@నర్తనశాల మూవీ రివ్యూ

బ్యానర్: ఐరా క్రియేషన్స్

నటీనటులు: నాగ శౌర్య, కాశ్మీర, యామిని భాస్కర్, శివాజీ రాజా, జయ ప్రకాష్ రెడ్డి, అజయ్, సత్యం రాజేష్, శైలజ ప్రియా

మ్యూజిక్ డైరెక్టర్: సాగర్ మహతి

సినిమాటోగ్రఫీ: విజయ్ కుమార్

ఎడిటింగ్: కోటగిరి

నిర్మాత: శంకర్ ప్రసాద్, ఉష

దర్శకత్వం: శ్రీనివాస్ చక్రవర్తి

హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతున్న నాగ శౌర్య కి తన సొంత బ్యానర్ లో తెరకెక్కించిన ఛలో సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. ఛలో సినిమా తెలుగు, తమిళుల మధ్యన గొడవలతో ఫన్నీగా తెరకెక్కి ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చెయ్యడం… చిన్న సినిమాగా తెరకెక్కి అద్భుతమైన కలెక్షన్స్ కొల్లగొట్టడంతో.. నాగ శౌర్య రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి నుండి నాగ శౌర్య ఆచీ తూచి కథలను ఎంపిక చేసుకుంటూ సినిమాలు ఓకె చేస్తున్నాడు. కణం సినిమాలో నాగ శౌర్య పాత్రకి ఎక్కువగా ప్రాధాన్యం లేకపోయినా.. ఆ సినిమా తెలుగు, తమిళంలో బాగా ఆడింది. ఇక సరైన ప్రమోషన్స్ లేక నాగ శౌర్య నటించిన అమ్మగారిల్లు కథ బావున్నప్పటికీ.. సినిమాకి కలెక్షన్స్ రాలేదు. ఆ సినిమా కేవలం ప్రమోషన్స్ లేకపోవడంతోనే… హిట్ కాలేకపోయింది. ఇక ఛలో తర్వాత మరోమారు తన ఓన్ బ్యానర్ లోనే శ్రీనివాస్ చక్రవర్తి అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ.. @నర్తనశాల అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో సినిమా చేసాడు. గతంలో ఎన్టీఆర్ నటించిన నర్తనశాల సినిమా సూపర్ హిట్. మరి అలాంటి టైటిల్ తో సినిమా అంటే సహజంగానే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఏర్పడింది. అలాగే @నర్తనశాల ప్రమోషన్స్ తోనూ సినిమా మీద ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. మరి ‘గే’ గా మొదటిసారి ట్రై చేసిన నాగ శౌర్య కి @నర్తనశాల ఎలాంటి విజయాన్ని అందించింది… ఛలో సినిమా లాగా @నర్తనశాలతో… ఎలాంటి లాభాలు మూటగట్టుకున్నారో సమీక్షలో చూసేద్దాం.

కథ

కళామందిర్ కళ్యాణ్ (శివాజీరాజా) కి అమ్మాయిలంటే చాలా ఇష్టం. ఇక కళ్యాణ్ వాళ్ళ తండ్రికి కూడా కళ్యాణ్ కి అమ్మాయి పుట్టాలని కోరిక ఉంటుంది. కానీ కళ్యాణ్ కి అబ్బాయి పుడతాడు. అయితే తనకి అబ్బాయి పుట్టాడనే విషయం తెలిస్తే అనారోగ్యంతో తన తండ్రి చనిపోతాడని చిన్నప్పటి నుంచి కొడుకు నాగశౌర్యను అమ్మాయిలా పెంచుతాడు కళ్యాణ్ . దీంతో అతనికి అమ్మాయిలపై ‘ఆ’ ఫీలింగ్ కలగదు. అయితే మహిళల జీవితాల్లో ఎదుర్కుంటున్న సమస్యలను చూసిన నాగ శౌర్య మహిళల కోసం సెల్ఫ్ – డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్ ని స్టార్ట్ చేస్తాడు. తమను తాము కాపాడుకునే విధంగా మహిళలకు శిక్షణ ఇస్తూ ఉంటాడు. అయితే తన కొడుక్కి ఎలా అయినా పెళ్లి చేయాలని కళ్యాణ్ ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో మానస (కశ్మీర పరదేశి), నాగశౌర్య ఒకరినొకరు ఇష్టపడతారు. మరోవైపు అనుకోకుండా నాగశౌర్యను కలిసిన రాయుడు (జయప్రకాశ్‌రెడ్డి) కూతురు సత్య (యామిని భాస్కర్) తొలి చూపులోనే ప్రేమలో పడిపోతుంది. తన కొడుకు ప్రేమించింది సత్యనే అనుకుని పొరపాటు పడిన కళ్యాణ్.. నాగశౌర్యకు చెప్పకుండా రాయుడితో సంబంధం కుదుర్చుకుంటాడు. ఆ తరవాత ఏం జరిగింది..? నాగశౌర్య ‘గే’గా ఎందుకు మారతాడు..? మానసని ప్రేమించిన.. నాగ శౌర్య ఆమెని పెళ్లి చేసుకుంటాడా? మరి నాగ శౌర్య, సత్య ని ఎలా మేనేజ్ చేసాడు? అనే విషయాలు @నర్తనశాల సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల నటన:

ఎప్పుడు స్మార్ట్ లుక్స్ లో కనబడే నాగ శౌర్య మొదటిసారి ‘గే’ గా నటించి షాకిచ్చాడనే చెప్పాలి. అయితే ‘గే’ గా నాగ శౌర్య బాగా ఆకట్టుకున్నాడు. సినిమా సినిమాకు తన నటనలో కూడా మార్పులు చేస్తూ మెప్పిస్తున్నాడు. నర్తనశాల సినిమాలో కూడా నటనపరంగా ఈ హీరో పాజిటివ్ టాక్ తెచ్చుకుంటున్నాడనే చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమా సెకండ్ హాఫ్ లో అతను గే పాత్రలో మంచి కామెడీని పండించాడు. హీరోయిన్లు కశ్మీర, యామిని పాత్రలకు పెద్ద స్కోప్ లేదు. ఉన్నంతలో బాగానే చేశారు. ముఖ్యంగా పాటల్లో వీళ్లిద్దరూ తమ గ్లామర్‌తో ఆకట్టుకున్నారు. కనిపించినప్పుడల్లా… ఇద్దరు అందంగా కనిపించారు. ఇక సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది శివాజీరాజా, జయప్రకాశ్‌రెడ్డి పాత్రల గురించి. జయప్రకాశ్‌రెడ్డి మరోసారి తన మార్క్ రాయలసీమ యాసలో అదరగొట్టారు. కాకపోతే ఆయన్ని వాడుకోవడంలో దర్శకుడు విఫలమయ్యాడు. ఇక శివాజీ రాజా కళామందిర్ కళ్యాణ్ పాత్రలో మెప్పించినా.. కొన్నిచోట్ల అతని నటన అతిగా అనిపిస్తుంది. ఇక మరో ‘గే’ పాత్రలో అజయ్ ఆకట్టుకున్నాడు.

విశ్లేషణ:

కథలో పట్టులేకపోయినా.. కొన్ని సినిమాలు కామెడీతోనే హిట్ అవుతాయి. అసలు దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి తీసుకున్న కథలో కొత్తదనం లేకపోయినా… ‘గే’ అనే పాత్రని కథలో పెట్టి కామెడీతో సినిమాని హిట్ చేద్దామనుకున్నారు. కానీ శ్రీనివాస్ చక్రవర్తి అనుకున్న విషయం రివర్స్ అయ్యింది. చిరాకు పుట్టించే కామెడీ, ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించే సన్నివేశాలను సినిమా నిండా నింపేసిన దర్శకుడు… స్టోరీ‌లైన్‌ను కాస్త ఆసక్తికరంగా రాసుకున్నప్పటికీ దాన్ని అంతే ఆకర్షణీయంగా తెరపై చూపించలేకపోయాడు. ఫస్ట్ హాఫ్‌లో హీరోహీరోయిన్ల పరిచయం, వారి ప్రేమకథ, కొన్ని కామెడీ సన్నివేశాలను చూపించిన దర్శకుడు.. ఇక సెకండ్ హాఫ్‌ను మరీ సాగదీసి సహనానికి పరీక్షా పెట్టాడు. సెకండ్ హాఫ్ తెలుగులో వచ్చిన చాలా సినిమాలను గుర్తుచేస్తుంది. శ్రీనివాస్ చక్రవర్తి రాసుకున్న డైలాగులు కూడా ఆకట్టుకునే విధంగా లేవు. పాటలు బాగున్నప్పటికీ సినిమాలో లీనమవని ప్రేక్షకుడు వాటిని పూర్తిగా ఆస్వాదించలేడు. కళ్యాణ్, పూజారి మధ్య వచ్చే కృష్ణా సన్నివేశాలు కూడా ప్రేక్షకుడిని ఇరిటేట్ చేస్తాయి. ఫస్ట్ హాఫ్ కొంతవరకు బాగానే ఉంటుంది. ఇక ఇంటర్వెల్ బ్లాక్ లో వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. అయితే సెకండ్ హాఫ్ లో మాత్రం పూర్తిగా అనుకున్నంత స్థాయిలో సినిమా ఆకట్టుకోలేకపోయింది. అజయ్ నాగశౌర్య మధ్య వచ్చిన కొన్ని సన్నివేశాలు కథనంలో భాగమై కాస్త కామెడీని పండించాయి. అసలు ప్రేమించిన అమ్మాయి కోసం పెద్దలను ఒప్పించడానికి ఏదో విధంగా అమ్మాయి కుటుంబలో తిష్ట వేసి వారిని ఒప్పించడం అనేక సినిమాల్లో చూసినా… ఇందులో హీరోని గే గా చూపించి కామెడీ పండించేయ్యాలనుకున్న దర్శకుడి ప్రయత్నం పూర్తిగా బెడిసి కొట్టిందని చెప్పాలి. ఛలో తో ఫామ్ లోకొచ్చిన నాగ శౌర్య కి ఈ @నర్తనశాల కథ విషయంలో చాలా రాంగ్ స్టెప్ వేసాడని చెప్పాలి.

సాంకేతిక వర్గం పనితీరు:

ఈ సినిమాలో పాటలు బావున్నాయన్నప్పటికీ.. కథలో లీనం కాని ప్రేక్షకుడు పాటలను ఎంజాయ్ చేసే మూడ్ లో లేకపోవడంతో… ఈ సినిమాకి మ్యూజిక్ మైనస్ లా కనిపించింది. కానీ పాటల చిత్రీకరణ కూడా అద్భుతంగా ఉండనే చెప్పాలి. మహతి సాగర్ మ్యూజిక్ లో లీనం కాకపోయినా… నేపధ్య సంగీతం కాస్త హెల్ప్ అయ్యిందనే చెప్పాలి.ఇక ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణ సినెమాటోగ్రఫీనే. పాటల చిత్రకరణ కానివ్వండి.. మిగతా విషయాల్లోనూ ఈ సినిమాకి సినెమాటోగ్రఫీనే హైలెట్. కోటగిరి వెంకటేశ్వరరావు లాంటి సీనియర్ ఎడిటర్ ఈ సినిమాకు పనిచేశారు. సినిమాను మరీ ఎక్కువగా సాగదీయకుండా బాగానే ఎడిట్ చేశారు. కానీ కథ, కథనంలో పట్టులేకపోవడం.. ఎడిటింగ్ ని మైనస్ చేసింది. అక్కడక్కడా మరికొన్ని సీన్స్ లేపేస్తే సినిమాకి మరికాస్త హెల్ప్ అయ్యేది. ఇక ఓన్ బ్యానర్ కాబట్టి నిర్మాణ విలువలు రిచ్ గానే ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్: జయ ప్రకాష్ రెడ్డి, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్: కథ, కథనం, దర్శకత్వం, ఎడిటింగ్, పాటలు, చికాకు పుట్టించే కామెడీ

రేటింగ్: 2.0/5