పడి పడి లేచే మనసు మూవీ రివ్యూ

Padi Padi leche manasu review telugu post telugu news

బ్యానర్: శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్
నటీనటులు: శర్వానంద్, సాయి పల్లవి, ప్రియదర్శి, ప్రియా రామం, సుహాసిని, మురళి శర్మ, వెనీలా కిషోర్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: విశాల్ చంద్రశేఖర్
సినిమాటోగ్రఫీ: జయ్ కే
ఎడిటింగ్: ఏ. శ్రీకర్ ప్రసాద్
నిర్మాతలు: ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరుకూరి
డైరెక్టర్: హను రాఘవపూడి

మంచి మంచి కథలను ఎంచుకుంటూ.. ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకపోయినా… మీడియం హీరోగా ఇమేజ్ సంపాదించుకున్న శర్వానంద్ కి ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. స్టార్ హీరోలు రామ్ చరణ్ వంటి వారు శర్వానంద్ కి బాగా క్లోజ్. ఇక సినిమాల విషయం వచ్చేసరికి గత ఏడాది ‘రాధా’ సినిమా ఫ్లాప్, ‘మహానుభావుడు’ తో హిట్ కొట్టిన శర్వానంద్ ‘లై’ సినిమాతో డిజాస్టర్ అందుకున్న దర్శకుడు హను రాఘవపూడి కథను మెచ్చి సినిమాని పట్టాలెక్కించాడు. హను రాఘవపూడి మాస్ కథతో శర్వా దగ్గరికి వస్తే… శర్వానంద్ హనుని లవ్ స్టోరీతో సినిమా చేద్దామని చెప్పగా.. హను ఒక చక్కటి ప్రేమ కథను తయారు చేసి శర్వాని ఒప్పించి మరి ‘పడి పడి లేచే మనసు’ని పట్టాలెక్కించాడు. ఇక ఈ సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ హీరోయిన్ సాయి పల్లవి. సాయి పల్లవి నటన, డాన్సులు, ఆమె హావభావాలు అన్ని ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో పిచ్చ క్రేజ్ ని పెంచేసాయి. ఇక ట్రైలర్, ‘పడి పడి లేచే మనసు’ పాటలు, ఆహ్లాదంగా ఉండడంతో… సినిమా మీద ఆటోమాటిక్ గా ప్రేక్షకులకు ఆసక్తి పెరిగింది. ఇక ఈ సినిమాని నిర్మించిన నిర్మాతలు కూడా శర్వానంద్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకోకుండా మంచి బడ్జెట్ పెట్టారు. మరి ‘లై’ తో ప్రేక్షకులను ఆకట్టుకోలేని హను రాఘవపూడి ఈ ప్రేమ కథ ‘పడి పడి లేచే మనసు’తో ప్రేక్షకుల మనసు ని దోచేసాడా? ‘మహానుభావుడు’ హిట్ తో ఉన్న శర్వా మళ్ళీ ఈ సినిమాతో ఆ రేంజ్ విజయాన్ని అందుకుంటాడా? సాయి పల్లవి క్రేజ్ ఈ సినిమాకి ఎంతవరకు పనిచేసింది? అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ;
సూర్య (శ‌ర్వానంద్) ఫ్లాష్‌బ్యాక్‌తో సినిమా మొదలవుతుంది. సూర్య.. వైశాలి (సాయిప‌ల్ల‌వి) అనే అమ్మాయి వెంట‌ప‌డి, పిచ్చిగా ప్రేమిస్తాడు. డాక్టర్ అయిన వైశాలి కూడా సూర్య‌ను కొంచెం లెట్ గా ప్రేమించినా… మనస్ఫూర్తిగా సూర్యని ప్రేమిస్తుంది. చాలా గాఢంగా ప్రేమించుకున్న వైశాలి, సూర్యలు అనుకోకుండా విడిపోతారు. అసలు త‌ను లేక‌పోతే సూర్య ఏమైపోతాడో అనే విధంగా ప్రేమించే వైశాలి కొన్ని కారణాలతో సూర్య‌కు బ్రేకప్ చెప్పేసి.. ఇక నా లైఫ్‌లో సూర్య‌కు స్థానం లేద‌ని అత‌డిని వ‌దిలేస్తుంది. అయితే ఇదే విషయాన్ని.. పడి పడి లేచే ట్రైలర్ లోనే చూపించేసారు. ఇకపోతే ప్రాణంగా ప్రేమించిన వైశాలి.. సూర్యకి బ్రేకప్ చెప్పడానికి గల కారణం ఏమిటి? సూర్య – వైశాలి ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? చివ‌రికి మ‌ళ్ళీ సూర్య, వైశాలిలను కలిపిన పరిస్థితులు ఏమిటి? అసలు వారిద్దరూ ఎలా క‌లుస్తారు? అనేది మిగతా పడి పడి లేచే మనసు కథ.

నటీనటులు:

పడి పడి లేచే మనసు సినిమాకి మెయిన్ అట్రాక్షన్ శర్వానంద్, సాయి పల్లవి లే. సూర్యగా శర్వానంద్ నటన ఆసాంతం అద్భుతం. ప్రేమికుడిగా.. లవర్ తిరస్కరించిన ప్రేమికుడిగా శర్వానంద్ నటన సూపర్బ్. లుక్ లోనూ శర్వా కొత్తదనం చూపించాడు. ఓ మాదిరిగా పెరిగిన హెయిర్ తో కాస్త గెడ్డం తో డిఫరెంట్ గా న్యూ లుక్ లో కనిపించాడు. సాయి పల్లవితో రొమాంటిక్ సన్నివేశాల్లో శర్వానంద్ నటన పీక్స్ లో ఉంది. సాయి పల్లవి – శర్వానంద్ కెమిస్ట్రీ అదరహో అనేలా ఉంది. వైశాలి పాత్రలో సింపుల్ లుక్స్ తో ఎటువంటి హడావిడి లేకుండా బెస్ట్ పెరఫార్మెన్స్ ఇచ్చింది సాయి పల్లవి. లుక్స్ లో కొత్తదనం లేకపోయినా… గ్లామర్ గా, గ్రాండ్ గా లేకపోయినా… నటనతో, ఫేస్ ఎక్సప్రెషన్స్ తో సాయి పల్లవి నటన చాలా బాగుంది. చుడీదార్స్ లో, మోడరన్ డ్రెస్ ల్లోనూ సాయి పల్లవి లుక్స్ క్యూట్ గా ఉన్నాయి. ఇక డాన్స్ ల పరంగా సాయి పల్లవి మరోసారి అలరించింది. డాక్టర్ గా శర్వా ప్రేమలో పడిన అమ్మాయిగా.. శర్వాకి బ్రేకప్ చెప్పేటప్పటి సీన్స్ లో సాయి పల్లవి నటన అద్భుతం అన్నట్టుగా ఉంది. ఇక శర్వాతో రొమాంటిక్ సన్నివేశాల్లోనూ జీవించింది. అసలు కథ‌నం కొంచెం స్లో అవుతుంద‌ని అనిపించిన టైమ్‌లో శర్వానంద్ – సాయి పల్లవి త‌మ‌దైన న‌ట‌న‌తో సినిమాని ఓ రేంజ్‌లో నిల‌బెట్టారు అంటేనే వారి నటన ఎలా ఉందో తెలుస్తుంది. ఇక సినిమాలో శర్వా – సాయి పల్లవిల తరవాత చెప్పుకోదగిన పాత్రల్లో సునీల్, వెన్నెల‌ కిషోర్, ప్రియ‌ద‌ర్శిల కనబడ్డారు. కానీ కామెడీ పరంగా వారిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. సెకండాఫ్‌లో సునీల్ వచ్చినా ఆయన పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. మురళి శర్మ, ప్రియా రామన్‌, సంపత్‌లు పరిధి మేర బాగానే నటించారు. ప్రియా రామ్ లాంటి నటులను దర్శకుడు సరిగ్గా వాడుకోలేకపోయాడు.

సాంకేతిక వర్గం పనితీరు:

విశాల్ చంద్రశేఖర్ సంగీతం సినిమాకి మెయిన్ హైలెట్. పాటలు రొమాంటిక్ గా విజువల్ గా అదరగొట్టాయి. పాట‌ల‌న్నింటికీ ఇప్ప‌టికే మంచి రెస్పాన్స్ రాగా.. విజువ‌ల్‌గా చూస్తే మాత్రం వావ్ అనేలా అనిపిస్తున్నాయి. ఇక విశాల్ చంద్రశేఖర్ నేపథ్య సంగీతం కూడా బాగుంది. రొమాంటిక్ అండ్ ఎమోషనల్ సన్నివేశాల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ ని పైకి లేపింది. ఇక సినిమాకి మరో మెయిన్ హైలెట్ జయ్ సినిమాటోగ్రఫీ. జయ్ కెమెరా పనితనం ప్రతి ఫ్రేమ్ లోనూ కనబడుతుంది. కోల్ కత్త నేపధ్య సన్నివేశాలు, సాంగ్ పిక్చరైజేషన్ అన్ని గ్రాండ్ గా కెమెరాలో బంధించాడు. సినిమాకి మెయిన్ హైలెట్ సినిమాటోగ్రఫీనే. ఇక శ్రీకర్ ఎడిటింగ్ గురించి చెప్పాలంటే .. ఫస్ట్ హాఫ్ లో ఎడిటింగ్ లో ఒంకలు పెట్టడానికి లేదుగాని… సెకండ్ హాఫ్ లో చాలా కత్తెర్లు వేయాల్సిన సీన్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ షార్ప్ గా ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. ఇక నిర్మాత‌లు ప్ర‌సాద్ చుక్కప‌ల్లి, చెరుకూరి సుధాక‌ర్ ఎలాంటి కాంప్ర‌మైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మించారు. నిర్మాతల ఖర్చు ప్రతి ఫ్రేమ్ లోనూ తెలుస్తుంది.

విశ్లేషణ:

లై సినిమా డిజాస్టర్ తర్వాత ప్రేమ కథ చిత్రాల దర్శకుడు హను రాఘవపూడికి బ్రేక్ వస్తుంది అనుకుంటే.. మహానుభవుడుతో హిట్ అందుకున్న శర్వానంద్.. హనుకి అవకాశమిచ్చాడు. హను రాఘవపూడి శర్వానంద్ కి లవ్ స్టోరీ పర్ఫెక్ట్ సెట్ అవుతుందని భావించి పడి పడి లేచే మనసు కథ రాసుకున్నాడు. ఇక శర్వా పక్కన ప్రస్తుతం ఫామ్ లో ఉన్న హీరోయిన్ సాయి పల్లవిని తీసుకోవడం ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్. ఈ సినిమాకి హీరో, హీరోయిన్స్ ని శర్వాని, సాయి పల్లవిని తీసుకోవడంతోనే సగం హిట్ అక్కడే కొట్టేసాడు. కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన పలు తెలుగు చిత్రాలు విజయాన్ని సాధించాయి. తాజాగా దర్శకుడు హను రాఘవపూడి అదే తరహాలో ప్రేమ, లివింగ్ రిలేషన్ షిప్ నేపథ్యంలో రొమాంటిక్ ప్రేమకథను చెప్పే ప్రయత్నం చేశారు. ప్రేమికులుగా ఉన్నప్పుడే అసలైన లవ్ ఉంటుందని.. పెళ్లి అయితే ప్రేమ ఉండదనే కాన్సెప్ట్‌ లో కొన్ని సినిమాలు ఆల్రెడీ వచ్చేసాయి. రొటీన్ కథ తోనే సెట్స్ మీదకెళ్ళిన హను రాఘవపూడి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో ఆకట్టుకున్నాడు. పాత కథల్లోలాగే ఇద్దరు డీప్ గా ప్రేమించుకోవడం, అలాగే ఒక బలమైన కారణంతో విడిపోవడం, మళ్ళీ తర్వాత ప్రేమ కోసమా ప్రేమ కోసం పడరాని పట్లు పడి… కలుసుకోవడం అనే పాయింట్ మీదే కథను అల్లేసుకున్నాడు హను రాఘవపూడి. ఇద్దరూ విడిపోవడానికి బలమైన కారణం చూపించకపోవడం, తిరిగి కలుసుకోవడానికి ఇద్దరూ మళ్లీ ప్రేమలో పడటం, భూకంపం, హీరోయిన్‌కి మెమొరీ లాస్ లాంటివి ప్రేక్షకుల్ని గందరగోళానికి గురి చేశాయి. ఫస్టాఫ్ మొత్తం సాఫీగా సాగిపోయిన ఈ ప్రేమకథ.. సెకండాఫ్‌లో లేనిపోని ట్విస్ట్‌ లు స్పీడ్ బ్రేకర్స్‌ లా తగిలాయి. తొలిభాగం ఇంట్రస్టింగ్‌గా ఉన్నప్పటికీ ద్వితీయార్ధంలో కథను ముందుకు తీసుకువెళ్లడంతో దర్శకుడు ఇబ్బంది పడ్డాడు. ఏం జరగబోతుందో ముందే తెలిసిపోవడంతో జరిగిన కథనే మళ్లీ చూపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అయితే కథలో పస లేకపోయినా హీరో, హీరోయిన్ రొమాంటిక్ ట్రాక్ తో, కథలో సందర్భానుసారంగా వచ్చే పంచ్ డైలాగ్స్ తోనే కథనాన్ని నడిపించాడు. మొదటి నుండి చెప్పుకున్నట్టుగా ఫస్ట్ హాఫ్ అంతా శర్వానంద్, సాయి పల్లవిల రొమాంటిక్ ట్రాక్, సాంగ్స్ అంతా డీసెంట్ గానే ఉంది. అయితే మంచి ట్విస్ట్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చిన హను సెకండ్ హాఫ్ స్లో నేరేషన్ తో కాస్త నెమ్మదించింది. సినిమాలో గ్రాఫ్ పడిపోతుంది అని అనుకున్నప్పుడల్లా.. సాయి పల్లవి, శర్వాలు తమ నటనతో సినిమాని నిలబెట్టిన.. సెకండ్ హాఫ్ స్లోగా సాగే కథనంతో కాస్త ప్రేక్షకుడికి బోర్ ఫీలింగ్ తెప్పించాడు.

ప్లస్ పాయింట్స్: శర్వానంద్ నటన, సాయి పల్లవి నటన, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కథనం, హను దర్శకత్వం, ఫస్ట్ హాఫ్

మైనస్ పాయింట్స్: కథ, ఎడిటింగ్, స్లో నేరేషన్, సెకండ్ హాఫ్

రేటింగ్: 2.75 /5

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*