సర్కార్ మూవీ రివ్యూ

Vijay Murugadas Sarkar Movie Review Collections

సర్కార్ మూవీ రివ్యూ
బ్యానర్: సన్ పిక్చర్స్
నటీనటులు: విజయ్, కీర్తి సురేష్, వరలక్ష్మి శరత్ కుమార్, రాధారవి, యోగి బాబు, తులసి శివమణి, వైశాలి తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: ఏఆర్ రెహ్మాన్
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: గిరీష్ గంగాధరం
నిర్మాత: కళానిధి మారన్
దర్శకత్వం: ఏఆర్ మురుగదాస్

మురుగదాస్ ఒక టాలెంటెడ్ డైరెక్టర్. ఇళయ దళపతి విజయ్ అంటే తమిళనాట స్టార్ హీరో. మరి మురుగదాస్ – విజయ్ కాంబో అంటే రికార్డుల కొల్లగొట్టే కాంబో. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘తుపాకీ, కత్తి’ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్. అందుకే వాళ్ల కాంబో రిపీట్ అవుతుంది అంటే ఆ సినిమాపై ఎక్కడలేని అంచాలు వచ్చేస్తాయి. మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా ‘తుపాకీ’ సినిమాలో విజయ్ ఒక సైనికుడిగా బోర్డర్ లో మాత్రమే దేశాన్ని కాపాడడం కాదు… లోపల కూడా దేశాన్ని కాపాడాలని… స్లీపర్ సెల్స్ ని సమూలంగా నాశనం చేసే సైనికుడి కేరెక్టర్ లో అదరగొట్టాడు. ఆ సినిమాకి మెయిన్ అట్రాక్షన్ మురుగదాస్ దర్శకత్వం, మెస్సేజ్ ఓరియెంటెడ్ మూవీ గా ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక రెండో సినిమాగా విజయ్ – మురుగ కాంబోలో వచ్చిన ‘కత్తి’ బ్లాక్ బస్టర్ హిట్. ఆ సినిమాలో విజయ్ ని డ్యూయెల్ రోల్ లో చూపించిన మురుగదాస్ మెస్సేజ్ ఓరియెంటెడ్ సినిమాతో అదరగొట్టారు. ఆ సినిమాకి కూడా మురుగదాస్ డైరెక్షన్ స్కిల్స్, విజయ్ నటన అద్భుతం. ఇక ముచ్చటగా మురుగదాస్ – విజయ్ కాంబోలో తెరకెక్కిన ‘సర్కార్’ సినిమా కూడా ఆ రేంజ్ హిట్ అవుతుందనే అంచనాలతోనే ప్రేక్షకులు ఉన్నారు. విజయ్ కి ‘మెర్సల్’ యావరేజ్ హిట్ ఇచ్చినా… అనుకోకుండా ఆ సినిమాకి అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. కానీ సినిమా యావరేజే. ఇక మురుగదాస్.. మహేష్ ని పెట్టి ‘స్పైడర్’ అనే డిజాస్టర్ సినిమా చేసి ఉన్నారు. అయినప్పటికీ విజయ్ – మురుగదాస్ కాంబో మీద ఎనలేని అంచనాలు వెలకట్టలేని క్రేజ్ ఏర్పడ్డాయి. ఇక సినిమా మీదున్న క్రేజ్ తో నిర్మాతలు ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా భారీగా లెవల్లో విడుదల చేశారు. మరి అంత భారీ అంచనాలను దర్శకుడు మురుగదాస్, హీరో విజయ్ అందుకున్నారా? లేదా? అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

పెద్ద కంపెనీ సీఈఓ గా, బిజినెస్ మెన్ గా నెంబర్ వన్ స్థానంలో ఉన్న సుందర్ (విజయ్)కి ఎలక్షన్స్ లో వేసే ఓటుకి ఉన్న విలువ బాగా తెలుసు. అందుకే తన రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో తన ఓటును వినియోగించుకునేందుకు ఇండియాకి వస్తాడు. కానీ తాను ఓటు వెయ్యముందే తన ఓటును ఎవరో వేసేస్తారు. తన ఓటు హక్కును ఎవరో వినియోగించుకుని దుర్వినియోగం చేసేశారని.. సుందర్ కోర్టు కి వెళుతాడు. కొన్ని రోజుల తర్వాత కోర్టు మళ్లీ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వానికి ఆర్డర్ వేస్తుంది. అందులో భాగంగానే కొమరవల్లి (వరలక్ష్మి శరత్ కుమార్) సుందర్ ని తండ్రి(రాధారవి) ద్వారా ఇబ్బందులు పెడుతుంది. అసలు విజయ్ ఓటును ఎవరు వినియోగిస్తారు..? ఈ కేసుతో కోమలవల్లి కి ఉన్న సంబంధం ఏమిటి? ఎలక్షన్స్ లో జరిగిన అవకతవకల్ని విజయ్ ఒంటరిగా ఎలా ఎదుర్కున్నాడు? అనేది సర్కార్ మిగతా కథ.

నటీనటుల నటన:

తమిళనాట సూపర్ స్టార్ రజని తర్వాత అంత అభిమాన గణం ఒక్క విజయ్ కే ఉంది. అందుకే అభిమానులు మెచ్చే సినిమాలనే విజయ్ ఎక్కువగా చేస్తున్నాడు కానీ.. తన సినిమాల్లో తన కేరెక్టర్ కి ఏ ప్రత్యేకత కోరుకోవడం లేదా అనిపిస్తుంది ఒక్కోసారి. ఇక సర్కార్ లో విజయ్ సీఈవో గా స్టైలిష్ లుక్ లో అదరగొట్టాడనే చెప్పాలి. విజయ్ వన్ మ్యాన్ షోతో సినిమాని తన భుజాలపై వేసుకొని నడిపించాడు. విజయ్ నటన ,స్టైలిష్ లుక్స్ ఈ చిత్రానికి చాలా ప్లస్ అయ్యాయి. ఇక ఓటు కోసం నానా తంటాలు పడి కోర్టుకెళ్లి ఎలక్షన్స్ నే ఆపించిన సుందర్ పాత్రలో విజయ్ నటన బాగుంది. అయితే కొన్నిచోట్ల విజయ్ నటన బోర్ కొట్టిస్తుంది. అంటే ఓవరేక్షన్ అనిపిస్తుంది. డాన్సుల్లో ఫర్వాలేదు కానీ.. కొన్ని చోట్ల విజయ నటనలో అతి కనిపిస్తుంది. ఇక మహానటి తర్వాత మళ్లీ హిట్ అందుకోని కీర్తి సురేష్ ఈ సినిమా లో విజయ్ మరదలి పాత్రలో లుక్స్ తో ఆకట్టుకున్నప్పటికీ… సోసో పాత్రల్లో మిగిలిపోయింది. అంటే కీర్తి సురేష్ పాత్రకి ప్రాధాన్యతే కనబడలేదు. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ మాత్రం పొలిటికల్ లీడర్ గా విజయ్ తో పోటీ పడి నటించి మెప్పించింది. వరలక్ష్మి నటన క్లైమాక్స్ లో అదరగొట్టేసింది. ఇక రాధారవి సీనియర్ పొలిటిషన్ గా మెప్పించాడు. మిగతా నటీనటులు తమ పరిధి మేర మెప్పించారు.

సాంకేతిక వర్గం పనితీరు:

ఏఆర్ రెహమాన్ ఎప్పటిలాగే ఉసూరుమనిపించాడు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న రెహమాన్ ఈ మధ్య ఏ సినిమా లో చూసినా సో సో మ్యూజిక్ తోనే ఫర్వాలేదనిపిస్తున్నాడు కానీ.. దానిలో ఎక్కడా వైవిద్యమనేది మచ్చుకు కూడా కనబడడం లేదు. ఇక రెహమాన్ మ్యూజిక్ లో సర్కార్ పాటలు జస్ట్ ఓకే అనిపిస్తాయి. సినిమాలో సాంగ్స్ ఏదో అలా నడిచిపోతాయి కానీ.. ప్రత్యేకంగా.. వినసొంపుగా అనిపించే పాటలేమీ లేవు. అయితే రెహమాన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. కీలకమైన సన్నివేశాల్ని బ్యాగ్రౌండ్ స్కోర్ ఎలివేట్ చేసింది. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ సినిమాకి వెన్నెముఖలా నిలిచింది. ప్రతి ఫ్రెమ్ లో కెమెరా గొప్పదనం కనబడింది. ఇక శ్రీకర ప్రసాద్ ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉంటే బెటర్ గా ఉండేది. సన్ పిక్చర్స్ నిర్మాణ విలువల బాగున్నాయి. సినిమా రిచ్ గా తెరకెక్కింది.

విశ్లేషణ:

మెసేజ్ ఓరియెంటెడ్ అంశాలను జోడించి కమర్షియల్ మూవీస్ తెరకెక్కించండంలో దిట్టయిన డైరెక్టర్ మురుగదాస్ ఈ సర్కార్ చిత్రాన్ని కూడా అదే పంథాలో తెరకెక్కించాడు. అయితే ఆ ప్రయత్నంలో పూర్తి స్థాయిలో విజయం సాదించలేకపోయాడు. ప్రస్తుతం సమాజంలో ఓట్లను ఎలా దుర్వినియోగ పరుస్తున్నారు అనే విషయాలను ఆసక్తికరంగా చూపెట్టాడు. అయితే మొదటి భాగంలో వచ్చే రెండు యాక్షన్ ఎపిసోడ్లు చిత్రానికి హైలైట్ గా నిలిచాయి. కథను బలంగా రాసుకుని.. కథనాన్ని హైలెట్ చేసే మురుగదాస్ ఈ సర్కార్ విషయంలో అడుగడుగునా తడబడ్డాడనే చెప్పాలి. స్పైడర్ సినిమాని తమిళులు మాత్రమే మెచ్చేలా చేసి డిజాస్టర్ కొట్టిన మురుగదాస్ ఇప్పుడు సర్కార్ విషయంలోనూ అదే తప్పు చేసాడు. కేవలం విజయ్ క్రేజ్ ని వాడుకుని… తన కథలో కానీ, కథనంలో కానీ ఎలాంటి కొత్తదనం లేకుండా చేసుకున్నాడు. కేవలం విజయ్ కోసం ఈ సినిమాని మురుగదాస్ తెరకెక్కించాడా అనిపిస్తుంది. పెద్ద కంపెనీ సిఈఓ గా ఉన్న విజయ్ తను కావాలనుకున్న కంపెనీలని కొనెయ్యడం.. వాటిని మూసెయ్యడం లాంటివి ఎందుకు చేస్తాడు… అసలు అంత పెద్ద కంపెనీ సీఈవో అయిన విజయ్ కి ఓటంటే అంత ఇంపార్టెన్స్ ఎందుకు కలుగుతుందో… కలిగాక.. ఆ ఓటు కోసం ఒక సామాన్యుడిలా పోరాడడం, అలాగే ఓటు కోసం ఎలక్షన్స్ ఆపించడం, తర్వాత అంత గొప్ప సీఈవో గా ఉన్న విజయ్ అతి సామాన్యుడిగా ఎలక్షన్స్ కోసం పోరాడడం కాస్త వింతగా అనిపిస్తుంది. అయితే పొలిటికల్ గా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మిగతా విషయాలను విస్మరించారనిపిస్తుంది. ఇక విజయ్ కి, వరలక్ష్మి కి మధ్య కొన్ని సీన్స్ హైలెట్ అనేలా ఉన్నాయి. సెకెండాఫ్ లో చాలా సన్నివేశాలు మరీ సినిమాటిక్ గా సాగడం, చాలా చోట్ల లాజిక్ కూడా లేకపోవడం సినిమా ఫలితాన్ని దెబ్బ తీసింది. అయితే ఈ సినిమాలో ఎక్కడా మురుగదాస్ మార్క్ అనేది కనబడలేదు. అసలు తుపాకీ, కత్తి సినిమాలు చేసిన మురుగనేనా ఈ సర్కార్ సినిమా తీసింది అని అనిపిస్తుంది. హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ సామాజిక అంశాలను గంగలో కలిపేసాడనిపిస్తుంది. మరి తుపాకీ, కత్తి తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ విజయ్ – మురుగ కాంబో హ్యాట్రిక్ కొడతారని అనుకుంటే… ఇద్దరు కలిసి కనీసం యావరేజ్ అయినా కొట్టినట్లుగా కనిపించడం లేదు.

ప్లస్ పాయింట్స్: విజయ్ నటన, వరలక్ష్మి నటన, సినిమాటోగ్రఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్

మైనస్ పాయింట్స్: మ్యూజిక్, కీర్తి సురేష్, ఎడిటింగ్, కథనం, దర్శకత్వం, తమిళ నేటివిటీ, సెకండ్ హాఫ్

రేటింగ్: 2.25/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*