ఆఫీసర్ మూవీ రివ్యూ

ప్రొడక్షన్ కంపెనీ: వర్మ కంపెనీ బ్యానర్
నటీనటులు: నాగార్జున, మైరా సరీన్, బేబీ కావ్య, అజయ్, ఫిరోజ్ అబ్బాసీ తదితరులు
స్క్రీన్ ప్లే: రామ్ గోపాల్ వర్మ
మ్యూజిక్ డైరెక్టర్: రవి శంకర్
ప్రొడ్యూసర్: రామ్ గోపాల్ వర్మ, సుధీర్ చంద్ర పదిరి
డైరెక్టర్: రామ్ గోపాల్ వర్మ

రామ్ గోపాల్ వర్మతో నాగార్జున సినిమా అంటే అందరిలో ఒకింత ఆశ్చర్యం… అలాగే ఒకింత ఆసక్తి. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ తో నాగార్జున ఒకప్పుడు శివ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. అలాగే వారి కాంబోలో గోవిందా గోవిందా అనే సినిమా వచ్చింది. అది కూడా మంచి హిట్ అయిన సినిమానే. అయితే అలాంటి కాంబో లో మళ్ళీ సినిమా అంటే.. అటు ట్రేడ్ వర్గాల్లోనూ.. ఇటు ప్రేక్షకుల్లోనూ విపరీతమైన ఆసక్తి ఏర్పడాలి. కానీ రామ్ గోపాల్ వర్మ కు ప్రస్తుతమున్న ట్రాక్ రికార్డుకి.. నాగార్జున అవకాశం ఇవ్వడం అనేది ఎవరికీ మింగుడు పడని విషయం. మరి ఏ హీరోల్లో వర్మ మీద నమ్మకం లేనప్పుడు నాగార్జున వర్మ చెప్పిన కథకి కనెక్ట్ అయ్యి వర్మని పిలిచి అవకాశం ఇవ్వడమే ఎక్కువ. ఒకప్పుడు శివ సినిమాలో రామ్ గోపాల్ వర్మ నాగార్జున కి చైన్ చేతికిచ్చి మంచి రఫ్ లుక్ తో అదరగొట్టించాడు. స్టూడెంట్ గా వున్న ఒక కుర్రాడు అనుకోని పరిస్థితుల్లో గుండాలను ఎదురిస్తూ సైకిల్ చైన్ తో తన చుట్టూ ఉన్నవాళ్ళని కాపాడుతూ ఉండే పాత్రలో నాగార్జున అదరగొట్టెయ్యడమే కాదు… ఆ సినిమాతో నాగ్ స్టార్ హీరోగా మారాడు. అందుకేనేమో నాగార్జున రామ్ గోపాల్ వర్మ ని నమ్మి ఆఫీసర్ తో ఒక అవకాశం ఇచ్చాడు. ఇక రామ్ గోపాల్ వర్మ సినిమా విడుదలవుతుంది అంటే.. ఏదో ఒక కాంట్రవర్సీ అనేది ఉంటుంది. కానీ నాగార్జున మీదున్న గౌరవంతో వర్మ ఈసారి కాంట్రవర్సీల జోలికి పోలేదు. మరీ ఓ అన్నంత అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమాకి వర్మ ఎంత వరకు న్యాయం చేసాడు? మరి శివ తో అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన నాగ్ – వర్మ లు ఇప్పుడు ఈ ఆఫీసర్ సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశారు? అనే విషయాన్నీ సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

సిటీలో కొన్ని ఫేక్ ఎన్కౌంటర్స్ జరుగుతుంటాయి. అయితే ఆ ఫేక్ ఎన్కౌంటర్స్ ని పోలీస్ ఆఫీసర్ అయిన నారాయణ పసారి చేస్తాడు. ఇవి ఫేక్ ఎన్కౌంటర్స్ అని తెలిసిన డిపార్ట్మెంట్ ఆ కేసు ఇన్వెస్టిగేషన్ బాధ్యతలు ఐపీఎస్ ఆఫీసర్ అయిన శివాజీ రావు(నాగార్జున) కి అప్పగిస్తుంది. అయితే నారాయణ పసారి చేసింది ఫేక్ ఎన్కౌంటర్ అని శివాజీ రావు కనిపెట్టేస్తాడు. ఆ క్రమంలోనే నారాయణ పసారిని దోషిగా జైలుకి పంపిస్తాడు. అయితే నారాయణ పసారి కేసులో తగిన సాక్ష్యాధారాలు చూపలేదని సాకుతో కోర్టు నారాయణని నిర్దోషిగా విడుదల చేస్తుంది. అలా బయటికి వచ్చిన నారాయణ కొన్నాళ్లు సైలెంట్ గా ఉండి శివాజీ పర్సనల్ లైఫ్ ని టార్గెట్ చేస్తాడు. అందులో భాగంగానే నారాయణ.. శివాజీ కూతుర్ని కిడ్నాప్ చేస్తాడు. శివాజీ కూతుర్ని అడ్డుపెట్టుకుని అనేక రకాల సమస్యలు సృష్టిస్తాడు. మరి శివాజీ అటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా నారాయణని ఎలా పట్టుకుంటాడు? నారాయణ చెరలో ఉన్న తన కూతుర్ని శివాజీ ఎలా విడిపించాడు? అసలు నారాయణ వలన వచ్చిన సమస్యలను శివాజీ ఎలా ఎదుర్కున్నాడు? అటు పర్సనల్ లైఫ్ ని, ఇటు డ్యూటీని శివాజీ ఎలా హ్యాండిల్ చేసాడు? అనేది ఆఫీసర్ కథ.

నటీనటుల నటన:

నాగార్జున ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా హ్యాండ్సమ్ లుక్ తో అదరగొట్టేసాడు. నాగార్జున గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో చాలా యంగ్ గా అందం గా కనబడ్డాడు. అసలు మేకప్ లేకుండా నటించినప్పటికీ.. నాగార్జున లుక్స్ మాత్రం చాలా యంగ్ అండ్ ఎనర్జిటిక్ గా ఆకట్టుకున్నాయి. నాగార్జున లుక్ అండ్ ఎనర్జీ సినిమాకే హైలెట్ అనేలా ఉన్నాయి. యాక్షన్ సన్నివేశాల్లో కూడా నాగార్జున సూపర్ అనిపించేలా అదరగొట్టాడు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంటే ఇలానే ఉంటాడు అనిపించేలా నాగ్ పాత్రని వర్మ డిజైన్ చేసాడు. అందుకేనేమో నాగార్జున ఆఫీసర్ కథకి అంతలా కనెక్ట్ అయ్యాడు. ఇక హీరోయిన్ మైరా సరీన్ ను గ్లామర్ పరంగా వాడుకోలేదు. యాక్షన్ పార్ట్ కే పనికి వచ్చింది. సీరియస్ పోలీస్ అధికారిగా పర్వాలేదనిపించింది. ఇక ముఖ్యంగా నాగార్జున కూతురిగా నటించిన బేబీ కావ్య బాగా మెప్పించింది. ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ కానివ్వండి, లుక్స్ కానివ్వండి బేబీ కావ్య అన్నిటిలో బాగుంది. ఇక నాగ్ పాత్రకి ధీటుగా ఉంటుంది విలన్ నారాయణ పాత్ర. విలన్ పాత్రలో నారాయణ చెలరేగిపోయాడనే చెప్పాలి. సినిమాకి నారాయణ పాత్ర ప్లస్ అయ్యిందనే చెప్పాలి. ఇక అజయ్ వంటి నటీనటులు తమ పరిధి మేర నటించి ఆకట్టుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు:

ఈ సినిమాకి సంగీతం అందించిన రవి శంకర్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపించారు. కొన్ని యాక్షన్ సీన్స్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. ఇక ఈ సినిమా కి సినిమాటోగ్రఫీ మెయిన్ మైనస్. సినిమాటోగ్రఫీ చెత్తగా అనిపిస్తుంది. కొన్నిచోట్ల సినిమాటోగ్రఫీ బాగుంది అనిపించినా… చాలా చోట్ల కెమెరా పనితనం పేలవంగా వుంది. ఎడిటింగ్ కూడా అంతగా ఆకట్టుకునేలా లేదు. చాలా సీన్స్ కి కత్తెరవెయ్యాల్సింది. ఎడిటింగ్ మీద హీరో, దర్శకుడు తగిన శ్రద్ద పెట్టాడనిపించలేదు. ఇక రామ్ గోపాల్ వర్మ, అతని కంపెనీ బ్యానర్ మీద ఈ సినిమాని నిర్మించాడు. మరి నిర్మాణ విలువలు కూడా ఓ అన్నంతగా అనిపించలేదు.

విశ్లేషణ:

నిత్యం వివాదాల్లో ఉండే రామ్ గోపాల్ వర్మ సక్సెస్ ని చూసి ఏళ్లు గడుస్తున్నాయి. ఎన్ని సినిమాలు చేసినా.. సక్సెస్ అనేది మాత్రం రామ్ గోపాల్ వర్మ దరి చేరడం లేదు. గతంలో శివ వంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన వర్మ నుండి ఇప్పుడు సినిమా వస్తుంది అంటే… జనాలు భయపడే స్టేజ్ లో ఉంటున్నాయి వర్మ సినిమాలు. ఇక శివ వంటి బ్లాక్ బస్టర్ కాంబోలో ఆఫీసర్ సినిమా వస్తుంది అంటే… ఆసినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలుండాలి. కానీ ఆఫీసర్ సినిమా మీద ఎలాంటి అంచనాలు పెరగలేదు. కారణం వర్మ. ఇక పాయింట్ లోకొస్తే… ఒక ఎన్కౌంటర్ గురించి హైదరాబాద్ నుంచి ముంబై వచ్చిన ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కథే ఈ సినిమా. సింగల్ లైన్ అనిపించినప్పటికీ కథనం మీద దృష్టి పెట్టిన వర్మ దానికి తగ్గట్టే ఒక యాక్షన్ థ్రిల్లర్ తరహాలో దీన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేసాడు. ఈ మధ్య కాలంలో చాలా సార్లు ఫెయిల్ అయిన వర్మ ఇందులో మళ్లీ తనదైన మార్కు చూపించే ప్రయత్నం అయితే చేసాడు. నాగార్జున లాంటి స్టార్ హీరో లేకలేక ఇచ్చిన అవకాశం కావడంతో శ్రద్ధ తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో ఇది బాగా గమనించవచ్చు. తన రెగ్యులర్ స్టైల్ ను కేవలం గంటకే ముగించిన వర్మ ఫస్ట్ హాఫ్ లో పూర్తిగా నిరాశ పరచలేదు. ఫాన్స్ కూడా కొంత మేర సంతృప్తి చెందేలాగే ఉంది. సెకండ్ హాఫ్ లో రెండు పోలీస్ గ్రూప్స్ మధ్య వార్ ని తెరకెక్కించిన వర్మ అందులోనే పాప పేరుతో సెంటిమెంట్ తో ఎమోషన్ ని ఇరికించే ప్రయత్నం చేసాడు. అసలు కామెడీ అనేది ఎక్కడా కనబడదు. మరి ఏమాత్రం ఆకట్టుకోలేని.. కథ, కథనంతో వర్మ మరోసారి ప్రేక్షకులకి ఫ్లాప్ ఇచ్చాడనే చెప్పాలి. ఈ సినిమా లో ఆకట్టుకునే కొన్ని అంశాలు ఏమిటంటే… నాగార్జున విలన్ నారాయణని పట్టుకోవడానికి వేసే ఎత్తులు సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాయి. అలా చిన్న విషయాలు తప్ప ఆఫీసర్ సినిమాలో చెప్పుకునే ప్లస్ పాయింట్స్ లేవంటే… ఈ సినిమా ఎలా ఉందో చెప్పెయ్యొచ్చు. మరి నాగార్జున – వర్మ ఇద్దరు శివ సినిమా హిట్ ని రిపీట్ చేస్తారనుకుంటే… ప్రేక్షకులకు ప్లాప్ నే అంటగట్టారు.

ప్లస్ పాయింట్స్: నాగార్జున, ఫస్ట్ హాఫ్, ఇక చెప్పుకోవడానికి ఏం లేవు

మైనస్ పాయింట్స్: కథ, కథనం, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, యాక్షన్ పార్ట్, కామెడీ లేకపోవడం

రేటింగ్: 2.0 /5

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*