ఆడతాడు విజయ్. కానీ సంయుక్తతో కిడ్నాప్ నాటకమాడుతున్న విజయ్ సమస్యల్లో ఇరుక్కుని ఉద్యోగాన్ని కోల్పోతాడు. కిడ్నప్ మాత్రమే కాకుండా.. మరిన్ని సమస్యల్లో ఉన్న విజయ్ పోలీసుల నుండి తప్పించుకుని తిరుగుతుంటాడు. అయితే తనతో కిడ్నాప్ నాటకమాడింది సంయుక్త కాదని.. ఆమె అసలు పేరు లావణ్య అని విజయ్ తెలుసుకుంటాడు. అయితే సంయుక్త(కాజల్) తాను గతంలో ప్రేమించి కనిపించకుండా పోయిన అమ్మాయే అని తెలుసుకుంటాడు. ఇంతకీ లావణ్య ఎవరు..? సంయుక్త ఎవరు..? లావణ్యకి, సంయుక్తకి మధ్యనున్న సంబంధం ఏమిటి..? విజయ్ ని ఎందుకు సమస్యల్లోకి నెట్టేస్తారు? ఆ సమస్యల నుండి విజయ్ బయటపడగలడా? అనేది కవచం మిగతా కథ.

నటీనటుల నటన:

విజయ్ గా ఎస్సై పాత్రలో బెల్లంకొండ మంచి ఫిజిక్ తో బాగానే సెట్ అయ్యాడు. హైట్, వెయిట్ అన్ని విషయాల్లో బెల్లంకొండ శ్రీనివాస్ పర్ఫెక్ట్ గానే సెట్ అయ్యాడు. కానీ శ్రీనివాస్ నటించే సినిమాల్లో డైలాగ్‌ల్లో పవర్ ఫుల్ నెస్ ఉన్నప్పటికీ… డైలాగ్ డెలివరీలో మాత్రం బెల్లంకొండ తేలిపోతూ కనిపిస్తున్నాడు. ఇప్పటికే నాలుగైదు సినిమాల్లో నటించినా.. ఇంకా నటనలో మెళుకువలు నేర్చుకునే స్టూడెంట్ గానే బెల్లంకొండ కనిపిస్తున్నాడు కానీ.. నటనలో పరిణితి కనబడ్డం లేదు. ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించిన మెహ్రీన్, కాజల్ అగర్వాల్ లు గ్లామర్ డాల్స్ గా అదరగొట్టేసారు. కాజల్.. నటన పరంగా తనకు తిరుగులేదని స్టార్ హోదాను కాపాడుకునే ప్రయత్నమైతే చేసింది. అయితే రొటీన్ కథలో కాజల్ నటనకు ఆస్కారం లేకపోయింది. ఇక కథలో కీలక పాత్రలో నటించిన మెహ్రీన్ ని నెగిటివ్ షేడ్స్‌ లో చూపించారు. కాజల్ తో పాటుగా మెహ్రీన్ సినిమాలో కీలకమైన… నటనకు స్కోప్ లేని పాత్రల వలన ఇద్దరు హీరోయిన్స్ తేలిపోయారనిపిస్తుంది. హరీష్ ఉత్తమన్ ఏసీపీ‌గా కీలకపాత్రలో కనిపించారు. ఇక విలన్ గా నీల్ నితిన్ పాత్ర కూడా అంతంత మాత్రమేగానే డిజైన్ చేశారు. ఇక ముఖేష్ రుషి, పోసాని క్రిష్ణ మురళి లాంటి సీనియర్ నటులు ఉన్నా వాళ్లను పెద్దగా ఉపయోగించుకోలేకపోయాడు దర్శకుడు.

సాంకేతిక వర్గం పనితీరు:

ఈ మధ్యనే కాస్త ఫామ్ లోకొచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ థమన్.. మళ్లీ మూస పద్ధతిలోకి వెళ్ళిపోయాడు. ఒకే ఒక్క పాటకు కాస్త ఆకట్టుకునే సంగీతమిచ్చిన థమన్… నేపధ్య సంగీతంలోనూ తేలిపోయాడు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కి థమన్ పెట్టింది పేరు. ఆ విషయంలోనూ థమన్ మ్యూజిక్ మ్యాజిక్ చెయ్యలేకపోయింది. ఇక కెమెరామెన్ చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి ప్లస్ అయ్యింది. విశాఖ అందాలను కెమెరాలో అందంగా బంధించిన చోటా… పోలీస్ ఆఫీసర్‌గా శ్రీనివాస్‌ను స్టైలిష్‌గా చూపించాడు. ఇక గ్లామర్ డాల్ కాజల్‌ని మరింత అందంగా చూపించాడు. అయితే ఈ సినిమాకి మెయిన్ మైనస్ ఎడిటింగ్. ఎడిటింగ్ లో చాలా కత్తెర్లు పడాల్సిన సీన్స్ ని యదాతథంగా ఉంచేశారు అనిపిస్తుంది. సినిమా రన్ టైమ్ కూడా ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులు బోర్ ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఇక నిర్మాణ విలువల విషయంలో మెచ్చుకోవలసిందే. ఎక్కడా తగ్గకుండా ఈ సినిమాకి ఖర్చు పెట్టారు నిర్మాతలు. కానీ బెల్లంకొండ శ్రీనివాస్ మీద అంత ఎందుకు పెట్టారో అనేది మరోసారి అనిపించకమానదు.

విశ్లేషణ:

ఇప్పటివరకు బెల్లకొండ శ్రీనివాస్ పేరున్న డైరెక్టర్స్ తోనే సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ మొదటిసారి.. ఒక కొత్త దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ళ తో సినిమా చేసాడు. పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్స్ తో హిట్ కొట్టలేకపోయిన బెల్లంకొండ ఈ కుర్ర కొత్త డైరెక్టర్ తో హిట్ కొట్టాలనుకున్నాడు. శ్రీనివాస్ మామిళ్ళ కొత్త కథ అంటూ రొటీన్ కథనే శ్రీనివాస్ కి వినిపించాడు. మరి రొటీన్ కథనే ఫైనల్ చేసిన శ్రీనివాస్… శ్రీనివాస్ మామిళ్ళ దర్శకత్వం మీద నమ్మకం పెట్టుకున్నాడు. కానీ శ్రీనివాస్ మామిళ్ళ రొటీన్ కథతో రొటీన్ సినిమా కవచం ని చేసాడు. పాత చింతకాయ పచ్చడి మాదిరి వచ్చిన కథల్నే కొద్దిగా అటు ఇటు మార్చి ఈ కవచం సినిమాని ప్రేక్షకుల మీదకి వదిలాడు దర్శకుడు. సినిమా మొదలైన తొలి పది నిమిషాల్లోనే సినిమా ఎలా ఉండబోతుందనే హింట్ ఇచ్చేశాడు దర్శకుడు. అసలు కథ మొత్తం హీరోయిజాన్ని ఎలివేట్ చేసే విధంగా ఉండడంతోనే ఈ కథ బెల్లంకొండ శ్రీనివాస్ ని బాగా ఇంప్రెస్స్ చేసుంటుంది. అందుకే రొటీన్ కథ అయినా కళ్లు మూసుకుని సినిమా ఒప్పేసుకునేందనిపిస్తుంది ఈ కవచం చూసిన ప్రతి ఒక్కరికి. భారీ డైలాగ్‌లో హీరో ఎంట్రీ ఇవ్వడం వెంటనే.. హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ ఇంట్రో సాంగ్.. ఆ వెంటనే హీరోయిన్ వెంటాడుతూ విలన్లు రావడం.. వాళ్లను హీరో చితక్కొట్టేసి హీరోయిన్‌ని కాపాడేయడం. ఇలాంటి నాటకీయత చిరాకు తెప్పిస్తుంది. ఇక క్లైమాక్స్ కూడా రొటీన్. అమ్మని, ప్రియురాలిని కాపాడడానికి విలన్ ప్లేస్ కి వెళ్లడం, విలన్ ని చితక్కొట్టి అమ్మను, లవర్ ని కాపాడెయ్యడం… మరి ఈ సినిమా చూస్తున్నంత సేపు బోలెడన్ని పాత సినిమాలు మన మదిలో మెదులుతాయి. ఇక దర్శకుడు స్క్రీన్ ప్లే లోనూ కొత్తదనం చూపించలేకపోయాడు. లేనిపోని ట్విస్ట్‌ లు, అక్కర్లేని సీన్లు, అనవసర పాత్ర పరిచయాలతో కొత్త దర్శకుడు ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్ చేసేసాడు. కవచంలో కొత్తదనం కనబడితే ఒట్టు అన్నట్టుగా బిల్డప్ మాత్రం ఎక్కడా తగ్గలేదు.

ప్లస్ పాయింట్స్: శ్రీనివాస్, కాజల్ అందాలు, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్: దర్శకత్వం, రొటీన్ కథ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్
రేటింగ్: 2.25/5

Sandeep
About Sandeep 6708 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*